“ఊహలు గుసగుసలాడే”తో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకొన్న నటుడు శ్రీనివాస్ అవసరాల తన రెండో ప్రయత్నంగా తెరకెక్కించిన చిత్రం “జ్యో అచ్యుతానంద”. నారా రోహిత్-నాగశౌర్య అన్నదమ్ములుగా నటించిన ఈ చిత్రంలో రెజీనా ముఖ్యభూమిక పోషించింది. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం నేడు (సెప్టెంబర్ 9) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుందో తెలుసుకొందాం..!!
కథ : ఐనాపురపు కోటేశ్వర్రావు కుమారులు అచ్యుత రామారావు (నారా రోహిత్), ఆనందవర్ధన్ (నాగశౌర్య). అన్నదమ్ములైనప్పటికీ స్నేహితుల్లా మెలుగుతుంటారు. అప్పుడే వయసుకొచ్చిన వారింటికి పై పోర్షన్ లో అద్దెకు దిగుతుంది జ్యో (రెజీనా). అప్పటివరకూ సాఫీగా సాగిన వారి జీవితాలు “జో” కారణంగా ఎటువంటి మలుపులు తిరిగాయి? అన్నదమ్ముల మధ్య ఏర్పడిన పొరపచ్చాలు వారిలోని అనుబంధబాంధవ్యాలను ఏ తీరానికి చేర్చాయి? అనేది “జ్యో అచ్యుతానంద” చిత్ర కథాంశం.
నటీనటుల పనితీరు : నటులుగా కంటే అన్నదమ్ములుగా నారా రోహిత్-నాగశౌర్యలు అద్భుతంగా ఇమిడిపోయారు. తెరపై వారిని చూస్తున్నంతసేపు నిజంగానే అన్నదమ్ములు మాట్లాడుకొంటున్నారేమో, పోట్లాడుకొంటున్నారేమో అనిపిస్తుందే తప్ప నటిస్తున్నారనిపించదు. అయితే.. చాలా సన్నివేశాల్లో నాగశౌర్య స్థాయిలో నారా రోహిత్ ఎమోషన్స్ ను పండించలేకపోయాడు. శౌర్య మాత్రం నటుడిగా “ఒక మనసు” అనంతరం ఈ చిత్రంతో మరింత పరిణితి చెందాడు. రోహిత్ హావభావాల ప్రదర్శన వరకూ పర్లేదు కానీ.. కాస్త లావుగా తెరనిండుగా కనబడడంతో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ లో పెద్దగా ఇంపాక్ట్ చూపలేకపోయాడు.
రెజీనా పోషించిన జ్యో పాత్ర చాలా మెచ్యూరిటీ కలిగి ఉన్నప్పటికీ.. ఆమె పెర్ఫార్మెన్స్ లో ఆ మెచ్యూరిటీ చూపలేకపోయింది.రోహిత్ భార్యగా పావని గంగిరెడ్డి, శౌర్య వైఫ్ గా రాజేశ్వరిలు సదరు పాత్రలకు న్యాయం చేశారు.శశాంక్, సీత, తనికెళ్లభరణిలు నటించడానికి పెద్దగా స్కోప్ లభించని కారణంగా అలంకార ప్రాయులుగా మిగిలిపోయారు.
సాంకేతికవర్గం పనితీరు : వెంకట్ సి.దిలీప్ కెమెరా వర్క్ రెగ్యులర్ గా ఉంది. లైటింగ్ ఎఫెక్ట్ మీద కాస్త కాన్సన్ ట్రేట్ చేసుంటే ఇంకాస్త బాగుండేది. అలాగే నారా రోహిత్ కు పెట్టిన టైట్ క్లోజ్ లు కూడా ఇబ్బందిగా ఉన్నాయి.కిరణ్ గంటి ఎడిటింగ్ వర్క్ ఇంకాస్త షార్ప్ గా ఉండాలి. ఎంగేజ్ మెంట్ ఎపిసోడ్ ను మొత్తం కట్ చేసేసినా సినిమాపై పెద్దగా ఇంపాక్ట్ చూపకపోదును.“ఒక లాలన” మినహాయిస్తే సంగీత దర్శకుడు శ్రీ కళ్యాణరమణ అలియాస్ కళ్యాణి కోడూరి ఉరఫ్ కళ్యాణి మాలిక్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. నేపధ్యసంగీతంతో ఇంతకుముందులా మ్యాజిక్ చేయలేకపోయాడు. ఎమోషనల్ సీన్స్ కి ఆడియన్స్ ని ఇన్వాల్వ్ చేయలేకపోయాడు.
“ఊహలు గుసగుసలాడే” చిత్రంతో దర్శకుడిగా తనను తాను పూర్తి స్థాయిలో ప్రూవ్ చేసుకొన్న అవసరాల “జ్యో అచ్యుతానంద”తో కథకుడిగా పరిణితి ప్రదర్శించాడు. అయితే.. సినిమాలో చాలా లూప్ హోల్స్ వదిలేశాడు. రోహిత్-శౌర్యలపై కోపంతో అమెరికా వెళ్ళిపోయిన రెజీనా మళ్ళీ ఇండియా ఎందుకు వస్తుంది? కూతురు అమెరికా వెళ్ళిపోయినా ఆమె తండ్రి మాత్రం ఎందుకని ఆ ఇంట్లోనే ఉంటాడు? అన్నదమ్ముల ఇద్దరి మధ్య ఈగో క్లాష్ ఎందుకు వస్తుంది? లాంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేదు.
సో, లాజికల్ గా సినిమాలో చాలా మైనస్ పాయింట్స్ ఉన్నాయి. కానీ.. లాజిక్స్ పట్టించుకోకుండా కేవలం ఎంటర్ టైన్మెంట్ కోసం సినిమా చూసేవారిని వారిని మాగొప్పగా కాకపోయినా ఓ మోస్తరుగా అలరిస్తుంది. ముఖ్యంగా ద్వంద్వార్ధ సంభాషణలకు తావులేకుండా స్వచ్చమైన తెలుగులో శ్రీనివాస్ రాసుకొన్న సంభాషణలతో పండించిన లైట్ హ్యూమర్ సగటు ప్రేక్షకులను అలరిస్తుంది.
విశ్లేషణ : “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” సినిమాలో అపురూపమైన భావోద్వేగాలతోపాటు అద్వితీయమైన అనుబంధాలు కూడా ఉన్నాయి. అందుకే ఆ సినిమా అందరికీ గుర్తుండిపోయింది. అయితే.. “జ్యో అచ్యుతానంద”లో సింపుల్ హ్యూమర్ తప్పితే మరో భావోద్వేగం లేదు. అన్నదమ్ముల కెమిస్ట్రీ సెట్ అయ్యింది కానీ.. ఆ కెమిస్ట్రీని ఆడియన్స్ ఫీలయ్యే సన్నివేశాలు పెద్దగా పడలేదు. ఆ కారణంగా “జ్యో అచ్యుతానంద” చిత్రాన్ని “భావోద్వేగాలు” విశేషంగా కలిగిన ప్రేక్షకులు మినహా మిగతావారు పెద్దగా ఎంజాయ్ చేయలేరు.
ఓవరాల్ గా మల్టీప్లెక్స్ ఆడియన్స్ ను టార్గెట్ చేస్తూ తెరకెక్కించబడిన ఈ చిత్రం పూర్తి స్థాయిలో విజయం సాధించకపోయినప్పటికీ.. ఓ మోస్తరుగా అలరిస్తుంది!
రేటింగ్: 2.5/5
Read Today's Latest
Featured Stories Update. Get
Filmy News LIVE Updates on FilmyFocus