కార్తీ-రకుల్ ప్రీత్ జంటగా యువ దర్శకుడు వినోత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “ఖాకీ”. పోలీస్ ఇన్వెస్టిగేటివ్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం ద్వారా తెలుగునాట తిరుగులేని ఆడియో కంపెనీగా గత నాలుగు దశాబ్ధాలుగా సదరు రంగంలో సంచలనాలు సృష్టిస్తున్న ఆదిత్య మ్యూజిక్ సంస్థ ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మించడం విశేషం. రొటీన్ యాక్షన్ మూవీస్ కు భిన్నంగా రియలిస్టిక్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం తెలుగు తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందింది. మరి ఆడియన్స్ ను ఏరేంజ్ లో ఎంటర్ టైన్ చేసిందో చూద్దాం..!!
కథ :1995 నుంచి 2005 నడుమ కొన్ని దోపిడీలు జరుగుతాయి. ఆ దోపిడీ దొంగలు ఇంట్లో బంగారం, డబ్బులు దొంగిలించడం మాత్రమే కాక ఇంట్లోవారిని కూడా నిర్ధాక్షిణ్యంగా క్రూరంగా చంపేసి పారిపోతుంటారు. వేలి ముద్రలు మినహా మరే ఇతర సాక్ష్యం కానీ ఆధారం కానీ దొరక్కపోవడంతో పోలీసులు ఈ కేసులను సాధారణ దోపిడీలుగా నమోదు చేసి కేస్ ఫైల్ ను పక్కన పడేస్తారు. 2003లో పోలీస్ ట్రైనింగ్ ముగించుకొని డి.ఎస్.పిగా చార్జ్ తీసుకొన్నాక ధీరజ్ (కార్తీ) చూసిన మొదటి ఫైల్ ఆ హత్యలకు సంబంధించినదే. ఇంతటి క్రూరమైన హత్యలను ఇన్వెస్టిగేట్ చేయకుండా ఎందుకు వదిలేశారో అర్ధం కాక తానే పర్సనల్ గా డీటెయిల్స్ కలెక్ట్ చేయడం ప్రారంభిస్తాడు. అయితే.. ఈ తరహా దోపిడీలు జరగడం ఇది కొత్త కాదని గత ఎనిమిదేళ్లుగా జరుగుతూనే ఉన్నాయని తెలుసుకొంటాడు. తన వద్ద ఉన్న డీటెయిల్స్ తో పోలీస్ హెడ్ ను కలిసి తనకో టీం ఇవ్వమని అడిగితే తొలుత సీరియస్ గా తీసుకోని పోలీస్ బృందం.. ఆ దొంగలు ఏకంగా అధికార పార్టీ ఎమ్మెల్యేను హత్య చేయడంతో ఇష్యూని సీరియస్ గా తీసుకొని ధీరజ్ కు ఒక టీం ను ఇస్తారు. ఆ తర్వాత ధీరజ్ అండ్ టీం ఆ దొంగల గ్యాంగ్ ను ఎలా పట్టుకొన్నారు? పట్టుకోవడం కోసం ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు? ఎంత కష్టపడ్డారు? అనేది “ఖాకీ” సినిమా చూసి తెలుసుకోవాల్సిన విషయాలు.
నటీనటుల పనితీరు : ఇదివరకు కూడా కార్తీ ఈ తరహా పోలీస్ రోల్స్ చేసి ఉన్నప్పటికీ.. ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా ఈ చిత్రంలో కార్తీ పోలీస్ పాత్రలో క్రియేట్ చేసిన ఇంపాక్ట్ బాగుంది. ఒక నిజమైన పోలీస్ ఆఫీసర్ వ్యవహారశైలి ఎలా ఉంటుందో కార్తీ నటనలో కనిపిస్తుంది. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్ లలో డూప్స్ లేకుండా కార్తీ చేసిన పోరాటాలు సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. రకుల్ ప్రీత్ సింగ్ పెద్దగా ప్రాధాన్యత లేని పాత్రలో కనిపించింది. నటన పరంగా పర్వాలేదనిపించుకొన్నప్పటికీ.. ఆమెకు రాసిన సన్నివేశాలు కథకు ఉపయోగపడకపోగా, కథనానికి అడ్డు వచ్చాయి. తమిళ నటుడు బోస్ వెంకట్ సహాయ నటుడిగా మంచి పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకొన్నాడు. అభిమన్యుసింగ్ క్రూరమైన దోపిడీ దొంగగా ఆహార్యంతోనే కాక హావభావాలతోనూ భయాన్ని కలిగించాడు. కాకపోతే.. అతడి క్యారెక్టర్ కు ఇంకాస్త మంచి డీటెయిలింగ్ ఇచ్చి ఉంటే క్లైమాక్స్ ఇంపాక్ట్ ఇంకో లెవల్లో ఉండేది.
