“జిగర్తాండ” చూడని తెలుగువారు చాలా తక్కువగా ఉంటారు. వాళ్ళు కూడా “వాల్మీకి” పుణ్యమా అని చూసేసి ఆ కాన్సెప్ట్ కి తెగ కనెక్ట్ అయిపోయారు. ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కిన చిత్రం “జిగర్తాండ డబుల్ ఎక్స్”. లారెన్స్, ఎస్.జె.సూర్య కీలకపాత్రలు పోషించిన ఈ చిత్రానికి కార్తీక్ సుబ్బరాజు దర్శకుడు. ఎనౌన్స్ మెంట్ వీడియో నుండి ట్రైలర్ వరకూ అన్నీ ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి రేకెత్తించాయి. మరి సినిమా అదే స్థాయిలో ఆకట్టుకోగలిగిందో లేదో చూద్దాం..!!
కథ: నల్లగా ఉన్నావ్.. సినిమాల్లో పనికిరావు ఒకడు కామెంట్ చేయడంతో.. ఎలాగైనా హీరో అవ్వాలని డిసైడ్ అవుతాడు సీజర్ (లారెన్స్), అందుకోసం చాలామంది దర్శకులను పిలిపించి.. వచ్చినవాళ్లందరిలో రేయ్ డాసన్ (ఎస్.జె.సూర్య)ను సెలక్ట్ చేసుకుంటాడు. సీజర్ జీవితాన్నే సినిమాగా తీయాలనుకుంటాడు రేయ్ డాసన్. ఈ క్రమంలో తనకు తెలియని తనలోని మరో కోణాన్ని తెలుసుకొంటాడు సీజర్.
ఏమిటా కోణం? అసలు రేయ్ డాసన్ ఎవరు? సీజర్ దగ్గరకి ఏ ఉద్దేశంతో వచ్చాడు? సీజర్ బయోపిక్ ఎలా రూపొందింది? వంటి ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానమే “జిగర్తాండ డబుల్ ఎక్స్” కథాంశం.
నటీనటుల పనితీరు: నిజానికి ఈ సినిమా ఎనౌన్స్ మెంట్ వచ్చినప్పుడు లారెన్స్ ఇందులో రాంగ్ క్యాస్టింగ్ అనుకున్నారు చాలామంది. కానీ.. సీజర్ పాత్రను అతడు ఆడాప్ట్ చేసుకొని నటించిన విధానం ప్రశంసార్హం. ముఖ్యంగా సెకండాఫ్ & ఆఖరి 30 నిమిషాల్లో లారెన్స్ నటన చూశాక, అతడి మీద గౌరవం పెరుగుతుంది. ఇక నటుడిగా సూపర్ ఫామ్ లో ఉన్న ఎస్.జె.సూర్య ఈ చిత్రంలో రెండు విభిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రలో ఆ ఫామ్ ను కంటిన్యూ చేశాడు.
లారెన్స్ & ఎస్.జె.సూర్య కాంబినేషన్ సీన్స్ & క్లైమాక్స్ లో ఇద్దరి మధ్య వచ్చే పోరాట సన్నివేశాలు అద్భుతంగా వర్కవుటయ్యాయి. మలయాళ నటులు షైన్ టామ్ చాకో & నిమిషా సజయన్ తన నటనా చాతుర్యంతో మెప్పించారు. నవీన్ చంద్ర మరోసారి ఆశ్చర్యపరిచాడు. అతడి నెగిటివ్ రోల్ సినిమాలో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది.
సాంకేతికవర్గం పనితీరు: సంతోష్ నారాయణన్ సంగీతం సినిమాకి పెద్ద ఎస్సెట్. రూరల్ ట్యూన్స్ కి వెస్ట్రన్ టచ్ ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ భలే ఆకట్టుకుంది. ముఖ్యంగా క్లైమాక్స్ లో రెట్రో ఫార్మాట్ ట్యూన్స్ ఎమోషన్ ను అద్భుతంగా ఎలివేట్ చేసింది. తిర్రు సినిమాటోగ్రఫీ వర్క్ కూడా బాగుంది. సన్నివేశంలోని ఎమోషన్ & మూడ్ ని లైటింగ్ & టింట్ తో చాలా టెక్నికల్ గా ఆడియన్స్ ను మూడ్ లోకి తీసుకొచ్చిన విధానం టెక్నీషియన్ గా అతడి ప్రతిభకు తార్కాణం.
దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు ఆలోచనా విధానం ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తుంది. “జిగర్తాండ” సీక్వెల్ అనగానే అదే తరహా సినిమా అనుకున్నారందరూ. కానీ.. సినిమాలో పాయింట్ అవుట్ చేసిన ఆదివాసి సమస్యలు, ప్రకృతి సమస్యలు ఆశ్చర్యపరిచాయి. అయితే.. ఆ సన్నివేశాల ప్లేస్ మెంట్ మాత్రం కాస్త ఇబ్బందిపెట్టింది. ముఖ్యంగా చాలా కీలకమైన 30 నిమిషాల క్లైమాక్స్ సీక్వెన్స్ లో చాలా డెప్త్ ఉన్నప్పటికీ.. అప్పటివరకూ సాగదీసిన కథాంశం వల్ల..
ఆ 30 నిమిషాల ఇంపాక్ట్ పెద్దగా వర్కవుటవ్వలేదు. కథకుడిగా, దర్శకుడిగా కార్తీక్ సుబ్బరాజు ఆలోచనాధోరణిని మెచ్చుకొన్నప్పటికీ.. ఆడియన్స్ ను పూర్తిస్థాయిలో సిద్ధపరచకుండా.. వారిపై తన ఆలోచనలు రుద్దాలని చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. ఓవరాల్ గా కార్తీక్ సుబ్బరాజు తన పనితనాన్ని ప్రూవ్ చేసుకున్నప్పటికీ.. తన మునుపటి చిత్రాల తరహాలో ఆకట్టుకోలేకపోయాడు.
విశ్లేషణ: ఎలాంటి అంచనాలు లేకుండా సినిమా చూసే ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరుస్తుంది “జిగర్తాండ డబుల్ ఎక్స్”. ముఖ్యంగా చివరి 30 నిమిషాల కోసం ఈ సినిమాను కచ్చితంగా ఒకసారి చూడాలి. కాకపోతే.. స్క్రీన్ ప్లే & క్యారెక్టరైజేషన్స్ విషయంలో ఇంకాస్త క్లారిటీ ఉండి ఉంటే కార్తీక్ కెరీర్లో మరో కలికితురాయిగా మారేదీ (Jigarthanda DoubleX) చిత్రం.
రేటింగ్: 2/5