టాలీవుడ్ నటి లావణ్య త్రిపాఠి ప్రస్తుతం తన తాజా చిత్రం ‘సతీ లీలావతి’ ప్రమోషన్లతో బిజీగా గడుపుతున్నారు. పెళ్లి తర్వాత ఆమె నటించిన తొలి సినిమా కావడంతో ఈ చిత్రంపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ సందర్భంగా ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలలో కొన్ని ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. ముఖ్యంగా తన కెరీర్‌లో మిస్ అయిన ఒక పెద్ద హిట్ సినిమా గురించి లావణ్య చెప్పిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
సినీ పరిశ్రమలో చాలా సార్లు మంచి అవకాశాలు చేతికి వచ్చినట్టే వచ్చి జారిపోతాయి. కొన్నిసార్లు నటీనటులు తిరస్కరించిన సినిమాలు తర్వాత పెద్ద విజయాలు సాధిస్తాయి. లావణ్య త్రిపాఠి కెరీర్‌లో కూడా అలాంటి సంఘటన ఒకటి జరిగినట్లు ఆమె వెల్లడించారు. ఒక ఇంటర్వ్యూలో ఆమెను “మీరు రిజెక్ట్ చేసి తర్వాత హిట్ అయిన సినిమా ఏదైనా ఉందా?” అని అడగగా, ఆమె ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు.
లావణ్య ఒక సినిమా ఆఫర్ వచ్చినప్పుడు తొలుత కథ వినకుండానే ‘నో’ చెప్పానని చెప్పారు. అయితే తర్వాత కథ విన్నప్పుడు ఆ ప్రాజెక్ట్ చేయాలని అనిపించిందని, కానీ అప్పటికే ఆ అవకాశం తన చేతుల నుండి జారిపోయిందని వెల్లడించారు. ఆ తర్వాత అదే సినిమాలో మరో హీరోయిన్ నటించి మంచి విజయాన్ని అందుకుందని తెలిపారు.
ఆ సినిమా మరేదో కాదు, విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న జంటగా వచ్చిన సూపర్ హిట్ చిత్రం ‘గీత గోవిందం’ అని ఆమె చెప్పారు. మొదట ఈ సినిమాకి లావణ్యనే సంప్రదించగా, కానీ కొన్ని కారణాల వల్ల చివరికి రష్మిక మందన్న ఆ పాత్రకు ఎంపికవ్వటం జరిగింది.
ఈ విషయం బయటకు రావడంతో సోషల్ మీడియాలో అభిమానులు విభిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు ఇది యాదృచ్ఛికంగా జరిగిన విషయం అంటుంటే, మరికొందరు ఆ సినిమా తర్వాత విజయ్ – రష్మిక జంటకు మంచి గుర్తింపు రావడం, వారు ప్రేమలో పడటం, రీసెంట్ గా మ్యారేజ్ చేసుకోవటం గురించి మాట్లాడుకుంటున్నారు.