కామెడీ డైరెక్టర్ తో కళ్యాణ్ రామ్..?
- November 23, 2016 / 10:39 AM ISTByFilmy Focus
కళ్యాణ్ రామ్ తన పరిధిలో ఎప్పటికప్పుడు కొత్త కథల కోసం అన్వేషిస్తూనే ఉంటాడు. ఆలా చేసిన వాటిలో కొన్ని సరైన ఫలితాన్ని ఇవ్వనప్పటికీ ఆ బాటని వీడేది లేదని పలు సందర్భాల్లో కళ్యాణ్ రామ్ చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఆయన గురించి మాట్లాడిన ప్రతి ఒక్కరూ ‘ఇజం’కి ముందు ‘ఇజం’ తర్వాత అని అనుకుంటున్న పరిస్థితి. దానికి కారణం ఆ సినిమా ఫలితం కాదు.. ‘ఇజం’ కోసం ఈ నందమూరి హీరో తనను తాను మలచుకున్న తీరు. అలాంటిది ఇప్పుడాయన ఓ కామెడీ డైరెక్టర్ తో చేతులు కలపనున్నారని తెలుస్తోంది.
‘6 టీన్స్’, ‘గర్ల్ ఫ్రెండ్’ వంటి యూత్ ఫుల్ సినిమాలతో కెరీర్ మొదలెట్టి ‘సీమ శాస్త్రి’, ‘సీమ టపాకాయ్’ సినిమాలతో కామెడీ చిత్రాల దర్శకుడిగా టర్న్ తీసుకున్నారు జి నాగేశ్వరరెడ్డి. మంచు మనోజ్ హీరోగా నటించిన ‘కరెంట్ తీగ’ (2014) తర్వాత కొంత విరామం తీసుకున్న ఆయన ఈ ఏడు రెండు సినిమాలతో బాక్సాఫీస్ వద్దకు వచ్చారు. అవే సుశాంత్ హీరోగా చేసిన ‘ఆటాడుకుందాం రా’, మంచు విష్ణు, రాజ్ తరుణ్ హీరోలుగా నటించిన ‘ఈడోరకం ఆడోరకం’. ఈ రెండు సినిమాలు ఎలా వచ్చాయో ఎప్పుడు పోయాయో కూడా ఎవరికీ తెలీదు. డిజాస్టర్లుగా మిగిలిన ఈ రెండు సినిమాల తర్వాత నాగేశ్వర రెడ్డితో కళ్యాణ్ చేయి కలపడం అందరికీ షాక్ ఇచ్చింది. అనిల్ రావిపూడి సహా పలువురు దర్శకులు కళ్యాణ్ రామ్ కి కథలు వినిపించగా చివరికి నాగేశ్వర రెడ్డి తేలారన్నమాట. ఈ దర్శకుడు అల్లరి నరేష్ తో చేసిన ‘ఇంట్లో దెయ్యం నాకేం భయ్యం’ సినిమా విడుదల కావాల్సి ఉంది. దీని ఫలితాన్ని బట్టి కళ్యాణ్ రామ్ తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశముంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.