సాంకేతికవర్గం పనితీరు : ముందుగా దర్శకుడు కథ కోసం చేసిన రీసెర్చ్ ను, హోమ్ వర్క్ ను మెచ్చుకొని తీరాల్సిందే. అసలు డెకాయిట్స్ అనేవాళ్ళు ఎలా ఆవిర్భవించారు, వారి మూలాలేమిటి, వారు దొంగతనం చేసే పద్ధతులేమిటి, ఏ తెగకు చెందిన డెకాయిట్స్ ఏ ఏ ప్రాంతాల్లో నివసించేవారు, ఏ ప్రాంతాలను స్థావరాలుగా మార్చుకొనేవారు, ఎలాంటి ప్రదేశాలను దొంగతనానికి అనుకూలంగా ఎంచుకొనేవారు వంటి విషయాలను వీలైనంత సులభతంగా వివరించిన తీరు ప్రశంసనీయం. అలాగే.. ఒక పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఎలా జరుగుతుంది? అందుకు సంబంధించిన ప్రొసీజర్స్ ఏమిటి? అనేది చాలా క్లియర్ గా తెరకెక్కించాడు. కొన్ని సన్నివేశాల్లో కమర్షియాలిటీ కోసం వెంపర్లాడడం వల్ల కథ గాడి తప్పుతుంది. కానీ.. తొలి సినిమాతోనే ఈస్థాయిలో కథ-కథనాల పరంగా జాగ్రత్తలు తీసుకొని తెరకెక్కించిన దర్శకుడు వినోత్ ను మెచ్చుకోవాల్సిందే.
అన్నిటికంటే ముఖ్యంగా కథను 2003 కాలంలో నడిపి.. అప్పటికి పోలీసుకు అందుబాటులో ఉన్న టెక్నాలజీని మాత్రమే వాడిన విధానం అందుకోసం తీసుకొన్న జాగ్రత్తలు ప్రశంసనీయం. జిబ్రాన్ సంగీతం-నేపధ్య సంగీతం కొత్తగా ఉన్నా.. వినసోంపుగా మాత్రం లేదు. సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ సినిమాకి మెయిన్ ఎస్సెట్ అని చెప్పుకోవచ్చు. యాక్షన్ ఎపిసోడ్స్, రెయిన్ షాట్స్, లైటింగ్ విషయాల్లో తీసుకొన్న జాగ్రత్తలు, రన్నింగ్ షాట్స్ ను టాప్ యాంగిల్ లో పిక్చరైజ్ చేసిన తీరు ప్రేక్షకుల్ని విశేషంగా అలరిస్తుంది. యాక్షన్ సీక్వెన్స్ లలో ఎక్కడా అతి కనిపించదు, సినిమా కాస్త స్లోగా సాగినట్లుగా ఉందే అనిపించినా.. కేస్ డీటెయిలింగ్ కోసం ఆమాత్రం టైమ్ తీసుకోవడంలో తప్పు లేదు అనిపిస్తుంది.
విశ్లేషణ : పోలీస్ యాక్షన్ మూవీస్ అంటే.. హీరో పోలీస్ ఆఫీసర్, విలన్స్ ను సునాయాసంగా చంపేస్తాడు అనే ఫార్మాట్ నే చూస్తూనే ఉన్నాం. మొదటిసారిగా.. అసలు ఒరిజినల్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఎలా ఉంటుందో చూపించిన చిత్రం “ఖాకీ”. యాక్షన్ మూవీ లవర్స్ మాత్రమే కాదు డిఫరెంట్ మూవీ గోయర్స్ కి కూడా విశేషంగా నచ్చే చిత్రం “ఖాకీ”.