ఈ శుక్రవారం ‘గాయత్రి’ చిత్రంలో ఓ ముఖ్యపాత్రతో, త్వరలోనే ‘ఆచారి అమెరికా యాత్ర’ చిత్రంలో కథానాయకుడిగా ప్రేక్షకులను పలకరించనున్న మంచు విష్ణు ఆల్రెడీ “ఓటర్” అనే తెలుగు-తమిళ బైలింగువల్ లో కూడా నటిస్తూ బిజీగా ఉన్నాడు. అయితే.. ఇప్పటివరకూ చిన్నస్థాయి కథలతో, మీడియం బడ్జెట్ మూవీస్ చేస్తూ వస్తున్న మంచు విష్ణు తన తదుపరి చిత్రం కోసం భారీస్థాయిలో ప్లాన్ చేస్తున్నాడు. అటు యువ కథానాయకుడిగా పేరు తెచ్చుకోలేక, ఇటు కథానాయకుడిగా ఉనికిని చాటుకోలేక ఇబ్బందిపడుతున్న మంచు విష్ణు తన తదుపరి సినిమా కోసం దాదాపు రెండు కోట్ల రూపాయలు పెట్టి మరీ కథ కొన్నాడట.
“బాహుబలి” రచయిత విజయేంద్రప్రసాద్ చేత మంచు విష్ణు ప్రత్యేకంగా ఒక కథ రెడీ చేయించుకొన్నాడట. కథ నేపధ్యం ఏమిటనేది ఇంకా తెలియనప్పటికీ.. కథ కోసం మంచు విష్ణు అక్షరాలా రెండు కోట్ల రూపాయలు చెల్లించాడట. భారతీయ యువకుడు, పాకిస్థానీ అమ్మాయితో ప్రేమలో పడడం అనే కాన్సెప్ట్ తో బోర్డర్ నేపధ్యంగా సినిమా ఉండబోతోందని. దాదాపు 30 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారని తెలుస్తోంది. తెలుగుతోపాటు తమిళంలో చిత్రాన్ని ఏకకాలంలో విడుదల చేసేలా ప్లానింగ్ కూడా నడుస్తోందట. ఈ ప్రొజెక్ట్ అనుకొన్న సమయానికి సెట్స్ మీదకు వెళ్ళి, తెలుగు-తమిళ భాషల్లో రిలీజైతే గనుక హీరోగా మంచు విష్ణు స్టార్ ఇమేజ్ రెండు రెట్లవ్వడంతోపాటు.. అతడి మార్కెట్ కూడా విస్తరించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మరి ఈ క్రేజీ ప్రొజెక్ట్ ఎప్పుడు మొదలవుతుందో చూడాలి.