మా ఇంటి బంగారం (Maa Inti Bangaaram) మూవీతో దాదాపు మూడేళ్ల తర్వాత హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇచ్చింది సమంత (Samantha). క్రైమ్ కామెడీగా తెరకెక్కిన ఈ సినిమాను భర్త రాజ్ నిడిమోరుతో కలిసి సమంత స్వయంగా నిర్మించింది. దిగంత్, గుల్షన్ దేవయ్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు నందిని రెడ్డి దర్శకత్వం వహించారు. టీజర్, ట్రైలర్‌లతో తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించిన మా ఇంటి బంగారం ఎలా ఉంది? సమంత కమ్‌బ్యాక్ మూవీగా నిలిచిందా? ఓ బేబీ తర్వాత సమంతకు నందిని రెడ్డి మరో హిట్టు ఇచ్చిందా? అంటే…
కథ: అనిరుధ్ (దిగంత్) ఓ డాక్టర్. స్వర్ణను (సమంత) ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. ఈ ప్రేమ వివాహం కారణంగా అనిరుధ్ తన కుటుంబానికి దూరమవుతాడు. చెల్లెలి పెళ్లి కోసం రెండేళ్ల తర్వాత భార్య స్వర్ణతో కలిసి అనిరుధ్ సొంత ఊరు బల్లవరం వస్తాడు. అనిరుధ్ తండ్రి (ఆనంద్) పలుకుబడి కలిగిన రాజకీయనాయకుడు. ఆచారాలు, కట్టుబాట్లకు ప్రాధాన్యమిచ్చే పెద్ద కుటుంబం. వంట, ఇంటి పనులు తెలియకపోయినా తన స్నేహితురాలి సాయంతో అన్ని వచ్చినట్లుగా నాటకం ఆడుతూ అందరి మనసులను గెలిచే ప్రయత్నం చేస్తుంటుంది స్వర్ణ.
అదే టైమ్‌లో జైలులో ఉన్న కరుణ (గుల్షన్ దేవయ్య) అనే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ మనుషులు స్వర్ణను వెతుక్కుంటూ బల్లవరం వస్తారు. కరుణకు స్వర్ణతో ఉన్న సంబంధం ఏమిటి? తన గతం గురించి కుటుంబసభ్యులకు తెలియకూడదని స్వర్ణ ఎందుకు భయపడింది? కరుణ బారి నుంచి తన కుటుంబాన్ని ఏ విధంగా కాపాడుకుంది? అడవిలో గన్ను పట్టుకొని పోరాడిన ఝాన్సీ.. తనకంటూ ఓ పెద్ద కుటుంబం కావాలని ఆరాటపడిన స్వర్ణ ఒక్కరేనా ?అన్నదే మా ఇంటి బంగారం మిగిలి కథ.
నటీనటుల పనితీరు: సమంత (Samantha) ఆల్‌రౌండ్ షోగా మా ఇంటి బంగారం నిలిచింది. కామెడీ, సెంటిమెంట్, యాక్షన్… సినిమా కోసం తనలోని అన్ని యాంగిల్స్ బయటపెట్టింది. రిస్కీ ఫైట్ సీక్వెన్స్‌ల కోసం చాలా కష్టపడింది.చివరకు సొంతంగా డబ్బింగ్ కూడా చెప్పుకుంది. సినిమా కోసం ప్రాణం పెట్టేసింది. విలన్ పాత్ర ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటే హీరో లేదా హీరోయిన్ క్యారెక్టర్ అంత ఎలివేట్ అవుతుంది. మెయిన్ విలన్‌గా గుల్షన్ దేవయ్య పాత్రను సరిగ్గా రాసుకోలేదు. డైలాగ్‌లకే అతడి విలనిజాన్ని పరిమితం చేశారు. సమంత భర్తగా నటించిన దిగంత్‌కు యాక్టింగ్ టాలెంట్‌ను చూపించే అవకాశం రాలేదు. చాలా రోజుల తర్వాత శ్రీముఖికి మంచి క్యారెక్టర్ దక్కింది. సమంత (Samantha) స్నేహితురాలిగా మంజూష తన కామెడీ టైమింగ్‌తో మెప్పించింది. ఆనంద్, శ్రీనివాస్ గవిరెడ్డి, చైతన్య కృష్ణ, గౌతమి, శ్రీలక్ష్మి ఇలా చాలా మందే నటీనటులు సినిమాలు ఉన్నారు. ఎవరికి సరైన ఇంపార్టెన్స్ లేదు. వెన్నెలకిషోర్ గెస్ట్‌గా మెరిశారు.
