గత కొన్ని రోజులుగా తమన్ ఎక్కడ కనిపించినా.. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ అడిగే ప్రశ్న ‘ఓజీ 2’ సంగతేంటి అని. దానికి తమన్ కూడా ఎంతో ఓపికగా.. ‘సెప్టెంబర్ 2 వరకు ఆగండి’ అనే చెబుతూ వచ్చారు. దీంతో ఆ రోజు ‘ఓజీ 2’ నుండి రాబోయే సర్‌ప్రైజ్ కోసం ఫ్యాన్స్ బాగా వెయిట్ చేశారు. సాయంత్రం వరకు ఎలాంటి అప్‌డేట్ లేకపోవడంతో.. ఈ రోజు ఉంటుందా? లేదా? అనే డౌట్ మొదలైంది. కానీ టీమ్ ఆ నిరీక్షణలకు తగ్గట్టుగా సరైన కంటెంట్‌ను సాయంత్రం నాలుగు గంటల తర్వాత రిలీజ్ చేసింది.
ఈ సినిమా గురించి గతంలో పవన్ కల్యాణ్, దర్శకుడు సుజీత్, సంగీత దర్శకుడు తమన్ కూర్చొని కథా చర్చల స్టైల్‌లో మాట్లాడుతున్నప్పుడు రికార్డ్ చేసిన వీడియోను ఇప్పుడు సినిమా ట్రైలర్ స్టైల్‌లో ఎడిట్ చేసి రిచ్‌గా సిద్ధం చేసి రిలీజ్ చేశారు. అందులో జపాన్ సమురాయ్ యోధుడిగా పవన్ కనిపించడం, ఫ్రీడమ్ ఫైటర్ సుభాష్ చంద్ర బోస్ రిఫరెన్సులు పెట్టడం లాంటివి ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ సినిమా కోసం పని చేసే అందరికీ ఈ సినిమా ఓ లైఫ్ టైం మెమరీ కావాలి అని పవన్ చెప్పడం గూస్ బంప్స్ మూమెంట్ అనొచ్చు. ‘ఓజీ’ బ్లడ్ గ్రూప్ అనే డైలాగ్ కూడా ఈ వీడియోలో ఇంట్రెస్టింగ్‌గా ఉంది.
ఇదంతా చూపించారు కదా.. ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్తుంది అని అనుకోవద్దు. ఎందుకంటే సుజిత్ ప్రస్తుతం నాని ‘బ్లడీ రోమియో’ సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. త్వరలో ఈ సినిమాను ప్రారంభించి.. వీలైనంత త్వరగా పూర్తి చేయాలి అనుకుంటున్నాడట. ఆ తర్వాతనే ‘ఓజీ 2’ మొదలయ్యేది. అలా 2027 సెకండాఫ్‌లో ‘ఓజీ 2’ సెట్స్ పైకి వెళ్లొచ్చు. అంటే సినిమా విడుదల 2028లో ఉంటుందని చెప్పొచ్చు. ఈ సారి డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మించడం లేదు. పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌తోపాటు మరో పవన్ సన్నిహిత ప్రొడక్షన్ హౌస్ కలసి ఈ సినిమ చేస్తాయట. 2029 ఎన్నికలు వచ్చేలోగా పవన్ కల్యాణ్ నుండి కనీసం రెండు సినిమాలు వచ్చేలా టీమ్ ప్లాన్ చేస్తోందట.