Kesari Chapter 2 Review in Telugu: కేసరి చాప్టర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • అక్షయ్ కుమార్, ఆర్. మాధవన్ (Hero)
  • రెజీనా కాసాండ్రా,అనన్య పాండే (Heroine)
  • సైమన్ పైస్లీ డే,అమిత్ సియాల్, ఓ'నెల్,మార్క్ బెన్నింగ్టన్ (Cast)
  • కరణ్ సింగ్ త్యాగి (Director)
  • హిరో యష్ జోహార్ - అరుణ భాటియా - కరణ్ జోహార్ - అడార్ పూనావాలా - అపూర్వ మెహతా - అమృత్ పాల్ సింగ్ బింద్రా - ఆనంద్ తివారీ (Producer)
  • శాశ్వత్ సచ్ దేవ్ - కవిత సేత్ - కనిష్క్ సేత్ (Music)
  • దిబోజీత్ రాయ్ (Cinematography)
  • Release Date : ఏప్రిల్ 18, 2025

2021లో వచ్చిన “సూర్యవన్షి” తర్వాత అక్షయ్ కుమార్ దాదాపుగా 16 సినిమాల్లో నటించగా ఒక్కటీ చెప్పుకోదగ్గ విజయం సాధించలేదు. హిట్టైన కొన్ని సినిమాల్లో అక్షయ్ కుమార్ కేవలం గెస్ట్ రోల్ ప్లే చేశాడంతే. దాంతో.. ఖాన్ హీరోలను మించిన స్టార్ డమ్ దక్కించుకున్న అక్షయ్ కుమార్ కెరీర్ అయిపోయింది అనుకున్నారు జనాలు. దాంతో.. “కేసరి 2” మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు అక్షయ్ కుమార్. టీజర్ & ట్రైలర్ మంచి ఆసక్తి కలిగించడంతో.. సినిమా మీద అంచనాలు కూడా పెరిగాయి. మరి ఈ చిత్రంతోనైనా అక్షయ్ కుమార్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడా లేదా? అనేది చూద్దాం..!!

Kesari Chapter 2 Review

కథ: 1919లో జలియన్ వాలా భాగ్ హత్యాకాండను ఓ టెర్రరిస్ట్ లను హతమార్చిన సంఘటనగా కప్పిపెట్టాలనుకుంటుంది బ్రిటిష్ ప్రభుత్వం. అయితే.. ఆ దారుణం నుండి ప్రాణాలతో బయటపడిన కొందరు ప్రభుత్వంపై ఎదురెళ్లడంతో, లేడీ లాయర్ దిల్ రీత్ గిల్ (అనన్య పాండే) కోర్టులో పిటీషన్ దాఖలు చేస్తుంది.

అది ముమ్మాటికీ హత్యాకాండ అని సర్ శంకరన్ నాయర్ (అక్షయ్ కుమార్) వాదిస్తుండగా.. అది కచ్చితంగా టెర్రరిస్ట్ యాక్టివిటీని కట్టడి చేసే చర్య అని నెవిల్లే మెక్ కిన్లే (మాధవన్) ప్రభుత్వం తరపున వకాల్తా పుచ్చుకుంటాడు.

ఈ ఇద్దరి మధ్య కోర్టు సాక్షిగా జరిగిన వాదోపవాదాల్లో ఎవరు గెలిచారు? అనేది “కేసరి చాప్టర్ 2” కథాంశం.

నటీనటుల పనితీరు: అక్షయ్ కుమార్ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుందే మంచి స్క్రిప్ట్ సెలక్షన్ తో, మధ్యలో హీరోయిజాన్ని నమ్ముకుని చేసిన సినిమాలన్నీ బెడిసికొట్టాయి. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత అక్షయ్ కుమార్ ను హీరోలా కాక ఒక సంపూర్ణ నటుడిగా తెరపై చూడడం సంతోషాన్ని కలిగించడమే కాక, అతడి వాదనలు మనసును హత్తుకుంటాయి.

మాధవన్ నెగిటివ్ లేదా గ్రే షేడ్ చేసినప్పుడు, అతడిలోని సరికొత్త కోణం కనిపిస్తుంటుంది. ఈ చిత్రంలోనూ కౌన్సిల్ లాయర్ గా అతడి పాత్ర విశేషంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా.. అక్షయ్ కుమార్ & మాధవన్ పోటీపడి వాదించే సన్నివేశాలు మంచి టెన్షన్ యాడ్ చేశాయి.

ఇక అనన్య పాండే ఈ తరహా పాత్రలు కూడా పోషించగలడా అని కొంతసేపు ఆశ్చర్యమేస్తుంది. ఆమె పాత్రలో ఒదిగిపోయిన విధానం, చాలా కాన్ఫిడెంట్ గా కోర్ట్ లో వాదించే సన్నివేశాలు కచ్చితంగా అలరిస్తాయి.