సాంకేతిక వర్గం పనితీరు: దర్శకురాలిగా నందిని రెడ్డి (Nandhini Reddy) ఇప్పటివరకు సెన్సిబుల్ లవ్‌స్టోరీస్, ఫ్యామిలీ కథలతో సినిమాలు చేశారు. ఫస్ట్ టైమ్ క్రైమ్ కామెడీ కథతో ఆమె చేసిన సినిమా ఇది. ఈ జానర్‌కు కొత్త కావడంతో ఆమెలో తడబాటు కనిపించింది. అటు థ్రిల్లర్‌లా తెరకెక్కించాలా? ఇటు ఫ్యామిలీ సినిమాలా చేయాలనే అనే కన్ఫ్యూజన్‌తో ఈ సినిమాను మధ్యలోనే వదిలేసినట్లు అనిపించింది. రైటర్స్‌గా రాజ్ నిడిమోరు వసంత్, సీతా మీనన్ రాసిన కథ బాగుంది. కానీ స్క్రీన్‌ప్లేలోనే మ్యాజిక్ మిస్సయ్యింది. స్టార్ హీరో సినిమాల రేంజ్‌లో సంతోష్ నారాయణన్ బీజీఎమ్ అందించారు. పెళ్లి సాంగ్ పర్వాలేదనిపిస్తుంది. ఓం ప్రకాష్ సినిమాటోగ్రఫీ ఓకే. ప్రొడక్షన్ వాల్యూస్‌లో కొంత రాజీపడినట్లుగా కనిపించింది. సినిమా రన్‌టైమ్ రెండున్నర గంటలే కానీ లెంగ్త్ ఎక్కువైన ఫీలింగ్ కలుగుతుంది.
విశ్లేషణ: తన గతాన్ని దాస్తూ కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం హీరోలు పోరాడే కథలతో తెలుగులో చాలానే సినిమాలు వచ్చాయి. బాషా, ఇంద్ర…ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాలానే ఉంటుంది. లేడీ ఓరియెంటెడ్ జానర్‌లో అల్లరి నరేష్ జేమ్స్ బాండ్ లాంటి సినిమాల్లో ఈ పాయింట్‌ను టచ్ చేశారు. ఈ రొటీన్ టెంప్లేట్ జానర్‌లోనే మా ఇంటి బంగారం రూపొందింది. కథ పాతదే అయినా చెప్పిన విధానం కొత్తగా ఉందా అంటే అదీ లేదు. ఒకే పాయింట్ చుట్టూ చివరి వరకు సీరియల్ మాదిరిగా సినిమాను సాగదీశారు. ఝాన్సీ తనతోనే ఉండాలని కరుణ ఎందుకు బలంగా అనుకుంటున్నాడన్నది సరిగ్గా చూపించలేదు.
తన ఫ్యామిలీనే ప్రపంచం అని స్వర్ణ నిర్ణయించుకునేలా బలమైన సీన్స్ కొన్ని రాసుకుంటే బాగుండేది. గుల్షన్ దేవయ్య వేసే ఎత్తులను సమంత తిప్పికొట్టే సీన్లు లాజిక్‌లెస్‌గా అనిపిస్తాయి. ఇలా ఒకటేమిటి సినిమాలో చాలానే లోపాలు ఉన్నాయి. వాటన్నింటిని తన నటనతో కవర్ చేసే ప్రయత్నం చేసింది సమంత. భయపెట్టే గతానికి, ఆనందంతో కూడిన వర్తమానికి మధ్య నలిగిపోయే ఇల్లాలి పాత్రలో ఒదిగిపోయింది. గ్లామర్ క్వీన్ అనే ఇమేజ్ నుంచి బయటకు వచ్చి సమంత చేసిన సినిమా ఇది. క్లైమాక్స్‌తో పాటు సమంతపై వచ్చే యాక్షన్ సీన్లు బాగున్నాయి. కామెడీని పండించేందుకు కథలో చాలానే ఆస్కారం ఉంది.
కానీ దర్శకురాలు ఆ ఛాన్స్‌ను సరిగ్గా వాడుకోలేదు. దిగంత్, స్వర్ణ బాండింగ్‌ను ఇంకాస్త బాగా రాసుకుంటే బాగుంది. నక్సలిజం బ్యాక్‌డ్రాప్ సీన్లు హడావిడిగా ముగించిన ఫీలింగ్ కలిగిస్తాయి. లేడీ ఓరియెంటెడ్ జానర్ అనగానే సెంటిమెంట్ కథలే రాస్తుంటారు. అందుకు భిన్నంగా హీరోయిన్లతో మంచి యాక్షన్ సినిమాలు చేయచ్చని మా ఇంటి బంగారం (Maa Inti Bangaaram) నిరూపించింది.
ఫోకస్ పాయింట్: మా ఇంటి బంగారం సమంత కల్ట్ ఫ్యాన్స్‌ను మాత్రమే మెప్పించే మూవీ. సామ్ కమ్‌బ్యాక్ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు ట్రీట్‌లా ఉండాలని చేసిన ప్రయత్నమిది.
రేటింగ్: 2.5/5