సీనియర్ యాక్టర్ బ్రహ్మాజీ (Brahmaji) చాన్నాళ్ల తర్వాత ప్రధాన పాత్ర పోషించిన చిత్రం “బాపు” (Baapu). దయాకర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఆమని (Aamani), ధన్య బాలకృష్ణ (Dhanya Balakrishna), బలగం సుధాకర్ రెడ్డి (Sudhakar Reddy), మణి (Mani Aegurla) , రచ్చ రవి (Racha Ravi) కీలకపాత్రలు పోషించారు. ఓ తండ్రి కథగా తెరకెక్కిన ఈ సినిమా టీజర్ & ట్రైలర్ మంచి ఆసక్తి నెలకొల్పాయి. మరి సినిమా ఎలా ఉందో చూద్దాం..!!
కథ: పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన మల్లన్న (బ్రహ్మాజీ)కి వర్షం కారణంగా చేతికొచ్చిన పంట నాశనం అవ్వడం అనేది నెత్తి మీద పిడుగు పడినట్లవుతుంది. అప్పులోళ్ల పంచాయితీ ఒకపక్క, కుటుంబ బాధ్యతలు ఒక పక్క.. ఏం చేయాలో తోచక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడు. ఈ క్రమంలో తాను మరణించడం కంటే.. తన తండ్రి రాజన్న (బలగం సుధాకర్) మరణిస్తే గవర్నమెంట్ ఇచ్చే 5 లక్షల రూపాయలతో కొన్ని అప్పులైనా తీర్చుకోవచ్చు అనుకుంటాడు. రాజన్న చావు కోసం మల్లన్న, అతని భార్య, కొడుకు, కూతురు ఎలా ఎదురుచూశారు? ఎలాంటి ప్రయత్నాలు చేశారు? అనేది “బాపు”(Baapu) కథాంశం.
నటీనటుల పనితీరు: తన 40 ఏళ్ల కెరీర్లో ఎన్నో తరహా పాత్రలు పోషించిన బ్రహ్మాజీ ఈ చిత్రంలో మల్లన్న అనే సగటు రైతుగా జీవించేశాడు. తెలంగాణ యాస, వ్యవహారశైలి వంటివన్నీ చాలా సహజంగా కుదిరాయి. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో నిబ్బరంగా కనిపిస్తూనే కన్నీరు పెట్టుకునే సందర్భాల్లో నటుడిగా తన సీనియారిటీ ప్రూవ్ చేసుకున్నాడు. బలగం ఫేమ్ సుధాకర్ రెడ్డి మరోసారి తాత/తండ్రి పాత్రలో అలరించాడు. ఈ సినిమాలో ఆయన మతిమరుపు ఉన్న వ్యక్తి పాత్రలో కాస్తంత హాస్యాన్ని కూడా జోడించాడు. అలాగే.. కుటుంబ బాధ్యతలను గుర్తుచేసే సంభాషణలతో ఆలోచింపజేశాడు కూడా.
ఆమని ఆశ్చర్యపరిచింది. ఆమెను ఇప్పటివరకు సగటు తల్లి పాత్రల్లో చూసిన మనకి, ఆమె ఈ చిత్రంలో పోషించిన గ్రే షేడ్ క్యారెక్టర్ ఆమెకు మరిన్ని మంచి ఆఫర్లు తెచ్చిపెడుతుంది. ధన్య బాలకృష్ణ ఓ వయసుడికిన యువతి పాత్రలో మెప్పించింది. మణి పోషించిన పాత్రకి చాలా షేడ్స్ ఉన్నప్పటికీ.. ఇంకా బాగా చేసి ఉండొచ్చు అనిపించింది. శ్రీనివాస్ అవసరాల (Srinivas Avasarala) తన స్క్రీన్ ప్రెజన్స్ తో అలరించాడు.
