వరుస హిట్‌లు కొడుతున్నావ్ మమితా.. ఇదే జోరు కొనసాగించు అని అన్నారు నిన్న మొన్నటివరకు ఆమె అభిమానులు. అయితే ఒక్క రోజులో ఆ విష్ కాస్తా.. కాస్త ‘ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవమ్మా’గా మారిపోయింది. ఎందుకంటే అస్వస్థతకు గురైన మమితా బైజు ఇప్పుడు ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉంది. వైద్యుల సూచన మేరకు బెడ్ రెస్ట్ తీసుకుంటోంది. ఈ కారణంగా ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో జరగాల్సిన క్లైడ్ ఓనమ్ 2026 వేడుకలకు వెళ్లకుండా ఆగిపోయింది. మమిత హాజరు కాలేకపోవడంతో నిర్వాహకులు సైతం మెల్‌బోర్న్ ఓనమ్ సంబరాలను వాయిదా వేశారు.
ఇంతకీ ఏమైందంటే.. గత రెండు నెలలుగా మమితా బైజు చాలా బిజీగా ఉంది. విజయ్ జోసెఫ్ ‘జన నాయగన్’, సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’, నివిన్ పౌలీ ‘బెత్లెహాం కుటుంబ యూనిట్’ సినిమాల ప్రచారంలో వరుసగా షటిల్ సర్వీసులా తిరుగుతూనే ఉంది. తీవ్రమైన పని ఒత్తిడి, ప్రయాణాల అలసట వల్లే ఆమె నీరసించి ఉంటుందని సమాచారం. దీంతో అనారోగ్యానికి గురికావడంతో ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం తాను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నానని, ప్రస్తుత పరిస్థితుల్లో ప్రయాణాలు చేయలేకపోతున్నానని చెబుతూ మమిత ఓ వీడియో విడుదల చేసింది.
ఇక నెల రోజుల వ్యవధిలో మూడు హిట్‌లు.. అందులోనూ అన్నీ బ్లాక్‌బస్టర్ విజయాలు.. ఒక్కోటి రూ.200 కోట్లకుపైగా వసూళ్లు అందుకున్నాయి మమితా బైజు సినిమాలు. విజయ్ హీరోగా మమితా బైజు నటంచిన ‘జననాయగన్’ జులై 23న వచ్చి భారీ విజయాన్ని అందుకుంది. బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకు పైగా వసూలు చేసింది. సూర్య కథానాయకుడిగా నటించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 14న విడుదలైన ఈ సినిమా రూ.240 కోట్ల వసూళ్లు అందుకుంది.
ఇక మలయాళంలో నివిన్ పౌలీతో కలసి నటించిన ‘బెత్లెహోమ్ కుటుంబ యూనిట్’ ఆగస్టు 21న విడుదలై రూ.200 కోట్ల మార్క్ దాటింది. దీంతో ఆమె మూడు డబుల్ హండ్రెడ్స్ ఉన్న తొలి కుర్ర స్టార్ హీరోయిన్ అయింది. అన్నట్లు ఈ మూడు డబుల్ సెంచరీలు కాకుండా.. మరో రెండు సెంచరీలు కూడా ఉన్నాయి. అవే ‘ప్రేమలు’, ‘డ్యూడ్’. ఇందులో ‘ప్రేమలు’ సినిమాకు రూ.130 కోట్ల వసూళ్లు రాగా.. ‘డ్యూడ్’ సినిమాకు రూ. 110 కోట్ల వసూళ్లూ వచ్చాయి.