LCU దారి తప్పిందా? లోకేష్ ప్లానింగ్ పై ఫ్యాన్స్ ఫ్రస్ట్రేషన్!

లోకేష్ కనగరాజ్ సృష్టించిన ‘లోకేష్ సినిమాటిక్ యూనివర్స్’ (LCU) ఇండియన్ స్క్రీన్ మీద ఒక సంచలనం. ‘విక్రమ్’ క్లైమాక్స్‌లో రోలెక్స్ ఎంట్రీ ఇచ్చినప్పుడు థియేటర్లలో వచ్చిన రెస్పాన్స్ మామూలుది కాదు. ఆ ఊపులో వెంటనే ‘ఖైదీ 2’, ‘రోలెక్స్’, ‘విక్రమ్ 2’ వంటి సినిమాలు వస్తాయని ఫ్యాన్స్ ఆశపడ్డారు. కానీ సీన్ కట్ చేస్తే.. లోకేష్ తీసుకుంటున్న వరుస నిర్ణయాలు ఇప్పుడు LCU భవిష్యత్తునే ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఆడియన్స్ అడిగేది ఒకటి, లోకేష్ ఇస్తున్నది మరొకటి కావడంతో ఆసక్తి మెల్లగా చచ్చిపోతోంది.

LCU

మొదటి దెబ్బ ‘లియో’తోనే తగిలింది. పక్కా LCU సినిమా వస్తుందనుకుంటే, విజయ్ స్టార్‌డమ్‌కి తగ్గట్టు కథను మలిచి, చివర్లో బలవంతంగా LCU లింకులు కలిపారనే విమర్శలు వచ్చాయి. అది ఆర్గానిక్‌గా అనిపించకపోవడంతో ఫ్యాన్స్ డిజప్పాయింట్ అయ్యారు. ఇప్పుడు రజినీకాంత్‌తో చేసిన ‘కూలీ’ కూడా స్టాండలోన్ సినిమానే. ఇది కూడా మెప్పించలేదు. పోనీ దీని తర్వాతైనా ‘ఖైదీ 2’ ఉంటుందా అంటే, ఇప్పుడు కొత్తగా అల్లు అర్జున్ పేరు తెరపైకి వచ్చింది. ఒకవేళ బన్నీ ప్రాజెక్ట్ ఓకే అయితే, LCU సినిమాలు మరో రెండేళ్లు వాయిదా పడినట్లే.

అసలు ఫ్యాన్స్ కోరుకుంటున్నది ఢిల్లీ (కార్తీ), రోలెక్స్ (సూర్య), విక్రమ్ (కమల్) మధ్య జరిగే యుద్ధం. కానీ లోకేష్ మాత్రం సంబంధం లేని ప్రాజెక్టుల వెంట పడుతున్నారనే ఆవేదన ఉంది. ముఖ్యంగా కమల్ హాసన్ వయసు రీత్యా, ‘విక్రమ్ 2’ ఎంత త్వరగా తీస్తే అంత ఇంపాక్ట్ ఉంటుంది. లేట్ అయ్యే కొద్దీ ఆ మ్యాజిక్ మిస్ అయ్యే ప్రమాదం ఉంది.

మరోవైపు ‘బెంజ్’ అనే సినిమాను LCUలో కలపడం కూడా ఆడియన్స్‌కి రుచించడం లేదు. రాఘవ లారెన్స్ హీరోగా, వేరే దర్శకుడు (బక్కియరాజ్ కన్నన్) తీస్తున్న ఈ సినిమాను కేవలం లోకేష్ ప్రొడక్షన్ అనే కారణంతో LCU అనడం ఫ్యాన్స్‌కి నచ్చట్లేదు. లోకేష్ మార్క్ టేకింగ్ లేని LCU సినిమా అంటే బిర్యానీ లేని దావత్‌లాంటిదే. అందుకే దీనిపై పెద్దగా బజ్ క్రియేట్ అవ్వడం లేదు. లోకేష్ కనగరాజ్ పాన్ ఇండియా స్టార్ల మోజులో పడి, తన సొంత బ్రాండ్ అయిన LCUని నెగ్లెక్ట్ చేస్తున్నారనే భావన బలపడుతోంది. ఇప్పటికైనా ఆయన ట్రాక్‌లోకి వచ్చి, ఫ్యాన్స్ కలలుగంటున్న ఆ ‘రోలెక్స్ vs విక్రమ్’ ఎపిసోడ్‌ని పట్టాలెక్కిస్తారో లేదో చూడాలి. లేదంటే LCU అనేది ఒక గొప్ప ఐడియాగానే మిగిలిపోయే ప్రమాదం ఉంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags