తెలుగు ఫిల్మ్ డాన్సర్స్ అసోసియేషన్ (TFTDDA) ఎన్నికల్లో ఈసారి అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ భార్య సుమలత అలియాస్ అయేషా, ఎలాంటి గ్రూపుల మద్దతు లేకుండా ఒంటరిగా బరిలో దిగినా, భారీ మెజారిటీతో ప్రెసిడెంట్‌గా గెలవడం టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. డిసెంబర్ 7న జరిగిన ఈ ఎన్నికల్లో మొత్తం 510 ఓట్లలో 439 ఓట్లు పోలయ్యాయి. అందులో సుమలత 228 ఓట్లు సాధించగా, ప్రత్యర్థి మరియు గత ప్రెసిడెంట్ జోసెఫ్ ప్రకాశ్‌కు 199 ఓట్లు, మరో అభ్యర్థి చంద్రశేఖర్‌కు 11 ఓట్లు వచ్చాయి. దీంతో 29 ఓట్ల తేడాతో సుమలత విజేతగా నిలిచారు.
ఈ ఎన్నికల్లో జోసెఫ్‌కు శేఖర్ మాస్టర్, భాను మాస్టర్, రఘు మాస్టర్, పోళ్లకి విజయ్ వంటి ప్రముఖులు బహిరంగ మద్దతు ఇవ్వడం కూడా జరిగింది. అయినా కూడా సుమలత విజయం సాధించడం అసోసియేషన్ సభ్యుల్లో ఒకింత ఆశ్చర్యానికి గురిచేసింది. మరోవైపు జానీ మాస్టర్ స్వయంగా పోటీ చేస్తే మళ్లీ కుట్రలు, అడ్డంకులు ఎదురవుతాయనే ఆలోచనతో తన భార్యను స్వయంగా ప్రెసిడెంట్ రేసులోకి తీసుకువచ్చారని సమాచారం.
ఇక జానీ మాస్టర్ పై వచ్చిన లైంగిక వేధింపుల కేసు ఇండస్ట్రీని కుదిపేసిన సంగతి తెలిసిందే. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ శ్రేష్టి వర్మ చేసిన ఆరోపణలతో జానీ మాస్టర్ ఒక దశలో జైలు గోడల మధ్య నరకం అనుభవించారు. సైమా, నేషనల్ అవార్డ్‌లు రద్దు కావడంతో ఆయన కెరీర్ కు గట్టి దెబ్బ తగిలింది. ఆ క్లిష్ట సమయంలో సుమలత తన భర్తకు అండగా నిలిచి, న్యాయపరంగా పోరాడి చివరకు ఆయనను బయటకు తీసుకురాగలిగింది.