టాలీవుడ్‌లో తనదైన సినిమాల ఎంపికతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో నిఖిల్ సిద్దార్థ్. స్వామి రారా, ఎక్కడికిపోతావు చిన్నవాడా, అర్జున్ సురవరం వంటి విభిన్న చిత్రాలతో ప్రేక్షకుల మెప్పు పొందిన నిఖిల్, కార్తికేయ 2 విజయం తర్వాత పాన్ ఇండియా స్థాయిలో మరింత క్రేజ్ సంపాదించుకున్నాడు. ఆ తర్వాత కాస్త గ్యాప్ తీసుకుని ఆయన ప్రకటించిన అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘స్వయంభు’.
ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నది భరత్ కృష్ణమాచారి. పూర్తిగా పిరియాడికల్-మైథలాజికల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, మేకింగ్ వీడియో విజువల్స్ సినిమాపై అంచనాలను భారీగా పెంచాయి. యుద్ధ వీరుడిగా నిఖిల్ లుక్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇక సంగీతం విషయానికి వస్తే, KGF వంటి ప్రతిష్టాత్మక చిత్రానికి సంగీతం అందించిన రవి బస్రుర్ ఈ మూవీకి స్వరాలు సమకూర్చారు. ఆయన నేపథ్య సంగీతం ఈ కథకు ప్రధాన బలం అవుతుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
ఫిబ్రవరి 13న విడుదల అనే ప్రచారం ఉన్నప్పటికీ, షూటింగ్ ఇంకా పూర్తికాకపోవడం, ప్రమోషన్స్ హడావుడి ఇంకా మొదలు కాకపోవడంతో కేవలం 20 రోజులు మాత్రమే ఇంకా మిగిలివుండటంతో, విడుదల తేదీపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియాలో వాయిదా వార్తలు వినిపిస్తున్నా, అధికారిక ప్రకటన మాత్రం రావాల్సి ఉంది. ఈ సినిమాలో నిఖిల్ పూర్తిగా కొత్త అవతార్‌లో కనిపించనున్నాడని టాక్. పాన్ ఇండియా రిలీజ్ లక్ష్యంగా రూపొందుతున్న స్వయంభు రిలీజ్ పై క్లారిటీ రావాలంటే చిత్ర యూనిట్ స్పందిస్తే తప్ప ఈ విషయంలో సినీ ప్రేక్షకులకు విడుదలపై ఒక క్లారిటీ వచ్చేలా లేదు.