‘ఉప్పెన’ (Uppena) సినిమాతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి (Krithi Shetty), ఆ సినిమాలో ‘బేబమ్మ’గా ఒక్కసారిగా స్టార్‌డమ్ సంపాదించింది. 2021లో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో కృతి ఎక్కడికి వెళ్లినా ‘బేబమ్మ’ అనే పిలుపు వినిపించింది. ఈ క్రేజ్‌తో వరుస సినిమా అవకాశాలు వచ్చాయి, కానీ ఆ తర్వాత ఆమె చేసిన చిత్రాలు ఎక్కువగా నిరాశపరిచాయి. అరడజను సినిమాలు చేసినా, హిట్స్ కంటే ఫ్లాపులే ఎక్కువగా ఉండటంతో కృతి కెరీర్‌పై ఒత్తిడి పెరిగింది.
గత ఏడాది శర్వానంద్‌తో (Sharwanand) ‘మనమే’(Manamey) సినిమా చేసిన కృతి, ఆ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేకపోవడంతో తెలుగులో కొత్త అవకాశాలు రాకుండా ఆగిపోయాయి. ఈ గ్యాప్‌ను అదునుగా మలచుకున్న కృతి, తమిళ్‌లో ‘జినీ’, ‘ఎల్.ఐ.కె’ అనే రెండు సినిమాల్లో నటిస్తోంది. ఈ చిత్రాలపై ఆమె చాలా ఆశలు పెట్టుకుంది, అవి విజయవంతమైతే తెలుగులో మళ్లీ అవకాశాలు వస్తాయని నమ్ముతోంది. అయితే, తెలుగు సినిమా ఇండస్ట్రీలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి కృతి కొత్త ప్రయత్నం మొదలుపెట్టింది.
తెలుగు భాష నేర్చుకోవడం ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరవ్వాలని కృతి నిర్ణయించుకుంది. ఈ మధ్య కాలంలో హీరోయిన్లు సొంత డబ్బింగ్ చెప్పుకోవడం ట్రెండ్‌గా మారింది. తెలుగు బాగా వచ్చి ఉంటే డబ్బింగ్‌లో చిన్న పొరపాట్లను నివారించడమే కాక, డైలాగ్‌లోని ఎమోషన్‌ను సరిగ్గా పలకడం సులభమవుతుందని కృతి భావిస్తోంది. అంతేకాదు, భాషలో పట్టు ఉంటే నటనలోనూ లోతు వస్తుందని ఆమె నమ్ముతోంది.
కృతి ఈ ప్రయత్నం ఆమె కెరీర్‌కు ప్లస్‌గా మారే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంటున్నారు. తెలుగు ఇండస్ట్రీలో మళ్లీ సక్సెస్ సాధించాలంటే ఆమెకు ఒక హిట్ సినిమా చాలా అవసరం. ప్రస్తుతం తెలుగులో అవకాశాలు రాకపోవడంతో, మంచి ఆఫర్ కోసం ఎదురుచూస్తూ, తెలుగు భాష నేర్చుకుంటూ తనను తాను సిద్ధం చేసుకుంటోంది. తమిళ్ సినిమాలు విజయవంతమైతే, తెలుగులో మళ్లీ బిజీ అయ్యే అవకాశం ఉంది.