రజనీకాంత్ హీరోగా ‘కూలీ’ అనే సినిమాను తెరకెక్కించారు లోకేశ్ కనగరాజ్. అందులో చాలా పెద్ద కాస్టింగ్‌ను ఎంచుకున్నారు కూడా. వాళ్లెవరు అనేది మీకు తెలిసిన విషయమే. ఆ టాపిక్ ఇప్పుడు చర్చకు వద్దు. అయితే అంత పెద్ద కాస్టింగ్ పెట్టుకున్నా ఓ ఇద్దరు మాత్రం హైలైట్ అయిపోయారు వారే సౌబిన్ సాహిర్, రచితా రామ్. ఎవరూ ఊహించని ట్విస్ట్‌లతో ఈ ఇద్దరూ అటు శ్రుతి హాసన్‌ను, ఇటు సినిమాను పరిగెత్తించారు. మొత్తంగా ‘కూలీ’ వారి కోసమే తీసినట్లుగా ఉంది అనిపించేశారు. అందులో రచితా రామ్ పాత్రనైతే ఎవరూ మరచిపోలేరు.
అంతలా ఆమె పాత్రను రాసుకొచ్చారు దర్శకుడు లోకేశ్ కనగరాజ్. ఇప్పుడు మరోసారి లోకేశ్, రచిత కలసి పని చేయబోతున్నారు. ఈ సారి డైరక్టర్ – విలన్‌గా కాదు. హీరో – హీరోయిన్‌గా. అవును మీరు చదివింది నిజమే. చాలా రోజులుగా చెబుతున్నట్లుగా లోకేశ్ కనగరాజ్ హీరోగా మారుతున్నారు. ఆ సినిమాలో హీరోయిన్‌గా రచితా రామ్‌ను తీసుకున్నారట. తమిళ డైరెక్టర్ అరుణ్ మాథేశ్వరన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ విషయాన్ని లోకేశ్ ఇటీవల ఇంటర్వ్యూల్లో కూడా చెప్పుకొచ్చారు.
అరుణ్ సినిమా కోసం లోకేశ్ మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నారట. అంతా ఓకే అనుకున్నాక సినిమా మొదలుపెడతారట. నిజానికి ‘ఖైదీ 2’ సినిమా పనులను లోకేశ్ ఈ పాటికి స్టార్ట్ చేసి ఉండాలి. అయితే కార్తి ఇతర సినిమాలు ఆలస్యమవుతుండటంతో ఈలోపు గతంలో మాటిచ్చినట్లుగా అరుణ్ సినిమా చేసేద్దాం అని అనుకున్నారట లోకేశ్ కనగరాజ్. అందులో భాగంగానే సినిమా చర్చలు జరుగుతున్నాయట. అలా రచితా రామ్ పేరు ప్రస్తావనకు వచ్చింది అని చెబుతున్నారు. మరి రచితా ఈ సినిమా చేస్తుందా? చేస్తే ఎలాంటి పాత్ర చేస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది.
ఇక రచిత సంగతి చూస్తే 12 ఏళ్ల క్రితం ‘బుల్ బుల్’ అనే సినిమాతో నటనలోకి వచ్చింది. తెలుగులో అయితే మూడేళ్ల క్రితం ‘సూపర్ మచ్చి’ అనే సినిమా చేసింది. అన్ని సినిమాలు ఇచ్చిన పేరుకు మించిన పేరు ‘కూలీ’ సినిమాలోని కల్యాణి పాత్ర ఇచ్చింది.