ఇటీవల ఓ సినిమా వేడుకలో హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ.. ‘ఒక పోస్టర్ పై హీరోయిన్ ఫోటో ఫుల్ గా ఉంది అంటే.. ఆ సినిమాకు దూరంగా ఉండాలని ఆడియన్స్ ఫిక్స్ అయిపోతారు.మన సౌత్ లో మహిళా ప్రాధాన్యత కలిగిన సినిమాలు చూడటానికి ప్రేక్షకులు ఇంట్రెస్ట్ చూపించరు’ అంటూ ఆమె పలికింది. ఆమె మాటలు నూటికి నూరు శాతం నిజం.
హీరోయిన్ సెంట్రిక్ సినిమాలకు సౌత్లో ఎక్కువ ఆదరణ ఉండదు. అయితే దీనికి భిన్నంగా విజయశాంతి లేడీ సూపర్ స్టార్, లేడీ అమితాబ్ బిరుదులు పొంది ఓ ట్రెండ్ సెట్ చేసింది. ‘కర్తవ్యం’ తర్వాత విజయశాంతి నటించిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్స్ అయ్యాయి బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి. తర్వాత కొన్నాళ్లకు అనుష్క ఈ ఫీట్ సాధించింది. ‘అరుంధతి’ ‘భాగమతి’ సినిమాలతో అనుష్క బాక్సాఫీస్ ఆఫీస్ వద్ద సత్తా చాటింది.
అలాగే నయనతార కూడా హీరోయిన్ సెంట్రిక్ సినిమాలు చేసి సూపర్ స్టార్ గా ఎదిగింది. కానీ అనుష్క రేంజ్లో హైయెస్ట్ గ్రాసర్స్ అందుకుంది అంటూ ఏమీ లేదు. తర్వాత సంగతి తెలిసిందే. ఏ హీరోయిన్ సెంట్రిక్ సినిమా కూడా విజయవంతం అయ్యింది అంటూ లేదు. తమన్నా వంటి స్టార్ హీరోయిన్ నటించిన ‘దటీజ్ మహాలక్ష్మీ’ వంటి సినిమాలు రిలీజ్ కు కూడా నోచుకోలేదు అంటే నమ్ముతారా? సో అనుపమ మాటల్లో తప్పేమీ లేదు. కానీ అసాధ్యం అంటూ ఏమీ కాదు అని ఇటీవల వచ్చిన ఒక సినిమా నిరూపించింది.
అదే ‘కొత్త లోక’. మలయాళంలో కళ్యాణి ప్రియదర్శన్ ప్రధాన పాత్ర పోషించిన సినిమా ఇది. అసలు ఆమె నుండి ఇలాంటి పాత్రలు ఊహించలేం. ఎందుకంటే ఆమెకు ఉన్న సాఫ్ట్ గర్ల్ ఇమేజ్ అలాంటిది. కానీ ఆమె కళ్ళను బట్టి ఆమె ‘కొత్త లోక’ వంటి సినిమాలకు సెట్ అవుతుంది అని దర్శకుడు డామినిక్ అరుణ్ నిర్ణయించుకున్నాడు. అతని డెసిషన్ నిజమని దేశమంతా ఒప్పుకుంటుంది. ‘కొత్త లోక’ వంద కోట్లు(గ్రాస్) కలెక్ట్ చేసిన మొట్ట మొదటి సౌత్ ఇండియన్ ఫిమేల్ సెంట్రిక్ మూవీగా చరిత్ర సృష్టించింది. ఇందులో కూడా దుల్కర్ సల్మాన్, టోవినో థామస్ వంటి హీరోలు గెస్ట్ రోల్స్ చేశారు. కానీ మెయిన్ రోల్ కళ్యాణి ప్రియదర్శిన్ కాబట్టి.. క్రెడిట్ ఆమెకే దక్కుతుంది.