కేవలం నాలుగు పాత్రల చుట్టూ తిరిగే కథతో తెరకెక్కిన చిత్రం “కుటుంబ కథా చిత్రం”. నందు-శ్రీముఖి-కమల్ కామరాజు-సూర్య ముఖ్యపాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రం ట్రైలర్ ఆడియన్స్ ను బాగా అలరించింది. సస్పెన్స్ ఫ్యామిలీ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం నేడు విడుదలైన 13 తెలుగు చిత్రాల్లో ఒకటైనప్పటికీ.. ఉన్నవాటిలో కాస్త జనాలు ఆసక్తి చూపించిన అతి తక్కువ సినిమాల్లో ఒకటని చెప్పొచ్చు. మరి జనాలు అంతగా ఆసక్తి చూపాక దర్శకనిర్మాతలు ఏం చేశారో చూద్దాం..!!
కథ : చరణ్ (నందు) ఓ సాఫ్ట్ వేర్ కంపెనీ ఎంప్లాయ్, పెళ్లై ఎనిమిదేళ్ళవుతున్నా తన భార్య పల్లవి (శ్రీముఖి) కూడా ఉద్యోగం చేస్తుండడం వలన కలిసి మాట్లాడే సమయం సైతం లేక ఒకరికి తెలియకుండా మరొకరు బాధపడుతూ, తిట్టుకుంటూ, గొడవపడుతూ ఉంటారు. అదే ఇంటికి వాచ్ మ్యాన్ గా పనిచేసే (కమల్ కామరాజు) ఎప్పుడూ చరణ్-పల్లవిల గొడవలు వింటూ వారి మీద, వారి జీవన విధానం మీద జాలిపడుతుంటాడు. ఆ కుటుంబానికి చెందినవారందరూ “ఇలా జరిగితే ఎలా” అని ఊహించుకొంటే వచ్చే అవుట్ పుట్ “కుటుంబ కథా చిత్రం”.
నటీనటుల పనితీరు : నందు ఈ చిత్రంలో ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ తో పర్వాలేదనిపించుకోగా.. శ్రీముఖి శ్రీమతిగా మెప్పించడానికి బాగానే కష్టపడింది. తెలుగమ్మాయి ఆయ్యుండి తన పాత్రకు తాను డబ్బింగ్ ఎందుకు చెప్పుకోలేదో తెలియదు. సో సొంత డబ్బింగ్ చెప్పని కారణంగా ఆమె టీవీ షోస్ చూసే ఆడియన్స్ ఆమె వాయిస్ బాడీకి సింక్ అవ్వకపోవడంతో అదో రకంగా ఉంటుంది. కానీ.. కమల్ కామరాజుకి ఏమయ్యిందో ఏమో తెలియదు కానీ.. మెంటలీ అన్ స్టేబుల్ పర్సన్ గా యాక్ట్ చేద్దామనుకొని పిచ్చి అరుపులు, అర్ధం కాని బాడీ లాంగ్వేజ్ తో చిరాకు పెట్టించాడు. ఒక్కోసారి కమల్ కామరాజు చేసే అతిని తట్టుకోలేక థియేటర్ వదిలి పారిపోదామా అనే స్థాయి ఫ్రస్టేషన్ తో ఇబ్బంది పడతాడు ప్రేక్షకుడు. చిన్న పాత్రే అయినా సూర్య మెప్పించాడు.
సాంకేతికవర్గం పనితీరు : సునీల్ కశ్యప్ తన నేపధ్య సంగీతంతో సన్నివేశానికి ఇంటెన్సిటీ యాడ్ చేయలేక.. ఉన్న ఒక్క పాటతో మెప్పించలేక నానా ఇబ్బందులు పడ్డాడు. మధ్యలో హారర్ థీమ్ బ్యాగ్రౌండ్ స్కోర్ తో ఎందుకు ఇబ్బందిపెట్టాడో అర్ధం కాదు. సినిమా టీం మొత్తానికి తన పరిధిని మించి పనిచేసిన వ్యక్తుల్లో కెమెరామెన్ మల్హర్ భట్ జోషీ ఒక్కరే. అతి తక్కువ టైమ్ లో కంప్లీట్ చేసిన సినిమా కావడంతో తక్కువ కెమెరాలతో వీలైనంత మంచి ఔట్ పుట్ ఇచ్చాడు. సినిమా మొత్తానికి చెప్పుకోవడానికి సినిమాటోగ్రఫీ వర్క్ తప్ప మరేమీ లేదు.
ఇక దర్శకుడు వి.ఎస్.వాసు గురించి చెప్పాలంటే..
పర్స్పెక్టివ్ స్క్రీన్ ప్లే (Perspective Screenplay) అనే అద్భుతమైన మరియు మోస్ట్ సక్సెస్ ఫుల్ ఫార్మాట్ తో సినిమా ఎలా తీయకూడదు అనేందుకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ “కుటుంబ కథా చిత్రం”. సినిమా తీయడంపై కనీస స్థాయి అవగాహన ఉన్న దర్శకుడు ఎవరైనా సరే ముందు సినిమా కథ ఏమిటి, పాత్రల తీరుతెన్నులేమిటి అనే విషయాన్ని ప్రేక్షకులకు అర్ధమయ్యేలా చెప్పి.. తర్వాత ఒక్కో పాత్రధారి పాయింట్ ఆఫ్ వ్యూలో కథను మలుపులు తిప్పాలి. అలా కాకుండా ఏదో చేసేద్దామ్.. కొత్తగా ప్రయత్నిద్దాం అనుకొన్నప్పుడు ఇలాంటి విషయం లేని, అర్ధం కాని సినిమాలు వస్తాయి. అసలు సినిమా మొత్తం చూశాక కూడా ఏది కల ఏది నిజం అనే విషయంలో క్లారిటీ ఉండదు. వాసు స్క్రీన్ ప్లే ఎంత అద్భుతంగా రాసుకొన్నాడు అనే విషయానికి అది ఉదాహరణ. ఇక సినిమాని ముగించిన నోట్ ఏదైతే ఉందో.. “న భూతో న భవిష్యత్”.
విశ్లేషణ : సినిమాలు కొత్తగా తీయడం అంటే స్క్రీన్ ప్లే ప్రేక్షకులకు కూడా అర్ధం కాని స్థాయిలో తీయమని కాదు. అర్ధవంతమైన స్క్రీన్ ప్లేతో, ఆకట్టుకొనే విధంగా తెరకెక్కించమని. ఈ విషయాన్ని దర్శకులు అర్ధం చేసుకొంటేనే మున్ముందు మంచి సినిమాలోస్తాయి. లేదంటే.. ఇలాంటి “కుటుంబ కథా చిత్రాలు” శుక్రవారం వచ్చి ఆదివారానికి మాయమవుతాయి.