సోషల్ మీడియా వాడకం పెరిగినందుకే తమ ప్రైవసీకి భంగం కలుగుతుందని.. చాలా ఇబ్బంది ఎదురవుతుందని సెలబ్రిటీలు నెత్తి నోరు కొట్టుకుంటుంటే.. మరోవైపు ఏఐ వంటి కొత్త టెక్నాలజీ అందుబాటులోకి రావడం.. దాన్ని వాడుకుని కొంతమంది నెటిజన్లు చేస్తున్న వికృత చర్యలు వారిని మరింత ఇబ్బంది పెడుతున్నాయి అని చెప్పాలి. ఇప్పటికే కొంతమంది హీరోలు, హీరోయిన్లు తమ ఫోటోలతో డీప్ ఫేక్ వీడియోలు సృష్టిస్తూ తమ పరువుకు భంగం కలిగిస్తున్నారని హకోర్టుని ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
రష్మిక, నివేదా థామస్ వంటి వారితో పాటు ఇంకా చాలామంది హీరోయిన్లు ఇబ్బంది పడ్డారు. తాజాగా ఈ లిస్టులోకి పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కొడుకు అకీరా నందన్ కూడా వచ్చి చేరాడు.
విషయం ఏంటంటే… అకీరా నందన్ అనుమతి లేకుండా ఏఐ(Artificial Intelligence) సాయంతో ఓ షార్ట్ మూవీ తీశాడు. దీని నిడివి 56 నిమిషాలు ఉంది. యూట్యూబ్‌లో ఈ షార్ట్ మూవీ రిలీజ్ అవ్వడం వైరల్ అవ్వడం జరిగింది.లవ్ స్టోరీ అంటూ ఇందులో అసభ్యకరమైన కంటెంట్ ను చేర్చారు. ఇది చూసిన పవన్ కళ్యాణ్ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో వాళ్ళు కాకినాడ రూరల్ అయినటువంటి సర్పవరం పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ చేశారు.
వారి కంప్లైంట్ ను స్వీకరించిన పోలీసులు నిందితుడు డాక్టర్ మద్దినేని వెంకటరమణని అరెస్ట్ చేశారు. అతను కొంతకాలంగా వైద్య వృత్తికి దూరంగా ఉంటూ… ఏఐ టెక్నాలజీని ఉపయోగించి అకీరా నందన్ ప్రమేయం లేకుండా…ఈ షార్ట్ మూవీని రూపొందించినట్లు పోలీసులు తేల్చారు. అలాగే అతన్ని కోర్టులో హాజరుపరచగా రిమాండ్ కు తరలించడం జరిగింది.
మరోవైపు అకీరా నందన్… తన పేరు, ఫేస్, వాయిస్‌ను ఏఐ ద్వారా దుర్వినియోగ పరచకుండా చూడాలని ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. అలాగే సోషల్ మీడియాలో ఇప్పటివరకు ఉన్న కంటెంట్‌ను తొలగించడమే కాకుండా… భవిష్యత్తులో ఇలాంటి డీప్‌ఫేక్ కంటెంట్ రాకుండా ఆదేశాలు ఇవ్వాలని పేర్కొన్నాడు. ఇన్ఫ్లుయెన్సర్లు, డిజిటల్ కంటెంట్ క్రియేటర్లను కంట్రోల్లో పెట్టేందుకు ఇది అవసరమని కూడా విన్నవించుకున్నాడు.