మన అభిప్రాయాలు మనకి భగవద్గీత శ్లోకాళ్ల అనిపిస్తాయి. వాటినే ఇతరులతో పంచుకుంటే కొన్నిటికి అభినందనలు వస్తాయి.. మరికొన్నింటికి విమర్శలు వస్తాయి. కుష్బూ అభిప్రాయానికి మాత్రం కోర్టు నుంచి నోటీసులు వచ్చాయి. హీరోయిన్ అయినప్పటికీ ఆమె చెప్పిన అభిప్రాయం వల్ల కోర్టు మెట్టు ఎక్కాల్సి వచ్చింది. కొన్నేళ్ల క్రితం ఓ ఇంటర్వ్యూ లో కుష్బూ ..”ఆడ, మగ ఇష్టంతో పెళ్ళికి ముందు సెక్స్ పాల్గొంటే తప్పులేదు. అంత మాత్రాన ఆడవారి శీలం పోదు. శీలం అనేది మనసుకు సంబంధించింది” అని చెప్పారు. దీంతో అప్పుడు పెద్ద దుమారం రేగింది. మాటలను వెనక్కి తీసుకోవాలని మహిళా సంఘాలు ఒత్తిడి తెచ్చాయి.
అయినా వినకపోవడంతో కుష్బూ పై కేసు నమోదు చేశారు. అప్పుడు కేసు విచారణ నిమిత్తం కోర్టుకు హాజరయినప్పుడు ఖుష్బూ ప్రయాణిస్తున్న వాహనంపై కోడిగుడ్లు, టమోటాలతో దాడిచేశారు. ఈ చర్యల్ని ఖండిస్తూ ఖుష్బూ వారిపై కేసు నమోదు చేసారు. ఈ దాడిలో భాగంగా మొత్తం 41 మందిపై కేసు నమోదైంది. అప్పటి నుంచి ఈ రెండు కేసుల విచారణ సాగుతోంది. ఇందులో భాగంగా మొన్న (గత బుధవారం) కోర్టు కి హాజరయ్యారు. కుష్బూను మెజిస్ట్రేట్ కొన్ని ప్రశ్నలు వేసి ఆమె సమాధానాలను పరిగణలోకి తీసుకుని కేసును మార్చి నెల 6వ తేదీకి వాయిదా వేశారు. అనంతరం కుష్బూ ఇంటికి తిరిగి వెళ్తుండగా.. వ్యతిరేకులు మళ్ళీ ఆమె కారుపై కోడిగుడ్లతో దాడిచేసి ఆగ్రహాన్ని తెలిపారు. ఈ సారి ఆమె ఎవరిపైనా కేసు నమోదు చేయకపోవడం విశేషం.