ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్ జీవితం వెండితెరపైకి వస్తోంది. ‘వైట్’ అనే టైటిల్‌తో ఈ సినిమాను కొన్ని నెలల క్రితం అనౌన్స్ చేశారు. ఈ సినిమాలో శ్రీ శ్రీ రవిశంకర్ పాత్రలో యువ బాలీవుడ్ నటుడు విక్రాంత్ మస్సే కనిపించనున్నారు. అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఈ సినిమా థీమ్ సాంగ్‌ను హాలీవుడ్ ప్రముఖ పాప్ సింగర్ జెన్నిఫర్ లోపెజ్ పాడనున్నారని సమాచారం.
ఈ మేరకు జెన్నిఫర్ లోపేజ్‌ను ‘వైట్’ సినిమా టీమ్ కాంటాక్ట్ అయిందని తెలుస్తోంది. శాంతి, ప్రేమ, ఐకమత్యమనే భారత తత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పేలా ఈ పాటను సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది. దివంగత మైఖేల్ జాక్సన్ పాట ‘హీల్ ది వరల్డ్’ అనే పాట స్ఫూర్తితో ఇప్పుడు ‘వైట్’ సినిమాలో పాటను క్రియేట్ చేస్తున్నారని తెలుస్తోంది. ఈ పాట ఇంగ్లిష్, స్పానిష్ భాషల మిక్స్‌లో ఉంటుందని చెబుతున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయిందట. ఎక్కువగా దక్షిణాఫ్రికాలోనే సినిమాను తెరకెక్కించారు.
మాంటూ బస్సీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను సుమారు 21 భాషల్లో విడుదల చేయాలని చిత్రబృందం నిర్ణయిచింది. ఈ సినిమాలో ప్రపంచవ్యాప్తంగా జరిగిన అనేక కీలక సంఘటనలను చూపించబోతున్నారు. కొలంబియాలో 52 ఏళ్ల పాటు జరిగిన సివిల్ వార్, దానిని ఆపేందుకు శ్రీశ్రీ రవిశంకర్ చేసిన పోరాటం కూడా చూపించబోతున్నారట. ఇలాంటి మరిన్ని సన్నివేశాలు ఈ సినిమాలో ఉండబోతున్నాయి అని చెబుతున్నారు.