Laggam Review in Telugu: లగ్గం సినిమా రివ్యూ & రేటింగ్!

  • October 25, 2024 / 04:08 PM IST

Cast & Crew

  • సాయి రోనక్ (Hero)
  • ప్రగ్యా నగ్రా (Heroine)
  • రాజేంద్రప్రసాద్, రోహిణి తదితరులు.. (Cast)
  • రమేష్ చెప్పాల (Director)
  • టి.వేణుగోపాల్ రెడ్డి (Producer)
  • చరణ్ అర్జున్ - మణిశర్మ (Music)
  • బాల్ రెడ్డి (Cinematography)
  • Release Date : అక్టోబర్ 25, 2024

“బేవార్స్, భీమదేవరపల్లి బ్రాంచి” వంటి సినిమాలతో దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రమేష్ చెప్పాల (Ramesh Cheppala) తెరకెక్కించిన తాజా చిత్రం “లగ్గం” (Laggam) . సాయి రోనక్ (Sai Ronak)  ప్రగ్యా నగ్రా (Pragya Nagra) జంటగా నటించిన ఈ చిత్రంలో సీనియర్ ఆర్టిస్టులు రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad) , రోహిణి (Rohini) కీలకపాత్రలు పోషించారు. అక్టోబర్ 25న విడుదలవుతున్న ఈ సినిమా కంటెంట్ మీద నమ్మకంతో ఏకంగా మూడ్రోజుల ముందు నుంచే ప్రీమియర్స్ షోస్ వేశారు. మరి చిత్రబృందం నమ్మకాన్ని సినిమా నిలబెట్టిందో లేదో చూద్దాం..!!

కథ: హైదరాబాద్ లో మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగం, నెలకి రెండు లక్షల జీతం, సొంత కారు, ఉండడానికి పెద్ద బంగ్లాతో మంచి రిచ్ లైఫ్ లీడ్ చేస్తుంటాడు చైతన్య (సాయి రోనక్). మేనల్లుడిని చూడ్డానికి హైదరాబాద్ వచ్చి అక్కడ చైతన్య జీవన విధానాన్ని చూసి తన కూతురు కూడా ఈ తరహా జీవితాన్ని ఆస్వాదించాలని ఆశ పడతాడు మేనమామ సదానందం (రాజేంద్రప్రసాద్).

కట్ చేస్తే.. తన కూతురు మానస (ప్రగ్యా నగ్రా)కి మేనల్లుడు చైతన్యల పెళ్ళికి రంగం సిద్ధం చేస్తాడు సదానందం. కానీ, అనుకోని విధంగా ఆ పెళ్లి పీటల దాకా వచ్చి ఆగిపోతుంది. చైతన్య-మానసల పెళ్లి ఎందుకు ఆగింది? ఆ పెళ్లి ఆగడం ఇరు కుటుంబాలను ఎంతగా బాధించింది? చివరికి వాళ్లు ఎలా ఒకటయ్యారు? అనేది “లగ్గం” కథాంశం.

నటీనటుల పనితీరు: ఒక నటుడికి కావాల్సిన అన్ని అంశాలు పుష్కలంగా ఉన్న వ్యక్తి సాయి రోనక్. కానీ సరైన కథలు ఎంచుకోకపోవడం వల్ల సోలో హీరోగా పదికి పైగా సినిమాలు చేసినా ఇప్పటికీ హీరోగా నిలదొక్కుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. “లగ్గం”లోను నటుడిగా తన సత్తాను చాటుకొనే ప్రయత్నం చేసినప్పటికీ.. క్యారెక్టర్ ఆర్క్ సరిగా ఎస్టాబ్లిష్ చేయకపోవడంతో రోనక్ కష్టం మళ్లీ వృథా అయ్యిందనే చెప్పాలి. హీరోయిన్ ప్రగ్యా నగ్రా పాత్రతోనూ అదే సమస్య. ఆమె ఎందుకు బాధపడుతుంది? ఆమె బాధకు కారణం ఏమిటి? అనే విషయాన్ని వివరించే ప్రయత్నం బాగుంది కానీ.. ఎమోషనల్ కనెక్టివిటీ మిస్ అయ్యింది. అందువల్ల హీరోయిన్ క్యారెక్టర్ కి ఆడియన్స్ సరిగా కనెక్ట్ అవ్వలేరు.

