ఎప్పుడు ప్రారంభమవుతుంది అనే విషయంలో క్లారిటీ లేని ఓ సినిమాకు ఏకంగా పేరు పెట్టేశారు పుకారు రాయుళ్లు. ఆ సినిమా మొదలవ్వాలంటే రెండు, మూడు సినిమాల విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు వస్తున్న పుకార్ల వల్ల సినిమా ఇబ్బందుల్లో పడుతుందేమో అనే అనుమానాలు మొదలయ్యాయి. ఆ సినిమా తారక్ (Jr NTR) – ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబినేషన్లో రాబోయే చిత్రం అని చెప్పగానే ఆ పుకారు ఏంటో మీరే చెప్పేస్తారు కూడా.
అవును, మీరు అనుకుంటున్నదే ‘డ్రాగన్’. ప్రస్తుతం ఎన్టీఆర్ ‘వార్ 2’ సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా షెడ్యూల్ తర్వాత ‘దేవర’ (Devara) సినిమా పనులు మళ్లీ మొదలుపెడతారు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్తో ఓ సినిమా చేయాల్సి ఉంది. ఇప్పటికే ఈ సినిమా అనౌన్స్ చేసేశారు కూడా. అయితే ఎప్పుడు మొదలవుతుంది అనే విషయంలో క్లారిటీ లేదు. కానీ సినిమా పేరు ఇదే అంటూ ఓ టైటిల్ బయటికొచ్చింది. అదే ఈ ‘డ్రాగన్’.
‘డ్రాగన్’ అనే పేరు వినడానికి పవర్ ఫుల్గా ఉన్నా.. ఇదే పేరు పెడతారా? లేదా? అనే క్లారిటీ రావాల్సి ఉంది. మరోవైపు ఈ పేరు పెడితే ఓకేనా అనే చర్చ కూడా సాగుతోంది. ఎందుకంటే డ్రాగన్ అనే మాట మనం ఇప్పుడు చైనా గురించి, ఆ దేశం చేసే కుతంత్రాల గురించి వాడుతున్నాం. ఈ సమయంలో ఆ పేరు పెడితే.. ఇబ్బంది వస్తుందేమో అని కొంతమంది చర్చించుకుంటున్నారు. మరోవైపు ఇలాంటి పేరు పెట్టే రకం ప్రశాంత్ నీల్ కాదు అనే చర్చా సాగుతోంది.
ఇక ఈ భారీ చిత్రానికి సంబంధించి మైత్రి మూవీ మేకర్స్ భారీ ప్లాన్సే వేస్తోందట. ఈ ఏడాది అక్టోబర్ లేదా నవంబర్ నుండి సినిమా షూటింగ్ ప్రారంభించాలని అనుకుంటోందట. అయితే ఇదంతా ‘వార్ 2’, ‘దేవర 1’ సినిమాల షూటింగ్ షెడ్యూల్స్ మీదే ఆధారపడి ఉంది. అన్నట్లు ప్రశాంత్ నీల్ సినిమా కూడా రెండు పాయింట్లే అంటున్నారు.