2021 Best Performers: 2021లో నటనతో ఆకట్టుకున్న నటీనటులు!

ఒక సినిమాకి హీరోహీరోయిన్ల & విలన్ ఎంత ఇంపార్టెంటో, సహాయ నటులు కూడా అంతే ఇంపార్టెంట్. ఒక్కోసారి ఈ సహ నటులు మొత్తం మెయిన్ లీడ్ ను కూడా డామినేట్ చేసేస్తుంటారు. గతేడాది 2021లో సహ నటులుగా కనిపించి.. సినిమాను డామినేట్ చేసిన నటీనటుల లిస్ట్ చూద్దాం..!!

వరలక్ష్మి శరత్ కుమార్ (క్రాక్ & నాంది)

హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించి విలన్ & క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిన నటి వరలక్ష్మి శరత్ కుమార్, తెలుగులోనూ వరుస క్యారెక్టర్స్ తో దూసుకుపోతుంది. గతేడాది విడుదలైన “క్రాక్” మరియు “నాంది” సినిమాల్లో ఆమె నటన ఆ సినిమాలకు హైలైట్ గా మాత్రమే కాదు క్రౌడ్ పుల్లింగ్ కూడా చేసింది అంటే మామూలు విషయం కాదు.

హర్షిత్ (మెయిల్)

ఆహా యాప్ లో విడుదలైన “మెయిల్” అనే వెబ్ ఫిలింలో హర్షిత్ నటన చూసిన తర్వాత ఒక మంచి అనుభూతి కలుగుతుంది. అమాయకత్వం, హాస్యం, ఆశ్చర్యం వంటి అన్నీ రసాలను అద్భుతంగా పండించాడు. త్వరలోనే హీరోగా నిలదొక్కుకోగల సత్తా పుష్కలంగా ఉన్న నటుడు హర్షిత్.

రావు రమేష్ (శ్రీకారం)

రావు రమేష్ మంచి నటుడు అనే విషయాన్ని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అయితే.. శ్రీకారంలో ఆయన పోషించిన తండ్రి పాత్ర మాత్రం ఎప్పటికీ ప్రత్యేకం. కొడుకు మీద విపరీతమైన అభిమానమున్న రైతుగా ఆయన నటన అమోఘం. ముఖ్యంగా క్లైమాక్స్ లో వచ్చే కన్నీటి సన్నివేశం సినిమాకే హైలైట్.

రాగ్ మయూర్ (సినిమా బండి)

“సినిమా బండి” చిత్రం చూసిన ప్రతి ఒక్కరూ పగలబడి నవ్విన డైలాగ్ “నీ పేరేమి?”. ఆ డైలాగ్ ను ఎంతో అమాయకంగా చెప్పిన నటుడు రాజ్ మయూర్. మరిడేష్ బాబు గా మనోడి నటన సినిమాకి హైలైట్ గా నిలిచింది. మరింత మంది నటులున్నప్పటికీ.. అతడి డైలాగ్ డెలివరీ, కామెడీ టైమింగ్ రాజ్ మయూర్ ను ప్రత్యేకంగా నిలిపాయి..

అల్తాఫ్ హాస్సన్ (బట్టల రామస్వామి బయోపిక్కు)

జీ5 యాప్ లో విడుదలైన ఈ చిత్రం చూసిన వాళ్ళు కామెడీకి ఎంతగా నవ్వుకున్నారో.. టైటిల్ పాత్రధారి అల్తాఫ్ నటనను కూడా అదే స్థాయిలో ఎంజాయ్ చేశారు.

కార్తీక్ రత్నం (నారప్ప)

నారప్పలో వెంకటేష్ తర్వాత ఆ స్థాయిలో నటించిన వ్యక్తి కార్తీక్ రత్నం. పెద్ద కొడుకుగా కార్తీక్ రత్నం నటన ప్రసంశనీయం. క్రోధం, కోపం వంటి హావభావాలను కళ్ళతోనే పలికించాడు. కనిపించే కాసేపు కూడా తన స్క్రీన్ ప్రెజన్స్ తో ఆకట్టుకున్నాడు.

సునైన (రాజ రాజ చొర)

అప్పటివరకు సునైన అంటే గ్లామరస్ హీరోయిన్ గా మాత్రమే తెలుసు. కానీ.. మొదటిసారి తనను తాను నటిగా ప్రూవ్ చేసుకుంది. భార్యగా, తల్లిగా మంచి బాధ్యత ఉన్న పాత్రలో కనిపించింది. చక్కని హావభావాలతో అలరించింది సునైన. చక్కని పాత్రలు లభిస్తే తప్పకుండా పాత్రకు న్యాయం చేస్తాను అని ప్రూవ్ చేసింది.

