నవంబర్ 21న విడుదలైన అన్ని సినిమాల్లో కంటే చిన్న సినిమా “రాజు వెడ్స్ రాంబాయి”. కానీ మిగతా సినిమాలకంటే ఎక్కువ ప్రజాదరణ ఉన్న సినిమా కూడా ఇదే కావడం విశేషం. సురేష్ బొబ్బిలి రూపొందించిన పాట, ట్రైలర్ మంచి ఆసక్తి నెలకొల్పాయి. చిత్రబృందం సాంగ్ లాంచ్ నుంచి ఈ చిత్రాన్ని “గ్రేటెస్ట్ లవ్ స్టోరీ” అని ప్రమోట్ చేయడం మొదలుపెట్టారు. మరి నిజంగానే గ్రేట్ లవ్ స్టోరీనా? ఆడియన్స్ ను క్లైమాక్స్ నిజంగానే షాక్ కి గురి చేసిందా? ఈటీవీ విన్ సంస్థ మరియు వేణు ఊడుగుల నిర్మాతలుగా మంచి విజయాన్ని అందుకోగలిగారా? అనేది చూద్దాం..!!

కథ: ఆంధ్ర-తెలంగాణ బోర్డర్ లో ఉండే ఓ గ్రామంలో బ్యాండ్ కొట్టుకుంటూ ఫ్రెండ్స్ తో టైంపాస్ చేసే కుర్రాడు రాజు (అఖిల్ రాజ్), చిన్నప్పటినుండి అదే ఊర్లో ఉండే రాంబాయి (తేజస్విని రావు) అనే అమ్మాయిని ప్రేమిస్తూ ఉంటాడు. ఆ ఇద్దరి ప్రేమ ఒకర్నొకరు అర్థం చేసుకునే స్టేజ్ నుండి.. ఒకళ్ళని విడిచి మరొకళ్ళు ఉండలేని స్థాయికి చేరుకుంటుంది.
అప్పుడొస్తాడు అమ్మాయి తండ్రి వెంకన్న (చైతూ జొన్నలగడ్డ), అతడి అవితితనానికి మూర్ఖత్వం తోడై.. రాక్షసుడిలా బిహేవ్ చేస్తుంటాడు.
అతడి రాక్షసత్వాన్ని దాటుకొని రాజు-రాంబాయిల ప్రేమ గెలిచిందా? గెలిచినా ఎలాంటి తీవ్రమైన ఇబ్బందిని ఎదుర్కోవాల్సి వచ్చింది? అనేది సినిమా కథాంశం.

నటీనటుల పనితీరు: అఖిల్ రాజ్, తేజస్విని రావు చాలా స్వచ్ఛంగా, సహజంగా కనిపించారు. వాళ్ల ఆహార్యం, వ్యవహారశైలి, యాస అన్నీ ఒద్దికగా ఉన్నాయి. చాలా చిన్న సందర్భాలను కూడా అద్భుతంగా పండించారు ఇద్దరూ. ముఖ్యంగా తెలిసీతెలియని అమాయకత్వం, తింగరితనం, పొగరు వంటి భావాల్ని చాలా బాగా పండించారు. సినిమాకి కోర్ స్ట్రెంగ్త్ వీళ్లే.
చైతూ జొన్నలగడ్డ పాత్రలో క్రూరత్వం, మొండితనం ఉన్నప్పటికీ.. వాటి ఎస్టాబ్లిష్మెంట్ సరిగా లేకపోవడంతో.. అతడు చేసే పనుల్లో రాక్షసత్వం ఉన్నప్పటికీ.. ఎందుకో పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది. నటుడిగా మాత్రం చైతూ జొన్నలగడ్డ తన సత్తాను ఘనంగానే చాటుకున్నాడు.
స్నేహితులుగా నటించవాళ్ల పాత్రలు, వాళ్లు పండించే కామెడీ బాగా వర్కవుట్ అయ్యింది. ముఖ్యంగా మెమరీ కార్డ్ సీన్ & కస్టమర్ కేర్ సీన్ కి థియేటర్లు నవ్వులతో ఊగడం ఖాయం.
అనిత చౌదరి తల్లి పాత్రలో సహజంగా నటించినప్పటికీ.. ఆమెకి యాసలో సహజత్వం కోసం వేరే వాళ్లతో డబ్బింగ్ చెప్పించడం అనేది మైనస్ అయ్యింది. ఎందుకంటే ఆవిడ్ని దాదాపు 25 ఏళ్లుగా చూస్తున్నాం. ఆమె “సూరీడు” డైలాగ్ ఎంత ఫేమస్సో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాంటావిడ పెర్ఫార్మెన్స్ ను వేరే వాయిస్ తో చూడడం అనేది అస్సలు సింక్ అవ్వలేదు.
శివాజీ రాజా పాత్ర బాగుంది కానీ.. దాన్ని ముగించిన విధానంలో ఎమోషన్ లేదు.

