క్రిష్ కిటుకు తెలిసొచ్చింది..!

క్రిష్ క్రియేటివ్ దర్శకుడు మాత్రమే కాదు తెలివైన దర్శకుడు కూడా. ఈ మాట నేనంటున్నది కాదు. మొత్తం చిత్ర పరిశ్రమ కలిసి అతగాడి తెలివి తేటల్ని ప్రశంసిస్తోంది. ఎందుకంటారా…? ఓ పెద్ద హీరో సినిమా.. అందునా చారిత్రాత్మక ఇతివృత్తంతో కూడుకున్నది అయితే ఆ సినిమా బడ్జెట్ కోటలు దాటుతుందన్నది తెలిసిందే కదా. గుణశేఖర్ ‘రుద్రమదేవి’ కోసం 80 కోట్లు వ్యయం చేయగా అన్నిట్లోనూ రికార్డులు సృష్టించిన ‘బాహుబలి’ రెండు భాగాలు కలిపి నిర్మాణ వ్యయాన్ని మూడు, నాలుగు వందల కోట్లు వరకు తీసుకెళ్లింది. అయితే క్రిష్ 50-60 కోట్లలోనే క్వాలిటీ అవుట్ ఫుట్ తీసుకొస్తున్నాడట. వివరాల్లోకెళితే..

నందమూరి బాలయ్య వందో సినిమా తెరకెక్కుతున్న ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ సినిమాకి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. క్రిష్ తీసిన సినిమాలన్నీ ఆయన సొంత బ్యానర్ లోనే రూపొందుతుంటాయి. ఆ కోవలోనే ఈ సినిమా కూడా సంక్రాతి విడుదలకు ముస్తాబవుతోంది. చారిత్రాత్మక కథతో తెరకెక్కుతోన్న ఈ కథ కోసం క్రిష్ భారీ సెట్స్, క్రేన్స్ అని ఆర్భాటం ఎక్కువ చేయకుండా జార్జియా వంటి దేశాల్లో ఉన్న సహజమైన లొకేషన్లలో షూట్ చేశారు. వీటిని గ్రాఫిక్స్ సాయంతో మెరుగులు దిద్ది సన్నివేశాలు సిద్ధం చేస్తున్నారు. మరీ అవసరం అనుకుంటే తప్ప సెట్స్ జోలికి పోవడంలేదట. పైగా బాలయ్య కూడా రెమ్యునరేషన్ గా పది కోట్లిస్తామన్నా కాదని, ఎనిమిది చాలని కుదించుకున్నారట. ఇలా అన్నీ కలిసి సినిమా బడ్జెట్ తడిసి మోపెడవకుండా జరిగిందని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో తెరకెక్కిన ‘కంచె’ సినిమాకి సైతం క్రిష్ ఇదే సూత్రం అన్వయించి సుమారు 20 కోట్లలోనే పూర్తి చేసి శబాష్ అనిపించుకున్నారు. క్రిష్ కిటుకు బావుంది కదూ..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus