తమిళ సినిమా పరిశ్రమ నుండి దర్శకులు టాలీవుడ్‌కి వచ్చి సినిమాలు చేయడం కొత్తేమీ కాదు. గతంలో చాలామంది వచ్చారు, చేశారు వెళ్లారు. అయితే మధ్యలో కొన్ని రోజులు ఈ ఫ్లో ఆగింది. ఒకవేళ చేసినా అక్కడ సినిమాలు మన దగ్గరకు సైమల్టేనియస్ షూటింగ్ అనే అబద్ధంలో డబ్బింగ్ రూపంలో వచ్చేవి. అంటే ‘వరిసు’ సినిమా ‘వారసుడు’ సినిమాగా రావడం అన్నమాట. అయితే ఇప్పుడు పరిస్థితి మారిపోతోంది. తమిళ దర్శకులు తెలుగు హీరోల దగ్గరకు వచ్చి కథలు చెప్పి.. పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు.
ఇప్పటికే ఇద్దరు యువ దర్శకులు తెలుగులోకి వచ్చి సినిమా ఫిక్స్ చేసుకున్నారు. అందులో ఒక సినిమా మొదలవ్వగా.. రెండోది ఈ ఏడాదిలో మొదలవుతుంది అంటున్నారు. ఇంకో దర్శకుడు సినిమా అంతా ఓకే అయిపోయింది.. త్వరలో అనౌన్స్ చేస్తారు అని చెబుతున్నారు. దీంతో ఆ ముగ్గురు కాకుండా కొత్తగా చెన్నైలో ఫ్లయిట్ ఎక్కి టాలీవుడ్‌కి వచ్చే దర్శకుడు ఎవరు అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఓకే చేసుకున్న ఇద్దరు దర్శకుడు అట్లీ, లోకేశ్ కనగరాజ్ కాగా.. అంతా ఓకే అయిన దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్.
అల్లు అర్జున్ ప్రస్తుత చేస్తున్న సినిమాకు అట్లీ దర్శకత్వం వహిస్తున్నారు. ఆ తర్వాత బన్నీ లోకేశ్ కనగరాజ్‌తో సినిమా చేస్తారు. ఈ రెండూ అనౌన్స్ అయిపోయాయి. నెల్సన్ దిలీప్ కుమార్ ‘జైలర్ 2’ సినిమా తర్వాత ఎన్టీఆర్ – నాగవంశీ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తారు అనే విషయం తెలిసిందే. ఆ తర్వాత పీరియడ్ యాక్షన్ సినిమాల స్పెషలిస్ట్ వెట్రి మారన్ తెలుగు ఎంట్రీ ఉండొచ్చట. రామ్ చరణ్‌తో ఓ సినిమాను ఆయన ప్లాన్ చేస్తున్నారట. గతంలో తారక్‌తో అనుకున్నా అప్పుడు వర్కవుట్ కాలేదనే విషయం మీకు తెలిసే ఉంటుంది.
ఆయన కాకుండా ‘అమరన్’ ఫేమ్ రాజ్ కుమార్ పెరియసామి, ‘జై భీమ్’ ఫేమ్ టీజే జ్ఞానవేల్ రెడీ అవుతున్నారట. నానిని ఇటీవల కలసిన జ్ఞానవేల్ ఓ లైన్ చెప్పారని టాక్ నడుస్తోంది.