రాజేంద్రప్రసాద్, రోహిణిల పాత్రలు మాత్రం విశేషంగా ఆకట్టుకుంటాయి. అమ్మాయి తండ్రిగా రాజేంద్రప్రసాద్ నటనలో బాధ్యత, అబ్బాయి తల్లిగా రోహిణి నటనలో సంతోషం చాలా స్పష్టంగా కనిపిస్తాయి. ముఖ్యంగా రోహిణి పాత్ర కన్నీరు పెట్టినప్పుడల్లా ఆ తడి ప్రేక్షకుల మనసులకు తగులుతుంది. ఎల్బీ శ్రీరామ్ (L.B. Sriram) పాత్ర నేటితరం యువకుల్ని కచ్చితంగా ఆలోచింపజేస్తుంది. ఇక రచ్చ రవి, చమ్మక్ చంద్ర తదితరులు కాస్త నవ్వించడానికి ప్రయత్నించి ఓ మేరకు అలరించగలిగారు.

సాంకేతికవర్గం పనితీరు: మణిశర్మ (Mani Sharma) నేపథ్య సంగీతం బాగుంది. చరణ్ అర్జున్ (Charan Arjun) అందించిన పాటలు కూడా బాగున్నాయి. ముఖ్యంగా క్లైమాక్స్ లో వచ్చే “ఇంతేనేమో ఇంతేనేమో” పాట ప్లేస్మెంట్ మరియు ఆ పాట సాహిత్య విలువ అభినందనీయం. ఓ ఆడపిల్ల పెళ్లి చేసుకొని గడప దాటి వెళుతున్నప్పుడు ఆమె మరియు ఆమె తల్లిదండ్రులు పడే వేదనను అద్భుతంగా వర్ణించిన విధానం ప్రశంసార్హం. బాల్ రెడ్డి (M.N.Bal Reddy) సినిమాటోగ్రఫీ రిచ్ గా ఉంది. నిజానికి ఈ సినిమా బడ్జెట్ కు మించిన అవుట్ పుట్ ఇచ్చాడు బాల్ రెడ్డి. ప్రొడక్షన్ డిజైన్, ఆర్ట్ వర్క్ వంటి డిపార్ట్మెంట్ వర్క్స్ అన్నీ డీసెంట్ గా ఉన్నాయి.

దర్శకుడు రమేష్ చెప్పాల (Ramesh Cheppala) ప్రతి ఇంట్లో జరిగే కథను తెరపై చూపించాలనుకోవడంలో నిజాయితీ ఉంది. ఎక్కడా అశ్లీలత కానీ ద్వంద్వార్ధపు సంభాషణలు కానీ లేకుండా సింపుల్ గా స్టోరీని నడిపించిన విధానం బాగుంది. అయితే.. సినిమాలో ఆడియన్స్ ను ఇన్వాల్వ్ చేసేందుకు కావాల్సిన కీలకమైన ఎమోషన్ & స్క్రీన్ ప్లే కనెక్టివిటీ మిస్ అయ్యాయి. అందుకే డీసెంట్ సినిమా అయినప్పటికీ.. ఆడియన్స్ ను సినిమాలో లీనం చేయడానికి ఇబ్బందిపడింది. ఎందుకంటే.. రోహిణి, రాజేంద్రప్రసాద్ క్యారెక్టర్ చక్కగా వర్కవుట్ అయ్యాయి. ముఖ్యంగా క్లైమాక్స్ లో ఎమోషనల్ సాంగ్ సినిమాకి మంచి ఎండింగ్ ఇచ్చింది. ఓవరాల్ గా.. దర్శకుడిగా, కథకుడిగా పర్వాలేదు అనిపించుకున్నాడు రమేష్ చెప్పాల.

విశ్లేషణ: అశ్లీలత, అసభ్యత లేకుండా కుటుంబం మొత్తం కలిసి చూడగల సినిమాలు ఈమధ్యకాలంలో తగ్గిపోయాయి. ఆ లోటును కాస్త పూడ్చగల సినిమా “లగ్గం”. అయితే.. ఎమోషన్ సరిగా వర్కవుట్ అయ్యి ఉంటే మరో “బలగం” అయ్యేది. ఆ ఎమోషన్ మిస్ అవ్వడంతో యావరేజ్ సినిమాగా మిగిలిపోయింది.

ఫోకస్ పాయింట్: కనుమరుగవుతున్న కుటుంబ బంధాల ఆవశ్యకతను తెలియజెప్పిన “లగ్గం”.

రేటింగ్: 2.5/5

Rating

2.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus