‘రంగస్థలం’కు అవార్డులు రాకుంటే అన్యాయం జరిగినట్లే – చిరంజీవి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్ని రోజుల క్రితం ప్రకటించిన నంది అవార్డులు వివాదాలకు కేంద్ర బిందువైంది. దీనిపై కొంతమంది టెక్నీషియన్లు, నటీనటులు మీడియా ముందు విమర్శలు గుప్పించారు. మరికొంతమంది సోషల్ మీడియాలో టీడీపీ అవార్డులని హేళన చేసారు. మెగా, అక్కినేని హీరోలకు అన్యాయం జరిగిందని అన్నవారు లేకపోలేదు. ఆ సమయంలో అవార్డుల ప్రకటనపై ఎటువంటి కామెంట్ చేయని చిరు.. ఈసారి గట్టిగానే స్పందించారు. తన తనయుడు రామ్ చరణ్ తేజ్ నటించిన రంగస్థలానికి అనేక కేటగిరీల్లో జాతీయ స్థాయి అవార్డులు రావాల్సిందేననని అభిమానుల సమక్షంలో చెప్పారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన రంగస్థలం ప్రీ రిలీజ్ వేడుక నిన్న వైజాక్ లో వైభవంగా జరిగింది. ఈ వేడుకకు ముఖ్యఅతిథిగా హాజరైన చిరంజీవి వేదికపై ఎంతో ఎమోషన్ గా మాట్లాడారు.

” ఈ సినిమా అన్ని విధాలుగా, అన్ని కోణాల్లోంచి కూడా అత్యద్భుతం అనిపించుకుంటుంది. అభిమానులతో శభాష్ అనిపించుకుంటుంది. అవార్డుల కోసమే సినిమాలు తీయరు.. కానీ ఈ సినిమా మాత్రం అవార్డులు సొంతం చేసుకుంటుంది. చిత్రంలోని అన్ని డిపార్ట్‌మెంట్స్‌కు అవార్డులు వస్తాయి. జాతీయస్థాయిలో ఈ సినిమాలు అవార్డు వస్తుందన్నా ఇందులో ఎలాంటి ఆశ్చర్యం లేదు. అవార్డులు రావాలి.. రాకపోతే సినిమాకు అన్యాయం జరిగినట్లే.” అని చిరు అన్నారు. అతని మాటల్లో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల పేరు రాకపోయినప్పటికీ పరోక్షంగా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు వార్నింగ్ ఇచ్చినట్టే ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. చిరు మాటలు ఇప్పుడు టాక్ ఆఫ్ టాలీవుడ్ అయ్యాయి. చరణ్ సరసన తొలిసారి సమంత నటించిన ఈ మూవీ మార్చి 30 న థియేటర్లోకి రానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus