‘అ!’సినిమా సక్సస్ అవ్వాలని కోరుకున్న మంజుల

మనతో పోటీకి వచ్చే వారిని శత్రువులుగా చూసే వారు ఒక రకం. మిత్రులుగా చూసే వారు రెండో రకం. రెండో రకానికి చెందిన వ్యక్తి మంజుల. సూపర్ స్టార్ కృష్ణ కుమార్తె తొలి సారి మెగాఫోన్ పట్టి “మనసుకు నచ్చింది” సినిమా చేసింది. సందీప్ కిషన్, అమైరా దస్తూర్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ రేపు విడుదల కానుంది. ఆ మూవీ ప్రచారంలో బిజీగా ఉన్న ఆమె నాని నిర్మాతగా మారి తొలిసారి నిర్మించిన “అ!” మూవీకి బెస్ట్ విషెష్ చెప్పింది. యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నిత్యా మీనన్‌, కాజల్‌ అగర్వాల్, శ్రీనివాస్‌ అవసరాల, రెజీనా, ప్రియదర్శి, ఈషా రెబ్బ, మురళీశర్మ, తదితరులు కీలక పాత్రలు పోషించారు.

ఆది నుంచి ఆసక్తి రేకెత్తిస్తున్న ఈ మూవీ రేపు థియేటర్లోకి రానుంది. తనకు పోటీగా వస్తున్న నానిపై మంజుల కోపంతో రగిలిపోకుండా అభినందనలతో పూలు చల్లింది. “ఇప్పటికే “అ!” ట్రైలర్ చూశాను. అమేజింగ్. చాలా వినూత్నంగా, కొత్త కాన్సెప్ట్ తో ఉంది. నిర్మాతగా మంచి కథని ఎంచుకున్నావు. ప్రస్తుతం టాలీవుడ్ ప్రేక్షకులు కొత్త దనానికి స్వాగతం పలుకుతున్నారు. ఈ తరుణంలో వస్తున్న మన సినిమాలు విజయవంతం అవ్వాలి.” అని కొన్ని క్షణాల క్రితం ట్వీట్ చేసింది. ప్రత్యర్థికి విషెష్ చెప్పి బరిలోకి దిగుతున్న మంజుల సినిమా కూడా హిట్ అవ్వాలని నాని అభిమానులు కోరుకుంటున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus