మధ సినిమా రివ్యూ & రేటింగ్!

తెలంగాణ నుండి వచ్చిన మొట్టమొదటి మహిళా దర్శకురాలు శ్రీవిద్య బసవ. దర్శకత్వ బాధ్యతలు మాత్రమే కాక నిర్మాతగానూ వ్యవహరించిన చిత్రం “మధ”. సైకలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం పలు ఫిలిమ్ ఫెస్టివల్స్ లో అవార్డ్స్ అందుకోవడమే కాక ఇండస్ట్రీ వర్గాలను కూడా విశేషంగా ఆకట్టుకున్న ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం మన ప్రేక్షకులను ఏమాత్రం అలరించిందో చూద్దాం..!!

కథ: ఓ యాడ్ ఏజెన్సీలో ప్రూఫ్ రీడర్ గా పనిచేసే ఆధునిక యువతి నిషా (త్రిష్ణ ముఖర్జీ). అదే యాడ్ ఏజెన్సీలో ఫోటోగ్రాఫర్ గా వర్క్ చేసే అర్జున్ (వెంకట్ రాహుల్)తో ప్రేమలో పడుతుంది. అంతా బాగానే సాగుతుంది అనుకునే సమయంలో.. నిషా కాస్త విచిత్రంగా బిహేవ్ చేయడం మొదలెడుతుంది. ప్రతి విషయానికి ఎక్కువగా రియాక్ట్ అవ్వడం, పబ్లిక్ ప్లేసెస్ లో ఇబ్బందికరంగా బిహేవ్ చేయడం మొదలెడుతుంది నిషా. ఆమె వింత ప్రవర్తన కారణంగా బలవంతంగా మెంటల్ హాస్పిటల్లో చేర్పించబడుతుంది.

బయటకంటే.. హాస్పిటల్లో ఇంకాస్త విపత్కర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది నిషా. అదే హాస్పిటల్ వాచ్ మెన్ గోపాల్ (అనీష్ కురువిల్లా) సహాయంతో ఆమె ఎలా బయటపడింది? అసలు హాస్పిటల్లో నిషా ఎదుర్కొన్న ఇబ్బందులేమిటి? అందుకు కారణం ఎవరు? అనేది తెలియాలంటే “మధ” సినిమా చూడాల్సిందే.

నటీనటుల పనితీరు: రెగ్యులర్ సినిమాల్లో హీరోయిన్స్ కి అందంగా కనిపించడం, హీరోల పక్కన నిల్చోవడం తప్ప పెద్దగా పని ఉండదు. కానీ.. “మధ” చిత్రంలో తృష్ణ ముఖర్జీ పోషించిన పాత్ర చాలా హావభావాలు పలికించాలి. ప్రేక్షకుల్ని ఒక విధమైన ఉద్విగ్నతకు లోనయ్యేలా చేసే పూర్తి బాధ్యత ఆమెది. ఆ బాధ్యతను ఆమె చక్కగా నిర్వర్తించింది. మొదట్లో కాస్త తడబడినట్లుగా అనిపించినా.. సినిమాలో వేగం పుంజుకొనే కొద్దీ ఆమె నట ప్రతిభ కూడా ప్రేక్షకుల్ని మరింతగా కట్టిపడేస్తూ పోయింది.

వెంకట్ రాహుల్ కి పెద్దగా స్క్రీన్ ప్రెజన్స్ దొరకలేదు కానీ.. ఉన్నంతలో తన నటనతో సినిమా మీద క్యూరియాసిటీ పెంచాడు. వాచ్ మెన్ పాత్రకు అనీష్ కురువిళ్ళ బాడీ లాంగ్వేజ్ పరంగా సూట్ అవ్వకపోయినా.. పర్వాలేదు అనిపించాడు. అప్పాజీ అంబరీష్, బిక్రమ్ జీత్ అలరించారు.

సాంకేతికవర్గం పనితీరు: దర్శకురాలు శ్రీవిద్య బసవ తర్వాత ఈ సినిమాకి ప్రాణం పెట్టి పనిచేసిన వ్యక్తి సంగీత దర్శకుడు నరేష్ కుమారన్. సౌండ్ డిజైనింగ్ విషయంలో నరేష్ తీసుకున్న ప్రత్యేక శ్రద్ధను అభినందించాల్సిందే. అయితే.. ఆ సౌండ్ టెక్నాలజీని ఆస్వాదించాలంటే మాత్రం మంచి మల్టీప్లెక్స్ లో సినిమా చూడాలి.