అలాగే.. బ్రిటిష్ జడ్జ్ గా, మిలిటరీ ఆఫీసర్ గా నటించిన నటులు కూడా తమ పాత్రలను అద్భుతంగా పోషించారు.

వీళ్లందరినీ మించి పర్గాట్ సింగ్ పాత్రలో క్రిష్ రావ్ అదరగొట్టాడు. అతడి కళ్లల్లో కనిపించే భయం, ఉద్వేగం, కోపం సినిమాకి మంచి ఎమోషన్ ను యాడ్ చేసి, ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా చేసింది.

రెజీనా పాత్ర చిన్నదే, డైలాగులు తక్కువే అయినప్పటికీ.. ఉన్నంతలో ఒదిగిపోయింది.

సాంకేతికవర్గం పనితీరు: దిబోజిత్ రాయ్ సినిమాటోగ్రఫీ వర్క్ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ. ఆర్ట్ వర్క్ & ప్రొడక్షన్ డిజైన్ టీమ్ సహకరించడంతో అద్భుతమైన అవుట్ పుట్ ఇచ్చాడు. ముఖ్యంగా జలియన్ వాలా బాగ్ సంఘటనను రీక్రియేట్ చేసిన విధానం కంటతడి పెట్టిస్తుంది. అయితే.. “సర్దార్ ఉదం సింగ్” స్థాయిలో ఉండదు.

నేపథ్య సంగీతం, పాటలు, ఎడిటింగ్, డి.ఐ వంటి టెక్నికాలిటీస్ బాగా కుదిరాయి. ముఖ్యంగా “ఓ షేరా” పాట మూడు వెర్షన్స్ విశేషంగా ఆకట్టుకుంటాయి.

దర్శకుడు కరణ్ సింగ్ త్యాగికి దర్శకుడిగా “కేసరి చాప్టర్ 2” మొదటి సినిమా అంటే నమ్మశక్యం కాదు. కోర్ట్ రూమ్ డ్రామాను చాలా గ్రిప్పింగ్ & ఎమోషనల్ గా రాసుకున్నాడు. ముఖ్యంగా.. అక్షయ్ కుమార్ క్యారెక్టర్ ఆర్క్ ను రాసుకున్న విధానం ప్రశంసనీయం. అలాగే.. జలియన్ వాలా బాగ్ ఘటనను హృద్యంగా చూపించిన విధానం కూడా బాగుంది. అలాగే.. అక్షయ్ కుమార్ – మాధవన్ కాంబినేషన్ సీన్స్ లో డ్రామా ఎగ్జైటింగ్ గా ఉండేలా జాగ్రత్తపడిన తీరు సినిమాకి మెయిన్ ఎస్సెట్. కోర్టులో జరిగేది గెలుపోటములు కాదు, న్యాయ నిర్ధారణ అంటూ ఇచ్చే ట్రాన్సఫర్మేషన్ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అవుతుంది. మొదటి సినిమాతోనే దర్శకుడిగా, రచయితగా తన సత్తాను ఘనంగా చాటుకున్నాడు కరణ్ సింగ్ త్యాగి.

విశ్లేషణ: సాధారణంగా ఈ తరహా ఎమోషన్ కోర్ట్ రూమ్ డ్రామాలు చూసినప్పుడు గుండె బరువెక్కడం అనేది సర్వసాధారణం. అయితే.. “కేసరి చాప్టర్ 2” చూసాక మాత్రం ఉద్వేగానికి లోనవుతాం. బ్రిటిష్ ప్రభుత్వం చేసిన తప్పును కవర్ చేయడానికి చేసిన ఆకృత్యాలు చూస్తే వాళ్ల మీద అసహ్యం మరింత పెరిగి, ఒకింత కోపం కూడా వస్తుంది. అయితే.. సినిమా అప్పటికే మంచి ఎమోషనల్ హై ఇచ్చింది అనుకున్న తరుణంలో.. చివర్లో “106 సంవత్సరాలుగా బ్రిటిష్ ప్రభుత్వం జలియన్ వాలా బాగ్ బాధితులకు ఒక్క విషయం మాత్రం చెప్పలేదు” అనే స్లైడ్ వచ్చాక.. చిన్న పాజ్ ఇచ్చి వచ్చే “సారీ” అనే ఫ్రేమ్ మనసును కంపింపజేస్తుంది. సినిమా మొత్తం ఒకెత్తు, ఆ “సారీ” ఫ్రేమ్ మరో ఎత్తు. ఆ ఫ్రేమ్ ఇచ్చే బాధ, కోపం కచ్చితంగా ప్రతి ఒక్కరూ అనుభూతి చెందుతారు. ఈ అనుభూతి కోసం ఈ సినిమాని కచ్చితంగా థియేటర్లలో చూడాల్సిందే.

ఫోకస్ పాయింట్: తప్పకుండా చూడాల్సిన కోర్ట్ రూమ్ డ్రామా!

రేటింగ్: 3.5/5

Rating

3.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus