టాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నేపథ్యగాయని వాణీ జయరాం (78) కన్నుమూశారు. చెన్నైలోని తన నివాసంలో శనివారం మధ్యాహ్నం వాణీ జయరాం తుదిశ్వాస విడిచారు. తమిళనాడులోని వెల్లూరులో 1945 నవంబర్ 30న జన్మించిన వాణీ జయరాం అసలు పేరు కలైవాణి. ఆరుగురు అక్కాచెల్లెళ్లలో వాణీజయరాం ఐదో సంతానం. వాణీజయరాం ఇప్పటివరకు తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, గుజరాతీ, మరాఠీ, ఒరియా, భోజ్‌పురీ ఇలా 19 భాషల్లో దాదాపు ఎనిమిది వేలకు పైగా పాటలు ఆలపించారు.
వాణీ జయరాం మృతి వార్తతో మొత్తం సంగీత ప్రపంచంలో విషాదం అలముకుంది. ఐదు దశాబ్దాలుగా సినీ సంగీత ప్రియుల్ని వాణీజయరాం ఓలలాడించారు. ఐదేళ్ల వయస్సులో కడలూరి శ్రీనివాస్ అయ్యంగార్ వద్ద సంగీతంలో వాణీజయరాం ఓనమాలు దిద్దారు. పదేళ్ల వయస్సులో తొలిసారి ఆల్ ఇండియా రేడియాలో పాటలు పాడారు. 1970లో వచ్చిన ‘గుడ్డీ’ అనే చిత్రంలో వాణీ జయరామ్‌కు తొలిపాట పాడే అవకాశం ఇచ్చారు గుల్జార్. వాణీజయరాం తొలి పాటకే తాన్ సేన్ తోపాటు మరో నాలుగు అవార్డులు అందుకున్నారు.
‘అభిమానవంతుడు’ అనే చిత్రంతో తొలిసారిగా తెలుగు ప్రేక్షకులకు పరిచమయ్యారు. ‘ఎప్పటి వలె కాదురా స్వామి… ’ అనే పాట శ్రోతల్ని, వీక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంది. బాలచందర్ దర్శకత్వం వహించిన ‘అపూర్వ రాగంగళ్’ అనే చిత్రానికి జాతీయ పురస్కారం అందుకున్నారు. ‘శంకరాభరణం’ చిత్రంలోని ‘మానస సంచరరే…’ అనే పాటకు రెండోసారి జాతీయ పురస్కారం అందుకున్నారు. ‘స్వాతికిరణం’ సినిమాలోని ‘ఆనతి నియ్యరా హరా…’ పాటకు మూడోసారి ఉత్తమ గాయనీగా జాతీయ పురస్కారం అందుకున్నారు.
వాణీజయరామ్‌కు ఇటీవల కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ ప్రకటించిన విషయం తెలిసిందే. వాణీ జయరాం తన కెరీర్లో మూడు సార్లు జాతీయ పురస్కారాలు సాధించారు. దీంతోపాటు ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాల నుండి స్టేట్ అవార్డ్స్ కూడా పొందారు. ఫిలింఫేర్ నుండి లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు కూడా గెలుపొందారు. వాటితోపాటు న్యూయార్క్‌లో 2017లో జరిగిన నాఫా వేడుకలో ఉత్తమ ఫీమేల్ సింగర్ పురస్కారం కూడా పొందారు.
రైటర్ పద్మభూషణ్ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!
మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!