రీసెంట్ టైమ్స్‌లో చిన్న సినిమాగా విడుదలై ఆ తర్వాత పాన్ ఇండియా హిట్ అందుకున్న సినిమాల లిస్ట్ అంటూ ఒకటి రాస్తే.. తొలి వరుసలో నిలిచే పేరు ‘కాంతార’. కన్నడ పరిశ్రమ నుండి వచ్చిన ఈ చిత్ర రాజం గురించి ఎంత చెప్పినా తక్కువే. కేవలం రూ.16 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా రూ.400 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది. ఆ తర్వాత ‘కాంతార: చాప్టర్ 1’ సినిమాను తీసుకురాగా.. అది కూడా అదిరిపోయే విజయం అందుకుంది. ఈ సినిమా రూ.850 కోట్ల వరకు వసూలు చేసింది.
ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నారు.. ఈ సినిమాకు సీక్వెల్ వస్తుందా? అనేదేగా మీ డౌట్. అవును ‘కాంతార: చాప్టర్ 2’ గురించి దర్శక, నటుడు రిషభ్ శెట్టి ఆసక్తికర సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం రిషబ్ శెట్టి వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అలాగే మరోవైపు ‘కాంతార: చాప్టర్ 2’ కథ పనులు కూడా చూస్తున్నారట. ఈ విషయాన్ని ఆయనే చెప్పుకొచ్చారు. ప్రస్తుతం తన టీమ్ ఇదే పనిలో ఉందన్నారు. దీంతో రిషభ్ ఫ్యాన్స్ అలర్ట్ అయిపోయారు.
ప్రస్తుతం రిషబ్ చేతిలో ‘జై హనుమాన్’ (‘హను – మాన్’ సీక్వెల్) సినిమాతోపాటు ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న ‘ది ప్రైడ్ ఆఫ్ భారత్ – ఛత్రపతి శివాజీ మహారాజ్’ సినిమా ఉన్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకేసారి రెండు సినిమాల్లో నటించడం కష్టమైన పనే. రెండింటికీ వేర్వేరు లుక్స్ అవసరం. అందుకే ‘జై హనుమాన్’ సినిమా షూటింగ్ పూర్తయ్యాక ‘శివాజీ మహారాజ్’ సినిమా చేస్తానని చెప్పారు.
అలాగే నటుడిగా బిజీగా ఉన్నప్పటికీ, దర్శకత్వం వదలను. డైరెక్ట్ చేయడమంటే నాకు ఇష్టం. ఆ పని నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది అని చెప్పారు. అలాగే ‘రిషబ్ శెట్టి ఫిల్మ్స్’ బ్యానర్‌పై ఈ ఏడాది రెండు ప్రాజెక్టులు ప్రకటిస్తామని చెప్పి ఆసక్తి పెంచారు. ఆ సినిమాలేంటి, నేపథ్యాలేంటి అనేది ఆసక్తికరంగా మారింది.