‘పెద్ది’ సినిమా ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడింది.. ఒకసారి ప్రీపోన్ అయింది. అలా మార్చి 26 నుండి జూన్ 4కి వచ్చింది. గట్టిగా చూస్తే నెల రోజులు కూడా లేని ఈ సమయంలో ఓ చర్చ టాలీవుడ్ వర్గాల్లో, తెలుగు సినిమా సోషల్ మీడియా వర్గాల్లో జరుగుతోంది. అదే ఈ సినిమా బాలీవుడ్ రిలీజ్ గురించి. ‘పెద్ది’ సినిమాను పాన్ ఇండియా రేంజిలో విడుదల చేస్తామని చిత్రబృందం ఇప్పటికే చెప్పింది. దానికితోడు ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించింది బాలీవుడ్ స్టార్ బ్యూటీ జాన్వీ కపూర్. మరి అక్కడ భారీ రిలీజ్ లేకుండా ఎలా?
అసలు ఈ మాట బయటకు రావడానికి కారణం.. జూన్ 4న బాలీవుడ్‌లో మరో పెద్ద సినిమా విడుదలకు రెడీ అవుతుండటమే. వరుణ్ ధావన్ – డేవిడ్ ధావన్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’ సినిమా కూడా అదే డేట్‌కి వస్తోంది. పూర్తిగా మాస్, కమర్షియల్ సినిమాగా ఈ సినిమా ఉండబోతోంది. ఎందుకంటే ఆ సినిమా దర్శకుడు డేవిడ్ ధావన్ కాబట్టి. అందులోనూ మృణాల్ ఠాకూర్, పూజా హెగ్డే లాంటి భామలు హీరోయిన్‌గా ఉన్నారు.
వరుణ్‌కి ఇప్పుడు బాలీవుడ్‌లో మంచి క్రేజే ఉంది. దీంతో బాలీవుడ్‌లో ‘పెద్ది’ సినిమాకు ఆశించిన థియేటర్లు దొరుకుతాయా అనేది ప్రశ్నగా మారింది. అయితే ఈ పరిస్థితి ముందుగానే ఊహించిన ‘పెద్ది’ టీమ్ తమ సినిమా బాలీవుడ్ డిస్ట్రిబ్యూషన్‌ని జియో స్టూడియోస్‌కి ఇచ్చేసిందని సమాచారం. వారికి హిందీ బెల్ట్‌లో స్క్రీన్స్ బాగానే ఉన్నాయి. కాబట్టి ‘పెద్ది’ ఈ విషయంలో ఇబ్బందిపడక్కర్లేదు అంటున్నారు. అందులోనూ జియోకి చెందిన క్యాంపా డ్రింక్స్‌కి రామ్‌చరణ్ బ్రాండ్ అంబాసిడర్ కూడా.
రామ్‌చరణ్ తన సినిమా కోసం ఆ పరిచయాన్ని వాడుకుంటాడు అని అనలేం. కానీ ఆ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. అందులోనూ ఆ యాడ్‌లో లుక్, ‘పెద్ది’ సినిమాలో రామ్‌చరణ్ లుక్ ఒకేలా ఉంటాయి. కాబట్టి ‘పెద్ది’ సినిమాను క్యాంపా బాగా వాడేయొచ్చు కూడా. చూద్దాం ఏమవుతుందో?