నా అల్లుడు, విశాఖ ఎక్స్ ప్రెస్ వంటి చిత్రాల తరువాత చాలా గ్యాప్ తీసుకొని ముళ్ళపూడి వరా దర్శకత్వం వహించిన చిత్రం ‘కుందనపు బొమ్మ’. సుధాకర్ కొమ్మాకుల, సుదీర్ వర్మ, చాందిని చౌదరి ప్రధాన పాత్రల్లో దర్శకేంద్రుడు శ్రీ కె.రాఘవేంద్రరావు బి.ఎ సమర్పణలో రూపొందిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ముళ్ళపూడి వరా తెరకెక్కించిన మొదటి రెండు చిత్రాలు నిరాశే మిగిల్చాయి. మరి ఈ సినిమాతో అయినా హిట్ అందుకున్నాడో లేదో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం..!
కథ : మహాదేవరాజు(నాగినీడు) గారాల పట్టి సుచి(చాందిని చౌదరి). చిన్నప్పుడే సుచిని తన మేనల్లుడు గోపి(సుధాకర్) కు ఇచ్చి పెళ్లి చేయాలని అనుకుంటాడు మహాదేవరాజు. అయితే సుచిని చూసి మొదటి చూపులోనే ప్రేమిస్తాడు వాసు(సుధీర్ వర్మ). మహాదేవరాజు ఇంట్లో కార్ రిపేర్ చేయడం కోసం సుచి ఇంటికే మెకానిక్ గా వెళ్తాడు వాసు. మొదట్లో గొడవ పడుతూ ఉండే సుచి, వాసులు ఒకరినొకరు ఇష్టపడతారు. సుచి తన ప్రేమ విషయాన్ని తన బావ గోపికు చెప్తుంది. మీ ఇద్దరి పెళ్లి నేను జరిపిస్తానని మాటిచ్చిన గోపి, సుచిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోతాడు. అసలు గోపి, సుచిని పెళ్లి చేసుకోవాలనుకోవడానికి గల కారణాలేంటి..? సుచి, వాసుల ప్రేమ గెలుస్తుందా..? ఇంతకీ ఆ కార్ కథేంటి..? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..!
నటీనటుల పెర్ఫార్మన్స్ : ఈ సినిమా ముఖ్యంగా చాందిని, సుధాకర్, సుధీర్ ఈ ముగ్గురు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. చాందిని చౌదరి ఇది వరకు కేటుగాడు సినిమాలో కనిపించినా తను మొదట సైన్ చేసింది ఈ సినిమాకే. లఘు చిత్రాల ద్వారా తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చి ఈ భామ తనకు వచ్చిన అవకాశాల్ని వినియోగించుకోలేకపోతోంది. ఈ సినిమాలో తన నటన చెప్పుకోదగ్గ ఏమి లేదు. సెంటిమెంట్, కామెడీ, ఎమోషన్స్ ఇలా అన్నింటికీ ఒకే ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చినట్లు అనిపిస్తుంది. ఎక్కువ సమయం తెరపై చాందినిని చూడడం కష్టమే.. ఇక వాసు పాత్రలో నటించిన సుధీర్ వర్మ పర్వాలేదనిపించారు. సుధాకర్ కోమాకుల నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తాడు. అయితే తన పాత్రలో అంత డెప్త్ ఉండకపోవడం వలన పెద్దగా వర్కవుట్ కాలేదు. నాగినీడు, రాజీవ్ కనకాల తమ పాత్రల పరిధుల్లో చక్కగా నటించారు. కామెడీ కోసం ఝాన్సీ చేసిన ప్రయత్నం ప్రేక్షకులకు విసుగు తెప్పిస్తుంది. ఓవరాల్ గా సినిమాలో చెప్పుకోవడానికి ఒక్క క్యారెక్టర్ కూడా లేదు.
సాంకేతిక వర్గం పనితీరు : సినిమాలో కథ, కథనం సరిగ్గా లేనప్పుడు మిగిలిన టెక్నీషియన్స్ మాత్రం పని కనబరచడానికి ఏముంటుంది. వరా ముళ్ళపూడి రాసుకున్న కథను చూస్తుంటే ఆయన ఇంకా ఈ జెనరేషన్ కు తగినట్లుగా ఆలోచినట్లేదనిపిస్తుంది. కథలో ఎలాంటి కొత్తదనం ఉండదు. అక్కడక్కడా క్లారిటీ కూడా మిస్ అయ్యాడు. కీరవాణి మ్యూజిక్ ఏ మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోదు. ఈ సినిమాకు మరో పెద్ద మైనస్ ఎడిటింగ్. సినిమా చూస్తున్న సామాన్య ప్రేక్షకుడికి కూడా ఈ విషయం సులువుగా అర్ధమవుతుంది. సినిమాటోగ్రాఫర్ జాన్ కొత్త లొకేషన్స్ ను చూపించడానికి ప్రయత్నించాడు. అయినా కెమెరా పనితీరు సో.. సో.. గా అనిపిస్తుంది. ఈ సినిమా చూసిన తరువాత వరా ముళ్ళపూడి చేసిన మొదటి రెండు చిత్రాలే బెటర్ గా ఉన్నాయే అనిపిస్తుంది.
విశ్లేషణ : పల్లెటూరిలో పెద్ద ఫ్యామిలీ, ఆ కుటుంబంలో అమ్మాయికి పెళ్లి. తను మాత్రం వేరే అబ్బాయిని ప్రేమించడం. సొంత బావ పెళ్లి ప్రేమ పెళ్లి జరిపిస్తానని తను పెళ్లికి రెడీ అవ్వడం. ఇవన్నీ మనం ఎప్పుడో చూసేసాం. ఏదో సినిమా నడిపించడానికి అన్నట్లు ఓ కార్ ను తెచ్చి రిపేర్ చేయమని చెప్పడం. ఆ కార్ కు ఓ సెంటిమెంట్ కథను జోడించడం. ఇలా ప్రతి సీన్ ప్రేక్షకులకు విసుగు తెప్పిస్తూ.. ఓ ట్విస్ట్ తో ఇంటర్వెల్ ముగుస్తుంది. పోనీ సెకండ్ హాఫ్ అయినా.. బావుంటుందేమో అని అనుకుంటే పొరపాటే. సీన్, సీన్ కు మధ్య కనెక్టివిటీ ఉండదు. సుధాకర్ చేసిన గోపి అనే పాత్రలో క్లారిటీ ఉండదు. స్క్రీన్ ప్లే చప్పగా ఉంటుంది. దానికి తోడు ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సన్నివేశాలైతే ఇంకా ఘోరంగా ఉంటాయి. కుందనపు బొమ్మ టైటిల్ కు ఎలాంటి జస్టిఫికేషన్ ఉండదు. చాందిని అంత అందంగా కూడా తెరపై కనిపించలేదు. మొత్తానికి ఈ కుందనపు బొమ్మ చూడడానికి చాలా ఓపిక కావాలి.