అభిరాజ్ నాయర్ కి బడ్జెట్ కేటాయింపుల విషయంలో ఫ్రీడమ్ ఇచ్చి ఉంటే బాగుండేది. ఆర్ట్ వర్క్ & ప్రొడక్షన్ డిజైన్ బాగున్నప్పటికీ.. కెమెరా యాంగిల్స్ & ఫ్రేమ్స్ విషయంలో ఇంకాస్త నవ్యత చూపిస్తే బాగుండేది అనిపిస్తుంది.

దర్శకురాలు శ్రీవిద్య బసవ రాసుకున్న కథలో మల్టీపుల్ లేయర్స్ ఉండేలా తీసుకున్న జాగ్రత్త, ప్యాషన్ తో తాను రాసుకున్న కథను వెండితెరపై ప్రెజంట్ చేసిన విధానాన్ని మెచ్చుకోవలసిందే. ఒకే పాత్ర చుట్టూ సినిమా మొత్తం తీయడం అంటే సాహసమే. ఆ సాహసాన్ని చాకచక్యంతో పూర్తిచేయడంలో శ్రీవిద్య కాస్త తడబడింది. థ్రిల్లర్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం.. ప్రేక్షకుడ్ని థియేటర్లో కూర్చోబెట్టడమే కాదు.. నెక్స్ట్ ఏం జరుగుతుంది అని ప్రేక్షకుడు తన మెదడుకి పని చెప్పాలి, సినిమాలో లీనమవ్వాలి, పాత్రల్లో మమేకమవ్వాలి, తాను ఉహించినదే జరిగితే సంతృప్తి పడాలి, లేదంటే ఆశ్చర్యపోయేలా మరో ట్విస్ట్ ఉండాలి. ఇలాంటివన్నీ శ్రీవిద్య బాగా ప్లాన్ చేసుకుంది. అయితే.. ఆచరణలో చిన్న చిన్న పొరపాట్లు జరిగాయి. ఒక డెబ్యూ డైరెక్టర్ గా శ్రీవిద్య బసవ తన ప్రతిభను ఘనంగా చాటుకుంది అనడంలో సందేహం లేదు.

అయితే.. ఒక సినిమాకి టెక్నీకల్ బ్రిలియన్స్ తోపాటు.. ఆడియన్స్ ను ఎంగేజ్ చేయాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. తానే దర్శకురాలు, నిర్మాత కావడంతో దర్శకురాలిగా శ్రీవిద్య తన మార్క్ ను అన్ని సన్నివేశాల్లో చూపించలేకపోయింది. కొన్ని సన్నివేశాలు చూస్తే “భలే తీసిందయ్యా” అనిపిస్తుంది, ఇంకొన్ని చూస్తున్నప్పుడు “ఇంకాస్త బాగా ఎలివేట్ చేయవచ్చు” అనిపిస్తుంది. ఒక కామన్ ఆడియన్ పాయింటాఫ్ వ్యూలో చూసినప్పుడు కూడా అర్ధమయ్యేలా చేయగలగడమే ఒక దర్శకురాలు సాధించిన అసలైన విజయం. శ్రీవిద్య తాను అనుకున్న విషయాన్ని స్పష్టంగా చెప్పింది కానీ.. అది అన్నీ వర్గాల ప్రేక్షకులకి అర్ధమవుతుందా లేదా అనే విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఆ చిన్నపాటి పొరపాట్లను పక్కన పెడితే.. ఒక లేడీ డైరెక్టర్ ఈస్థాయి టెక్నీకల్లీ సౌండ్ ఫిలిం తీయడం, మూడేళ్లపాటు కష్టపడి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం అనేది మాత్రం ప్రశంసనీయం. అందుకోసం శ్రీవిద్య బసవను మెచ్చుకోవలసిందే.

విశ్లేషణ: రొటీన్ సినిమాలకు దూరంగా ఉంటూ.. వైవిధ్యమైన కథ-కథనాలను ఎంజాయ్ చేసే ఆడియన్స్ తప్పకుండా ఒకసారి చూడదగిన చిత్రం “మధ”. ఇలాంటి ప్రయత్నాలను ఎంకరేజ్ చేసినప్పుడే.. దర్శకులు కొత్త తరహా సినిమాలు తీయడానికి ఆసక్తి చూపిస్తారు. సో, డియర్ తెలుగు సినిమా లవర్స్.. “మధ” చిత్రాన్ని థియేటర్లలో మాత్రమే చూసి, దర్శకురాలిని ఎంకరేజ్ చేయడమే కాక ఇటువంటి కొత్త తరహా సినిమాలను తెరకెక్కించాలని ప్రయాసపడే నవతరం దర్శకులకు, నిర్మాతలకు చిన్న ఆశ చూపించాల్సిన బాధ్యత తెలుగు ప్రేక్షకులదే.

రేటింగ్: 2.25/5

Click Here To Read In ENGLISH

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus