అభయ్ రామ్ తమ్ముడి పేరు భార్గవ్ రామ్

ఎన్టీఆర్, లక్ష్మి ప్రణతిలకు గత నెల మగబిడ్డ జన్మించిన సంగతి తెలిసిందే. ఆరోజు నుంచి తారక్ మరింత ఉత్సాహంగా ఉన్నారు. రెండో రోజే అంటే శుక్రవారమే అభిమానుల కోసం తన చిన్న కుమారుడు ఫోటోని ఎన్టీఆర్ సోషల్ మీడియాలో షేర్ చేసారు. ప్రశాంతంగా నిద్రపోతున్న బాబు ఫోటోని చూసి కుటుంబ సభ్యులు, అభిమానులు ఆనందపడ్డారు. అంతటితో ఆగలేదు. తన పెద్ద కుమారుడికి తమ్ముడిని పరిచయం చేశారు. అభయ్ రామ్ చేతుల్లో తమ్ముడిని ఉంచి తారక్ సంతోషపడ్డారు. ఆ ఫోటోని తన ఇన్ స్టాగ్రామ్ లో తొలి పోస్టుగా ఎన్టీఆర్ ఉంచారు. తాజాగా నలుగురు ఉన్న ఫోటోని షేర్ చేస్తూ పేరుని కూడా వెల్లడించారు. తన రెండో కొడుకుకి భార్గవ్ రామ్ అనే పేరు పెట్టినట్లు వెల్లడించారు.

ఈ పేరు నందమూరి అభిమానులకు బాగా నచ్చింది. హరికృష్ణ తన కొడుకులకి జానకి రామ్, కళ్యాణ్ రామ్, తారక్ రామ్(ఎన్టీఆర్) అని పెట్టుకున్నారు. అలాగే కళ్యాణ్ రామ్ కూడా తన కొడుకుకి శౌర్య రామ్ అని రామ్ వచ్చేలా పెట్టుకున్నారు. అదే విధంగా ఎన్టీఆర్ పెద్ద కొడుకుకి అభయ్ రామ్ అని పెట్టారు. రెండో కొడుకుకి భార్గవ్ రామ్ అని పేరు పెట్టి రామ్ సంప్రదాయాన్ని కొనసాగించారు. ప్రస్తుతం ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అరవింద సమేత వీర రాఘవ సినిమా చేస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 10 న రిలీజ్ కానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus