వెండితెరకు కళాతపస్వి కె. విశ్వనాథ్‌ ‘విశ్వదర్శనం’

దక్షిణాది చలన చిత్రసీమ గర్వించదగ్గ దర్శకులు కె. విశ్వనాథ్‌ జీవితం వెండితెరపైకి రానుంది. ‘విశ్వదర్శనం’ పేరుతో రూపొందనున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలు గురుపూర్ణిమ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగాయి. ‘వెండి తెర చెప్పిన బంగారు దర్శకుని కథ’ అనేది ట్యాగ్‌లైన్‌. రచయిత, దర్శకులు జనార్ధన మహర్షి దర్శకత్వంలో పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టి.జి.విశ్వప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శుక్రవారం జరిగిన వేడుకలో కె. విశ్వనాథ్‌ దంపతులు పాల్గొన్నారు. సినిమా స్క్రిప్ట్‌ని దర్శకుడు జనార్ధన మహర్షికి కె. విశ్వనాథ్‌ దంపతులు, తనికెళ్ల భరణి, చిత్రనిర్మాత టి.జి. విశ్వప్రసాద్, చిత్రసహనిర్మాత వివేక్‌ కూచిభొట్ల అందజేశారు. ఈ చిత్రానికి స్వరవీణాపాణి స్వరకర్త. ఈ వేడుకలో విశ్వనాథ్‌గారి దంపతులను సత్కరించారు చిత్రబృందం.

ఆరేళ్ల క్రితం జనార్ధన మహర్షి దర్శకత్వంలో రూపొందిన ‘దేవస్థానం’ చిత్రంలో విశ్వనాథ్‌ ముఖ్య భూమికలో కనిపించారు. కాగా, ఈ కళాతపస్వి జీవిత చరిత్ర పలువురికి ఆదర్శవంతంగా నిలుస్తుందని, ఇలాంటి మహనీయుడి చరిత్రను చూపించాలనే ఆకాంక్షతో జనార్ధన మహర్షి ఈ చిత్రానికి శ్రీకారం చుట్టారు. విశ్వనాథ్‌ పుట్టుక నుంచి ఇప్పటివరకూ వివిధ దశలలో ఆయన జీవితం ఎలా సాగింది? అనే నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుంది. వచ్చే నెలలో రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కానుంది. నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో చిత్రబృందం ప్రకటించనుంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus