సూపర్ స్టార్ రజనీకాంత్ ఒక కమర్షియల్ హిట్ కొట్టి దాదాపు పుష్కరం దాటిపోయింది. “రోబో” తర్వాత ఆయనకి సరైన హిట్ లేదు. మధ్యలో వచ్చిన “2.0, పేట” ఫ్యాన్స్ ను ఓ మోస్తరుగా సంతృప్తిపరిచినప్పటికీ.. పూర్తిస్థాయిలో మాత్రం అలరించలేదు. అయితే ఆయన తాజా చిత్రం “జైలర్” మాత్రం ఎన్నడూ లేని విధంగా మంచి అంచనాలు నమోదు చేసింది. “డాక్టర్” ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మోహన్ లాల్, శివరాజ్ కుమార్ లు కీలకపాత్రలు పోషించారు. విడుదలైన ట్రైలర్, పాటలు సినిమా మీద అంచనాలని మరింత పెంచేశాయి. మరి ఈ సినిమాతోనైనా రజనీ మళ్ళీ కమర్షియల్ హిట్ కొట్టగలిగారా? తెలుగు-తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదలవుతున్న ఈ సినిమా ప్రేక్షకుల్ని ఏమేరకు ఆకట్టుకుంది అనేది చూద్దాం..!!
కథ: జైలర్ గా తీహార్ జైల్లో సర్వీస్ ముగించుకొని.. భార్య, కొడుకు, కోడలు & మనవడుతో సరదాగా సమయం గడుపుతూ ఉంటాడు ముత్తువేల్ పాండియన్ (రజనీకాంత్). దేవుడి విగ్రహాల చోరీ ఇన్వెస్టిగేషన్ లో కనిపించకుండాపోయిన కొడుకుని వెతుక్కుంటూ మళ్ళీ పాత జీవితంలోకి వస్తాడు ముత్తువేల్ పాండియన్. అసలు ముత్తువేల్ పాండియన్ గతం ఏమిటి? అతడి కొడుకుని ఎవరు కనబడకుండా చేశారు? వాళ్ళను ముత్తువేల్ ఎలా జయించాడు? అనేది “జైలర్” కథాంశం.
నటీనటుల పనితీరు: రజనీ నటన, స్క్రీన్ ప్రెజన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన తెరపై కనిపిస్తే చాలు ఈలలు, గోలలు వేసే అభిమానులకు ఈ చిత్రం విందు భోజనం లాంటిది. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్, పోస్ట్ ఇంటర్వెల్ సీన్ & క్లైమాక్స్ సీన్స్ లో రజనీకాంత్ ను చూసిన ప్రేక్షకుడెవరూ కుర్చీలో మిన్నకుండలేడు. శివరాజ్ కుమార్, మోహన్ లాల్ ల స్క్రీన్ ప్రెజన్స్ & వారి ఎలివేషన్ సీన్స్ బాగున్నాయి.
యోగిబాబు, కింగ్ స్లేల కామెడీ ఆకట్టుకుంది. సునీల్ పాత్ర వల్ల సినిమాకి ఎలాంటి ఉపయోగమూ లేకపోయినప్పటికీ.. అతడి నటన మాత్రం అలరించింది. ఇక తమన్నా ఒక్క పాట, రెండు సీన్స్ తో సరిపెట్టుకుంది. రజనీకాంత్ తర్వాత తన నటనతో ఆకట్టుకున్న మరో వ్యక్తి మలయాళ నటుడు-దర్శకుడు వినాయగన్. విలన్ గా అతడి ఆహార్యం, హావభావాలు విశేషంగా ఆకట్టుకున్నాయి.
సాంకేతికవర్గం పనితీరు: దర్శకుడిగా నెల్సన్ పూర్తిస్థాయిలో ఆకట్టుకోలేకపోయాడనే చెప్పాలి. మూలకథను “నోబడీ” (2021) అనే హాలీవుడ్ సినిమా నుంచి స్పూర్తి పొంది రాసుకున్న నెల్సన్.. అందులో డార్క్ హ్యూమర్ ను ఇరికించడానికి చేసిన ప్రయత్నం ఓ మోస్తరుగా మాత్రమే వర్కవుట్ అయ్యింది. ముఖ్యంగా అద్భుతమైన ఫస్టాఫ్ తర్వాత సెకండాఫ్ లో రాసుకున్న సునీల్-తమన్నా ట్రాక్ & కిరీటం దొంగతనం ఎపిసోడ్ మొత్తం సినిమాకి మైనస్ గా నిలిచింది. కాకపోతే.. రజనీకాంత్ చరిష్మా & క్లైమాక్స్ లో సెంటిమెంట్ యాంగిల్ ను వినియోగించుకున్న విధానం బాగుంది.
అనిరుధ్ ఈ సినిమాకి సెకండ్ హీరో. అసలు సన్నివేశంలో ఎలాంటి హైప్ లేకపోయినా.. తన నేపధ్య సంగీతంతో సినిమాని ఎలివేట్ చేసిన విధానం అభినందనీయం. విజయ్ కార్తీక్ కణ్ణన్ సినిమాటోగ్రఫీ వర్క్ కూడా బాగుంది. ప్రొడక్షన్ డిజైన్ & డి.ఐ వర్క్ మంచి సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది.
విశ్లేషణ: సెకండాఫ్ వచ్చే అనవసరమైన కామెడీ ట్రాక్ & లాజిక్ లేని యాక్షన్ బ్లాక్స్ ను ఇగ్నోర్ చేస్తే.. “జైలర్”ను రజనీ & కమర్షియల్ సినిమా ఫ్యాన్స్ మహబాగా ఎంజాయ్ చేస్తారు. నెల్సన్ సెకండాఫ్ మీద ఇంకాస్త జాగ్రత్త చూపి ఉంటే బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేది.
రేటింగ్: 2.5/5