నిన్న సాయంత్రం గుంటూరులో జరిగిన “గుంటూరు కారం” ప్రీరిలీజ్ ఈవెంట్లో మహేష్ బాబు మాట్లాడుతూ.. “ఇక నుంచి మీరే నా అమ్మ, నాన్న” అనడం మహేష్ బాబు అభిమానుల్లో ఓ చిన్నపాటి అలజడి సృష్టించింది. మహేష్ లో ఈ యాంగిల్ ఇప్పటివరకూ కనిపించలేదు. అభిమానుల్లో తల్లిదండ్రులను చూసుకుంటాను అనడంతో ఈవెంట్లో పాల్గొన్న అభిమానులు మాత్రమే కాదు.. సోషల్ మీడియా ఫ్యాన్స్ కూడా కన్నీటిపర్యంతమయ్యారు. మొన్నామధ్య నిర్మాత వంశీ అనవసరంగా ఫ్యాన్స్ పై విరుచుకుపడిన సందర్భాన్ని అందరూ మర్చిపోయేలా చేశాడు మహేష్.
ఒకే ఏడాదిలో తండ్రి కృష్ణ, తల్లి ఇందిరా దేవి, అన్నయ్య రమేష్ బాబులను కోల్పోయిన మహేష్ బాబు ఎమోషనల్ గా చాలా హర్ట్ అయ్యాడు. అయితే.. తన పర్సనల్ లాస్ వల్ల ప్రొడ్యూసర్స్ ఎఫెక్ట్ అవ్వకూడదని పెద్దగా బ్రేక్ తీసుకోకుండానే “గుంటూరు కారం” షూటింగ్ లో పాల్గొన్నాడు. అయితే.. ఇన్నాళ్లపాటు తనలో దాచుకున్న బాధను.. నిన్న ఈవెంట్లో ఒక్కసారిగా వెళ్ళగక్కాడు మహేష్. మహేష్ మాటలో నిజాయితీ కనిపించడమే కాదు, చివర్లో అభిమానులకు చేతులెత్తి దండం పెట్టడంలో ఆ మాటలు మనసు లోతుల్లోంచి వచ్చినవి అని చెప్పకనే చెప్పాడు మహేష్. ఈ విధంగా అభిమానులకు మహేష్ మరింత దగ్గరయ్యాడు.
ఇకపోతే.. “గుంటూరు కారం” మహేష్ ఫ్యాన్స్ కు చాలా స్పెషల్ సినిమా. ఎందుకంటే.. రాజమౌళి సినిమా విడుదలవ్వడానికి కనీసం రెండేళ్లు పడుతుంది. అప్పటివరకూ వాళ్ళకి గుంటూరు కారమే అన్నీ. “బాహుబలి”కి ముందు ప్రభాస్ కి “మిర్చి” లాగా.. ఇప్పుడు మహేష్ కి “గుంటూరు కారం” అవ్వనుంది.