వార్తల విషయంలో ఎవరికీ కోపం రాదు.. వస్తే ఇక వాళ్ల ఇష్టం. రూమర్ల విషయంలో మాత్రం కోపం వస్తుంది. రావాలి కూడా. అందులోనూ ఏదో కాస్త సమాచారం ఉండి వచ్చే రూమర్లు కాదు.. నచ్చింది నచ్చినట్లు రాసేసే రూమర్ల గురించి అయితే చాలా కోపం వస్తుంది. అలానే ఇప్పుడు ప్రముఖ దర్శకుడు లోకేశ్ కనగరాజ్‌కు (Lokesh Kanagaraj) కూడా కోపం వచ్చింది. ఇలాంటి వార్తలు సృష్టించడం సరికాదు అని అనేశారు కూడా. ఇంతకీ ఏమైందంటే..
ప్రముఖ నటుడు రజనీకాంత్ (Rajinikanth) ఇటీవల అనారోగ్య కారణాల వల్ల ఆస్పత్రిలో చేరారు. చికిత్స అనంతరం ఇంటికి కూడా చేరుకున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని యూట్యూబ్ ఛానల్స్‌లో తలైవా ఆరోగ్యం కోసం రూమర్లు అంటూ రకరకాల వార్తలు చెప్పుకుంటూ వచ్చారు. ఈ క్రమంలో లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కూలీ’ (Coolie) సినిమా షూటింగ్‌లో తలైవాకు ఇబ్బంది కలిగింది అని కూడా రాశారు. ఈ రూమర్ల విషయంలో తాజాగా లోకేష్ కనగరాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘కూలీ’ సినిమాకు సంబంధించి ఊహాగానాలను ప్రచారం చేసినందుకు కొన్ని యూట్యూబ్ ఛానెళ్ల మీద మండిపడ్డారు. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న రజనీకాంత్.. ‘కూలీ’ సినిమా చిత్రీకరణలో భాగంగానే ఇబ్బంది పడి ఆసుపత్రి పాలయ్యారని ఆ ఛానళ్లలో వార్తలు ప్రసారం అయ్యాయి. అందుకే లోకేశ్ రిప్లై ఇచ్చారు.రజనీకాంత్ చికిత్స చేయించుకోబోతున్నట్లు సినిమా టీమ్‌కు ముందుగానే చెప్పారని చెప్పిన లోకేశ్.. చికిత్స అనంతరం తాను రజనీకాంత్‌తో మాట్లాడానని, ఆయన బాగానే కోలుకుంటున్నారని చెప్పారు.
అందుకే ఇలాంటి వార్తలు చూస్తే కోపం వస్తోందన్నారు. అయినా షూటింగ్ కంటే మాకు రజనీ ఆరోగ్యమే ముఖ్యమని తేల్చి చెప్పారు. సినిమా సెట్లో తలైవాకు ఏదైనా ఇబ్బంది అనిపిస్తే వెంటనే షూటింగ్ ఆపేస్తాం. అందుకే ఇలా యూట్యూబ్‌లో ఇష్టం వచ్చినట్లు వార్తలు సృష్టించి జనాలను బాధ పెట్టకండి. ఇలాంటివి ఇకనైనా ఆపండి అని లోకేశ్ కోరారు. ఇక ఈ సినిమా సంగతి చూస్తే.. అక్టోబరు 15 నుండి మళ్లీ షూటింగ్‌లో పాల్గొనడానికి రజనీకాంత్ సిద్ధమవుతున్నారు.