జగపతిబాబు (రిపబ్లిక్)

లెజండ్ సినిమా తర్వాత జగపతిబాబు కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది. అయితే.. అప్పట్నుంచి ఆయన అన్నీ ఆ తరహా పాత్రలు చేస్తూ వస్తుండడంతో మొనాటినీ వచ్చేసింది. చాన్నాళ్ల తర్వాత “రిపబ్లిక్” చిత్రంలో ఒక గవర్నమెంట్ ఆఫీసర్ గా డిఫరెంట్ రోల్ ప్లే చేశారు. ఊరు మొత్తం చెప్పుల దండ వేసి ఆయన్ని కొట్టే సన్నివేశంలో ఆయన నటన ఒన్నాఫ్ ది హైలైట్ గా చెప్పుకోవచ్చు. ఈ తరహా వైవిధ్యమైన పాత్రలు ఆయన మరెన్నో చేయాలి.

సాయిచంద్ (కొండపోలం)

ఫిదా సినిమాలో తండ్రిగా, సైరా సినిమాలో సపోర్టింగ్ రోల్లో అలరించిన సాయిచంద్ కు మళ్ళీ చాన్నాళ్ల తర్వాత “కొండపొలం”లో గొర్రెల కాపరిగా మంచి పాత్రలో అలరించారు. ఆయన డైలాగ్ డెలివరీ & ఎమోషన్స్ సినిమాకి చాలా కీలకం.

అజయ్ ఘోష్ (మంచి రోజులొచ్చాయి & పుష్ప)

సైడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలెట్టిన అజయ్ ఘోష్ ఇప్పుడు మోస్ట్ బిజీ ఆర్టిస్ట్. “మంచి రోజులొచ్చాయి” చిత్రంలో ఆయన భయపడుతూ నవ్వించిన విధానం, పుష్పలో కొండారెడ్డిగా ఆయన ప్రదర్శించిన గాంభీర్యం అభినందనీయం. ఇలాగే కంటిన్యూ అయితే తెలుగులో ప్రామిసింగ్ విలన్ గా అజయ్ మారడం ఖాయం.

హర్షవర్ధన్ (పుష్పక విమానం)

నిజానికి పుష్పక విమానంలో హర్షవర్ధన్ పాత్ర చాలా చిన్నది. తిప్పి కొడితే సరిగ్గా 15 నిమిషాల నిడివి కూడా ఉండదు. కానీ.. క్లైమాక్స్ కి వచ్చేసరికి ఆ పాత్ర క్రియేట్ చేసిన ఇంపాక్ట్ మాములుగా ఉండదు. చాలా సబ్టల్ గా ఆయన ఆ పాత్రలో జీవించిన విధానం బాగుంటుంది.

శ్రీకాంత్ (అఖండ)

హీరో శ్రీకాంత్ ఆల్రెడీ “యుద్ధం శరణం గచ్చామి, విలన్ (మలయాళం)” లాంటి సినిమాల్లో విలన్ గా నటించాడు. అయితే.. అఖండలో ఆయన పోషించిన రూత్ లెస్ విలన్ రోల్ మాత్రం క్రేజీయస్ట్ విలన్ రోల్ అని చెప్పాలి. అసలు శ్రీకాంత్ ను ఇలా చూడగలమా అనుకొనే దగ్గరనుంచి.. శ్రీకాంత్ అదరగొట్టాడురా అని అందరూ అనేలా చేసాడు.

సత్యదేవ్ (తిమ్మరుసు & స్కై ల్యాబ్)

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలెట్టి.. హీరోగా మారిన సత్యదేవ్ ఎదుగుదల ఎందరికో ఆదర్శం. తిమ్మరుసు, స్కైలాబ్ లో అతడి నటన, పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసిన తీరు అద్భుతం. తిమ్మరుసు కంటే స్కైల్యాబ్ లో పోషించిన డాక్టర్ రోల్ సత్యదేవ్ కెరీర్ లో కలికితురాయి.

ఈశ్వరి రావు (లవ్ స్టోరీ)

“అరవింద సమేత వీర రాఘవ” చిత్రంలో ఈశ్వరి రావు నటన చూసి ఈమెను మన తెలుగు సినిమాల్లో ఎందుకని పూర్తిస్థాయిలో వినియోగించుకోవడం లేదు అనిపించింది. “లవ్ స్టోరీ”లో దళిత మహిళగా ఆమె నటన ఆకట్టుకుంటుంది.

జగదీష్ (పుష్ప: ది రైజ్)

అసలు ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ సినిమాలో ఇంత హైలైట్ అవుతుందని, అది కూడా తెలుగు ఇండస్ట్రీలో అని ఎవరూ ఊహించి ఉండరు. అందరూ ఆశ్చర్యపోయే రీతిలో సినిమా మొత్తానికి వాయిస్ ఓవర్ ఇవ్వడమే కాక.. అల్లు అర్జున్ ఫ్రెండ్ గా సినిమాలో కీలకపాత్ర పోషించాడు. అల్లు అర్జున్ థ్యాంక్యూ మీట్ లో చెప్పినట్లు జగదీశ్ పాత్ర సెకండ్ పార్ట్ లో ఇంకాస్త పెద్దగా ఉంటే.. అతడు మరో ప్రామిసింగ్ ఫ్రెండ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎదగడం ఖాయం.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus