చిన్న సినిమా, పెద్ద సినిమా అంటూ గీత గీసేసి మాట్లాడుతుంటాం కానీ.. ఒక్కోసారి చిన్న సినిమా అనుకునేది పెద్ద సినిమాను దాటిన విజయం, వసూళ్లు అందుకుంటుంది. ఇలాంటి సినిమాలు మనం ఇప్పటివరకు చాలా చూశాం. ఇకపై చూస్తాం కూడా. ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడు మొత్తం సినిమా పండగ చేసుకుంటుంది. ఆ మధ్య ‘కాంతార’ సినిమా గురించి ఇలానే మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఆ స్థాయిలో విజయం అందుకున్న మరో చిత్రం గురించి భారతీయ సినిమా జనాలు మాట్లాడుకుంటున్నారు. అదే ‘లాలో’.
భారీ బడ్జెట్, పాన్ ఇండియా జపం లేకుండా వచ్చిన ‘లాలో’ సినిమా ఇప్పుడు రూ.100 కోట్ల క్లబ్‌లోకి చేరడానికి సిద్ధమవుతోంది. దీంతో ఈ సినిమా గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. గుజరాత్ నుండి వచ్చిన ఈ సినిమా బడ్జెట్ రూ. 50 లక్షలు కావడం గమనార్హం. ‘లాలో- కృష్ణ సదా సహాయతే’ ఏడు వారాల క్రితం ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్లలో విడుదలైంది. తొలి రోజుల్లో అంతంతమాత్రం ఆదరణతో సినిమా నడిచింది. అయితే ఆ తర్వాత మౌత్ టాక్‌తో దూసుకెళ్లడం స్టార్ట్ చేసింది.
సినిమా కథలోని బలంతో వసూళ్లు పుంజుకున్నాయి. తొలివారం ఈ సినిమాకు కేవలం రూ.26 లక్షల వసూళ్లు మాత్రమే రాగా.. ఆ తర్వాత రెండు వారాలు కూడా ఇదే స్థాయిలో వసూళ్లు వచ్చాయి. నాలుగో వారం నుండి ఆ లెక్క కోట్లలోకి మారింది. అలా ఆరో వారం పూర్తయ్యే సరికి సినిమా రూ.70కోట్లకుపైగా రాబట్టింది. ఇప్పుడు ఏడో వారంలో రూ.100కోట్ల దగ్గరకు వచ్చేస్తోంది. ఈ వారాంతం లేదా వచ్చే వారం ప్రారంభంలో సినిమా రూ.100 కోట్లు వచ్చేస్తాయి. అదే జరిగితే గుజరాతీ సినిమా పరిశ్రమలో తొలి రూ. 100 కోట్ల సినిమా అవుతుంది.
ఇప్పటివరకు గుజరాతీ సినిమాలో 2019లో వచ్చిన ‘చాల్ జీవీ లాయియే’ సినిమానే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా. అప్పట్లో ఈ సినిమాకు రూ.50 కోట్ల వసూళ్లు వచ్చాయి. అంకిత్ సఖియా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రీవా రచ్, శ్రుహద్ గోస్వామి, కరణ్ జోషి, మిష్టి కడేచా ప్రధాన పాత్రధారులు. ఈ సినిమా నవంబర్ 28న దేశవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. హిందీ డబ్బింగ్ పనులు కూడా పూర్తయ్యాయట.