‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాకు నేపథ్య సంగీతం ఇవ్వాల్సిన దేవిశ్రీ ప్రసాద్ హఠాత్తుగా తప్పుకున్నారు/ తప్పించారు. ఆ ప్లేస్‌లోకి తమన్ వచ్చి పని పూర్తి చేశారు. ఆయన తప్పుకోవడానికి సినిమా టీమ్ చాలా కారణాలు చెబుతున్నారు. ఎక్కువగా చెప్పేది సినిమా ప్రీపోన్ అయింది కాబట్టి దేవికి కుదరదు.. తమన్‌ని తెచ్చాం అని. అయితే సినిమా చూశాక అసలు కారణం అది కాదని, ఇది అని ఓ చర్చ టాలీవుడ్‌లో, సోషల్ మీడియాలో బలంగా సాగుతోంది. అదే ‘పాత పాటలు’. అవును పాత పాటలే.
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలో ఓ నాలుగైదు పాత పాటలు ఉన్నాయి. ఒకటి పూర్తి స్థాయిలో వచ్చిన ‘తొలిప్రేమ’లోని ‘ఈ మనసే..’ సాంగ్. పాట మొత్తం రీమిక్స్ కాబట్టి నో ఇష్యూ. కానీ మరికొన్ని పాటలను అవసరార్థం, గుర్తు చేయాలనే ఆలోచనతో వాడేశారు. వీటి వినియోగమే ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్‌ని సినిమా నుండి దూరం చేశాయి అంటున్నారు. వేరే సంగీత దర్శకుడి పాటలు రీమిక్స్, రీయూజ్‌లు చేయడం నచ్చక ఆయన సైలంట్‌గా నో చెప్పేశారు అని అంటున్నారు.
‘రుద్రవీణ’ సినిమా కోసం ఇళయరాజా స్వరపరిచిన ‘తరలిరాదా తనే వసంతం..’ పాటకు బీట్స్ మిక్స్ చేసి ఫైట్ కోసం వాడారు. ఇక సినిమా ప్రారంభంలో ‘గుంటూరు కారం’ సినిమాలోని ‘కుర్చీ మడతపెట్టి..’, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని ‘నాటు నాటు..’ పాట బిట్స్ వాడారు. ఇక చిరంజీవిని గుర్తు చేసేలా ‘గ్యాంగ్ లీడర్’, ‘ఠాగూర్’ సినిమా పాటల బిట్స్ కూడా వాడుకున్నారు. ఇవన్నీ సినిమాలోకి రావడం.. డీఎస్పీ ఎగ్జిట్‌కి కారణం అని అంటున్నారు.
ఇక మరో విషయం చూసుకుంటే.. ఇలా పాత పాటలు వాడుకున్నందుకుగాను మైత్రీ మూవీ మేకర్స్ ఆ సంగీత దర్శకులకు బాగానే ముట్టజెప్పింది అని అంటున్నారు. ఎందుకంటే ఒకప్పటిలా పాటలు ఉచితంగా వాడేసే పరిస్థితి లేదు. అది ఎన్ని సెకన్లు అయినా. ఇదంతా ఇళయరాజాగారి చలవే.