హైదరాబాద్ వాసులకు ఇప్పటికే ‘ఏఏఏ సినిమాస్’ అంటూ ఓ మల్టీప్లెక్స్ అందుబాటులోకి తీసుకొచ్చిన అల్లు అర్జున్ ఫ్యామిలీ.. ఇప్పుడు మరో మల్టీప్లెక్స్ సిద్ధం చేసింది. అల్లు సినిమాస్ పేరుతో అతి పెద్ద డాల్బీ స్క్రీన్ ఉన్న మల్టీప్లెక్స్‌లు లాంచ్ చేయనుంది. దీనికి సంబంధించి ప్రత్యేకతలు, వివరాలు ఆసక్తికరంగా ఉన్నాయి. అంతేకాదు ఆ స్క్రీన్స్‌లో స్క్రీన్ అయ్యే మొదటి సినిమా కూడా అద్భుతంగా ఉండనుంది. కోకాపేటలో ఈ మల్టీ ప్లెక్స్‌ను సిద్ధం చేస్తున్నారు. దీనికి సంబంధించిన కొన్ని డిజైన్ ఫొటోలు, వివరాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అల్లు సినిమాస్, డాల్బీ సినిమాస్ కలసి ఈ మల్టీప్లెక్స్‌ను ఏర్పాటు చేస్తున్నాయి. మన దేశంలోనే అతిపెద్ద డాల్బీ స్క్రీన్ అల్లు సినిమాస్‌లో ఉండనుంది. 75 అడుగుల పెద్ద స్క్రీన్ ఉంటుంది. DCI ఫ్లాట్ 1.85:1 ఫార్మాట్‌లో ఈ తెరను సిద్ధం చేశారు. బెస్ట్ 3D ఎక్స్‌పీరియన్స్ కోసం అత్యుత్తమ డాల్బీ విజన్, డాల్బీ త్రీడీ ప్రొజక్షన్ టెక్నాలజీని వాడుతున్నట్లు సమాచారం. స్పెషల్ సౌండ్ ఎఫెక్ట్స్ కోసం డాల్బీ అట్మాస్ వినియోగించనున్నారు. అంటే మొత్తంగా డాల్బీ టెక్నాలజీని నింపేయనున్నారు. వీటితోపాటు గార్మెట్ ఫుడ్, ఎల్‌ఈడీ స్క్రీన్లు లాంటి సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశారు.
పిచ్ బ్లాక్ స్టేడియం సీటింగ్ స్టైల్‌తో ప్రేక్షకులకు సరికొత్త ఎక్స్‌పీరియన్స్ అందనుంది. ఇక ఈ స్క్రీన్స్‌ను ‘అవతార్ ఫైర్ అండ్ యాష్’ అనే సినిమాతో స్టార్ట్ చేస్తారని సమాచారం. ఈ నెల 19న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న విషయం తెలిసిందే. దీని కోసం థియేటర్‌ను శరవేగంగా సిద్ధం చేస్తున్నారని సమాచారం. ఇప్పటికే హైదరాబాద్ వాసులకు ప్రసాద్ ఐమాక్స్, ఏఎంబీ సినిమాస్, ఎపిక్ స్క్రీన్స్ వంటి బిగ్ స్క్రీన్ థియేటర్స్ ఉన్నాయి. రవితేజ ఏఆర్‌టీ సినిమాస్ ఏర్పాటు చేశాడు. ఇందులో ఫస్ట్ టైమ్ ఎపిక్ స్క్రీన్‌ను ఏర్పాటు చేశారు. స్క్రీన్స్ ఓపెన్ అయితే మరిన్ని వివరాలు తెలుస్తాయి.