ఎప్పుడూ చెప్పే మాట.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కత్తి లాంటిది. మంచికి వాడుకోవచ్చు, చెడుకీ వాడుకోవచ్చు. మంచికి వాడుకుంటే ఎలా ఉంటుందో మరోసారి చేసి చూపించారు. ప్రముఖ గాయకుడు సోనూ నిగమ్ ఈ పని చేసి చూపించారు. దీంతో ఆయన ఫ్యాన్స్, సంగీతాభిమానులు, నెటిజన్లు ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సంగీత రంగంలో ఏఐ సరికొత్త ట్రెండ్‌ను క్రియేట్ చేస్తోందనే విషయం తెలిసిందే. ఇప్పుడు దాని ద్వారానే దివంగత ప్రముఖ గాయకుడు మహ్మద్ రఫీ గొంతను మరోసారి క్రియేట్ చేశారు.
ఏఐతో ఇప్పటివరకూ దివంగత గాయకుల గొంతులను మరోసారి తమ సినిమాల్లో వినిపించారు సంగీత దర్శకులు. ఇప్పుడీ ట్రెండ్‌ను గాయకుడు సోనూ నిగమ్ ఓ లైవ్ కాన్సర్ట్‌లోకి తెచ్చారు. ఏఐని లైవ్‌లో వినియోగించి దివంగత గాయకుడు మహమ్మద్ రఫీతో కలసి ఆయన డ్యుయెట్ పాడారు. దీంతో ఆ కాన్సర్ట్‌కి వచ్చినవాళ్లు ఆశ్చర్యపోయి, అమితానందపడ్డారు. ఇటీవల జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో సోనూ నిగమ్ కాన్సర్ట్ ఏర్పాటు చేశారు. అందులోనే రఫీకి సోనూ నిగమ్ ఏఐ ద్వారా నివాళులర్పించారు. ఏఐని ఉపయోగించి రఫీతో తన గొంతుకలిపి ఓ డ్యూయెట్ పాడారు. స్క్రీన్‌పై రఫీ వీడియో, ఆయన గొంతు వినిపించడంతో అభిమానులు భావోద్వేగానికి గురయ్యారు.

మహ్మద్ రఫీ, సోనూ నిగమ్ ఇద్దరూ తెలుగు వారికి, ముఖ్యంగా సంగీత అభిమానులకు పరిచయమే. ‘నా మది నిన్ను పిలిచింది గానమై…’ తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు మహమ్మద్ రఫీ. డిసెంబరు 24, 1924న జన్మించిన ఆయన ఎన్నో భాషల్లో వేల పాటలు పాడి రికార్డులు సృషించారు. ఇక సోనూ నిగమ్ తెలుగులో ‘రావే నా చెలియా..’(జీన్స్) అంటూ తెలుగులో కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత 2023 వరకు తెలుగు పాటలు పాడుతూనే ఉన్నారు. ఆయన తెలుగో పాడిన ఆఖరి పాట ‘యానిమల్’ సినిమాలోని ‘నాన్నా నువ్వు నా ప్రాణం..’.