సాంకేతికవర్గం పనితీరు: సురేష్ బొబ్బిలి ఎప్పట్లానే తన బెస్ట్ ఇచ్చాడు. రాంబాయి పాటకి ఇచ్చిన అయిదారు వెర్షన్లు సందర్భాన్ని, ఎమోషన్ ను బాగా ఎలివేట్ చేశాయి. అయితే.. మిక్సింగ్ విషయంలో ఇంకాస్త కేర్ తీసుకోవాల్సింది. మరీ ముఖ్యంగా చైతూ జొన్నలగడ్డ సన్నివేశాలకి ఇచ్చిన బీజియం మరీ లౌడ్ గా ఉంది. సంగీతంతో పాత్రలోని ఇంటెన్సిటీ ఎలివేట్ అవ్వాలి కానీ.. కేవలం సంగీతం లౌడ్ గా ఉంటే సరిపోదు.
వాజిద్ సినిమాటోగ్రఫీ బాగుంది. సింగిల్ లొకేషన్ అయినప్పటికీ.. ఎక్కడా రిపీట్ లేకుండా జాగ్రత్తపడ్డాడు. అలాగే.. ట్రాలీ షాట్స్ & క్రేన్ షాట్స్ ను ఎమోషన్ కు తగ్గట్లుగా కంపోజ్ చేసిన విధానం బాగుంది.
కలరింగ్, ఆర్ట్ వర్క్ విషయంలో మంచి కేర్ తీసుకున్నారు. ముఖ్యంగా కాస్ట్యూమ్ వర్క్ చాలా బాగుంది.
ఇక దర్శకుడు సాయిలు కాంపాటి పనితనం గురించి మాట్లాడుకోవాలి. ఒక ఊరి వ్యక్తిగా తాను విన్న, చూసిన కథను స్ట్రయిట్ ఫార్వర్డ్ గా చెప్పాడు. కొంతమేరకు డ్రమేటిక్ గా చూపించాడు కానీ.. అవసరమైన ఇంపాక్ట్ మాత్రం ఇవ్వలేకపోయాడు. ఒక షాకింగ్ ఫ్యాక్టర్ ని ఇంపాక్ట్ ఫుల్ గా చెప్పడం అనేది చాలా కీలకం. నిజంగానే క్లైమాక్స్ లో చూపించిన పాయింట్ అనేది “ఆమ్మో ఇలా కూడా చేస్తారా?” నోరెళ్లబెడతారు. కానీ.. ఆ విషయం తాలుకు ఇంపాక్ట్ ను ఇంటికి తీసుకెళ్లలేరు. అలా తీసుకెళ్లలేకపోవడం అనేది దర్శకుడిగా సాయిలు కంపాటి పూర్తిస్థాయిలో ఆకట్టుకోలేకపోయాడని చెప్పేందుకు ప్రతీక. అయితే.. అతడి నిజాయితీ, నాస్టాల్జియాతో కామెడీ పండించగల సత్తా అతడ్ని టాలెంటెడ్ డైరెక్టర్స్ జాబితాలో నిలబెడుతుంది.

విశ్లేషణ: శ్రీదేవి సోడా సెంటర్, పావ కథైగల్ లో ప్రకాష్ రాజ్-సాయిపల్లవి ఎపిసోడ్ చూసినప్పుడు.. సదరు సన్నివేశాలు, ఆ సన్నివేశాల్లోని ఇంటెన్స్ ఎమోషన్ చాలాసేపు మనల్ని వెంటాడుతుంది. “రాజు వెడ్స్ రాంబాయి”లో క్లైమాక్స్ కూడా అదే స్థాయి ఇంపాక్ట్ ఉన్న మేటర్. అయితే.. దాన్ని ఎగ్జిక్యూట్ చేసిన విధానంలో ఇంటెన్సిటీ మిస్ అయ్యింది. ఆ విషయంలో ఇంకాస్త కేర్ తీసుకుని ఉంటే సినిమా కచ్చితంగా ఎప్పటికీ మరువలేని అనుభూతిని మిగిల్చేది. అయినప్పటికీ.. సాయిలు నిజాయితీగా తెరకెక్కించిన విధానం, అఖిల్ రాజ్-తేజస్విని రావు సహజమైన నటన, సురేష్ బొబ్బిలి సంగీతం, షాక్ ఇచ్చే క్లైమాక్స్ కోసం “రాజు వెడ్స్ రాంబాయి” చిత్రాన్ని కచ్చితంగా థియేటర్లో చూడొచ్చు!

ఫోకస్ పాయింట్: షాకింగ్ క్లైమాక్స్ ని ఎలివేట్ చేసే డ్రామా మిస్ అయ్యింది!
రేటింగ్: 2.5/5
