సినిమాలు – రాజకీయాలు వేర్వేరు కావు అని అంటుంటారు. సినిమా వాల్లు రాజకీయాల్లోకి రావడం కొత్తేమీ కాదు. కానీ తమిళనాటు ఈ బంధం మరీ టూమచ్‌గా ఉంటుంది. రాజకీయాల్లోకి సినిమాలను ముఖ్యంగా సినిమా కథానాయికలను లాగుతూ ఉంటారు. నేరుగా విమర్శిస్తే అయిపోయేదానికి ఎవరో ఒక హీరోయిన్ పేరును లాగుతుంటారు. మొన్నీమధ్య వరకు టీవీకే విజయ్ విషయంలో నటి త్రిషను లాగారు. ఇప్పుడిప్పుడు ఆ చర్చ కామ్ అవుతున్న ఈ సమయంలో మరో కథానాయిక పేరును తీసుకొచ్చారు. ఆమెనే నయనతార.
అన్నాడీఎంకే ఎంపీ సీవీ షణ్ముగం ఇటీవల డీఎంకే ప్రభుత్వంపై వ్యాఖ్యలు చేస్తూ నయనతార పేరును లాగారు. శాంతిభద్రతల విషయంలో డీఎంకే ప్రభుత్వం తీరును ఖండిస్తూ ఎన్డీయే తరఫున రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల ఆందోళనలు చేశారు. అందులో భాగంగా విళుప్పురం కొత్త బస్టాండు వద్ద జరిగిన ఆందోళనకు అన్నాడీఎంకే మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు సీవీ షణ్ముగం నేతృత్వం వహించారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. డీఎంకే ప్రభుత్వం విద్యార్థుల కోసం తీసుకొచ్చిన ‘టెల్ యువర్ డ్రీమ్’ పథకం గురించి మాట్లాడారు.
‘టెల్ యువర్ డ్రీమ్’ అని ఎవరైనా నా దగ్గర అంటే నాకు నటి నయనతార కావాలని అడుగుతాను అని అన్నారు. ఆ కలను ముఖ్యమంత్రి నెరవేరుస్తారా? అని ప్రశ్నించారు. దీంతో ఆయన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. వాటిపై తర్వాత ఆయన వివరణ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ‘టెల్ యువర్ డ్రీమ్’ పథకాన్ని విమర్శించే ఉద్దేశంలో నయనతార పేరును పొరపాటున ప్రస్తావించానని, అందుకు ఆమెకు తాను క్షమాపణలు చెబుతున్నానని అన్నారు. అన్నట్లు ఇటీవల టీవీకే నేత చేసిన కొన్ని కామెంట్లలో రజనీకాంత్ పేరు కూడా వినిపించడం గమనార్హం. దానికి ఆయన రియాక్ట్ కూడా అయ్యారు.
అయితే, ఈ విషయంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు స్పందించారు. సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. రాజకీయ ప్రచారంలోకి సంబంధం లేని నటీమణుల ప్రస్తావన తీసుకురావడం సబబు కాదు. పాలిటిక్స్ విషయంలో తమిళనాడు సహా అన్నిచోట్లా ఇలాంటి వాతావరణమే కనిపిస్తోంది. పొలిటికల్ పంచ్‌ల కోసం నటీనటుల పేర్లను వాడుకోవడం సరికాదు. తెర వెనుక వారికంటూ వ్యక్తిగత జీవితం ఉంటుంది. వార్తల్లో హెడ్‌లైన్ల కోసం నటులను కించపరిచే విధంగా కామెంట్స్ చేయకూడదు అని అన్నారు.