చిరంజీవి వర్సెస్ విజయ్.. ఈ పోరు ఇన్నేళ్ల సౌత్ ఇండియన్ సినిమాలో ఎప్పుడూ లేదు. ఇద్దరు ఒక తరం వాళ్లు కాదు, ఒక వయసు వారు కాదు, ఒక పరిశ్రమకు చెందినవారు కారు. కానీ ఈ పోటీ మొదలైంది. దానికి కారణం ఇద్దరితో కలసి నటించిన ఓ హీరోయిన్. విజయ్‌తో హీరోయిన్‌గా, చిరంజీవికి సోదరిగా నటించిన కీర్తి సురేశే దీనికి కారణం. డ్యాన్స్‌ల గురించి మొదలైన టాపిక్.. ఆ తర్వాత చిరంజీవి వర్సెస్ విజయ్ అనేలా అయిపోయింది. దీనిపై ప్రశ్నకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసిన కీర్తి.. ఇంకాస్త కన్‌ఫ్యూజన్ క్రియేట్ చేసిందని చెప్పాలి.
కొన్ని నెలల క్రితం ఓ తమిళ ఇంటర్వ్యూలో చిరంజీవి, విజయ్‌లో ఎవరు బెస్ట్ డాన్సర్? అనే ప్రశ్న కీర్తికి ఎదురైంది. దానికి విజయ్ అనే పేరు చెప్పింది కీర్తి. ఆ తర్వాత నెటిజన్లు, ఫ్యాన్స్ పోలికలు మాట్లాడుతూ దాన్ని ఓ పెద్ద వివాదంగా మార్చారు. దాని గురించి ఇటీవల కీర్తి దగ్గర ప్రస్తావిస్తే.. ఒకరు గొప్ప, మరొకరు తక్కువ అని నేను చెప్పలేదు. ఇద్దరూ గొప్ప నటులు. ఆ రోజు ఇంటర్వ్యూలో చిరంజీవి లెజెండ్ అని చెప్పాను. విజయ్ తమిళనాడులో లెజెండ్. ఆ ఇంటర్వ్యూలో నా అభిప్రాయం అడిగినప్పుడు ఎవరి పేరు చెప్పాలనేది నా ఛాయిస్ అని అంది కీర్తి.
నేను విజయ్ సినిమాలు ఎక్కువ చూశాను. అందుకే ఆ పేరు చెప్పి ఉండొచ్చు. అంతే తప్ప చిరంజీవిని తక్కువ చేసే ఉద్దేశం నాకు లేదు. దీని గురించి నేను చిరంజీవితో డిస్కస్ కూడా చేశాను. నా నిజాయితీని చిరంజీవి మెచ్చుకున్నారు. ఒకవేళ అభిమానుల మనసు నొచ్చుకుంటే.. వాళ్లు హర్ట్ అయితే సారీ చెబుతున్నాను అని క్లారిటీ ఇచ్చింది కీర్తి. ఇక్కడ చిరంజీవి ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు అనే పేరుతో మరోసారి ఆ వివాదాన్ని బయటకు తీయడం సరికాదు అనే వాదన ఒకవైపు జరుగుతోంది. మరోవైపు కీర్తి కూడా ఈ విషయంలో నో కామెంట్ అనో, అప్పుడలా అనేశాను, ఇప్పుడు అనవసరం అనేసి ఉంటే మరోసారి చర్చ జరిగేది కాదు. అయినా హర్ట్ అయితే సారీ అందిగా ఇక ఇక్కడితో వదిలేయాలి ఈ విషయం.