సాంకేతికవర్గం పనితీరు: ఆర్.ఆర్.ధృవన్ (R R Dhruvan) నేపథ్య సంగీతం సినిమాకి మంచి ప్లస్ అయ్యింది. డార్క్ ఎమోషన్స్ & హ్యూమర్ ని బాగా ఎలివేట్ చేశాడు. పాటలు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. వాసు పెండెం (Vasu Pendem) సినిమాటోగ్రఫీ వర్క్ డీసెంట్ గా ఉంది. అంత తక్కువ బడ్జెట్ లో ఇంత మంచి అవుట్ పుట్ ఇవ్వడం అనేది ప్రశంసనీయం. ముఖ్యంగా తెలంగాణ ఆత్మను బాగా ప్రెజంట్ చేశాడు. అందువల్ల చాలా సహజంగా ఉంటుంది సినిమా మొత్తం. ప్రొడక్షన్ డిజైన్ & ఆర్ట్ వర్క్ బృందం ఎక్కువగా నేచురల్ లొకేషన్స్ లో సినిమాను తీయడం కారణంగా వాళ్ల వర్క్ ఎక్కువగా ఎలివేట్ అవ్వలేదు. చాలా సన్నివేశాలు ఒకే చోట చుట్టేశారు అనిపిస్తుంది. కానీ.. అంతకు మించి స్కోప్ కూడా లేదు.
దర్శకుడు దయాకర్ ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న అంశాల నుండి స్ఫూర్తి పొంది “బాపు” కథను రాసుకున్న విధానం బాగుంది. చాలా సీరియస్ కథకు హ్యూమర్ ను జోడించడం అనేది మెచ్చుకోవాల్సిన విషయం. అది కూడా సిచ్యుయేషనల్ కామెడీ. అందువల్ల ఏదీ ఇరికించినట్లుగా అనిపించదు. అలాగే.. చాలా బలమైన ఎమోషన్స్ ను కూడా హృద్యంగా తెరకెక్కించాడు. అయితే.. కథనం విషయంలో ఇంకాస్త స్ట్రిక్ట్ గా ఉంటే బాగుండేది అనిపించింది. మణి పాత్ర కోసం పాట యాడ్ చేయకుండా ఉండి ఉంటే కథనం ఇంకాస్త క్రిస్ప్ గా ఉండేది.
బ్రహ్మాజీ, ఆమని, బలగం సుధాకర్ రెడ్డి పాత్రలు మాత్రం చాలా బాగా రాసుకున్నాడు. వారి మధ్య సన్నివేశాలు కూడా ఎంటర్టైన్ చేస్తూనే, ఆలోజింపచేస్తాయి. కేవలం 120 నిమిషాల నిడివి ఉన్న ఈ చిత్రాన్ని ముగించిన విధానం మాత్రం పూర్తిస్థాయిలో సంతృప్తినివ్వలేకపోయింది. హ్యాపీ ఎండింగ్ ఇవ్వాలనే ఉద్దేశ్యంతో వాయిస్ ఓవర్ తో ముగించేయడం అనేది సరైన మజా ఇవ్వలేకపోయింది. ఈ తరహా సినిమాలకు ముగింపు అనేది చాలా కీలకం, అప్పటివరకు ఎంత చక్కని ఎమోషన్ పండినా.. చివర్లో సంతృప్తి లోపిస్తే మాత్రం ఏదో తెలియని వెలితి. ఓవరాల్ గా.. దర్శకుడిగా, కథకుడిగా ఫర్వాలేదనిపించుకున్నాడు దయాకర్ రెడ్డి.
విశ్లేషణ: “బాపు” లాంటి సినిమాలు మనిషిలో చచ్చిపోతున్న సెంటిమెంట్స్ & ఎమోషన్స్ ను తట్టిలేపేందుకు చాలా అవసరం. అయితే.. కథనం విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకొని ఉంటే కచ్చితంగా టార్గెట్ రీచ్ అయ్యేది. అలాగే.. సమాజంలో పెట్రేగిపోతున్న హింసకు, ముఖ్యంగా డబ్బు కోసం సొంత మనుషులనే చంపుకునే పైశాచికత్వానికి చెంపపెట్టుగా “బాపు” సినిమా ఉంటుంది.
ఫోకస్ పాయింట్: బాంధవ్యాల బాధ్యతను గుర్తుచేసే “బాపు”.
రేటింగ్: 2.5/5