మంచిపేరు వచ్చిన సమయంలోనే ఎక్కువ సినిమాలు చేసి డబ్బుని సంపాదించుకోవాలి. అది హీరో అయినా.. హీరోయిన్ అయినా.. క్యారక్టర్ ఆర్టిస్టు అయినా. అందుకే సినిమా పరిశ్రమలో ప్రతి ఒక్కరూ మంచి బ్రేక్ కోసం చూస్తుంటారు. ఆ సమయం రాగానే పారితోషికం పెంచేసి అనేక సినిమాలకు సైన్ చేస్తుంటారు. అటువంటి సమయం మహానటి రూపంలో కీర్తి సురేష్ కి రానే వచ్చింది. అభినేత్రి సావిత్రి బయోపిక్ మూవీలో సావిత్రిగా అమోఘమైన నటనను ప్రదర్శించింది. మరో పదేళ్ళపాటు కీర్తి పేరు చెప్పగానే సావిత్రి రోల్ ముందుగా గుర్తుకువస్తుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ చిత్రం తమిళంలోనూ రిలీజ్ అయి పెద్ద సక్సస్ సాధించింది.
ఒకే దెబ్బకు రెండు పిట్టలు మాదిరిగా.. ఒకే సినిమాతో రెండు పరిశ్రమల్లో క్రేజ్ సంపాదించుకుంది. తెలుగు, తమిళ దర్శక నిర్మాతలు ఆమె ఇంటి ముందు క్యూ కట్టారు. అయితే ఆమె మాత్రం తమిళ కథలకే ఒకే చెప్పింది. విక్రమ్ తో సామి 2 (లక్ష్మీనరసింహ స్వామి సీక్వెల్), విశాల్ తో సండా కోజి 2 (పందెం కోడి సీక్వెల్), విజయ్ తో థళపతి 62 సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఒక్క తెలుగు సినిమాకి కూడా సంతకం పెట్టలేదు. దీంతో తెలుగు నిర్మాతలు కీర్తి పై కోపంగా ఉన్నారు. తమిళం వారికే కీర్తి ప్రాధాన్యత ఇస్తుందని విమర్శిస్తున్నారు. అయితే దీనిని కీర్తి సన్నిహితులు కొట్టి పడేస్తున్నారు. ఈ చిత్రాలను మహానటి కంటే ముందే ఒకే చెప్పిన్నట్లు వివరించారు. ఈ ఏడాది అంతా ఈ చిత్రాలకు డేట్ కేటాయించడంతో తెలుగు సినిమాలకు సైన్ చేయలేకపోయిందని వెల్లడించారు.