హీరో అంటే సినిమాల్లోనే కాదు, బయట కూడా హీరోలానే కనిపించాలి. బయటకు ఎక్కడికైనా వెళ్లినప్పుడు, జనాల మధ్యలో ఉన్నప్పుడు.. స్టార్ హీరోలా ఉండక్కర్లేదు అని నిరూపించాడు. దానికి కారణం ఆయన హీరోగా మారడానికి ముందు ఓ సామాన్యుడు.. హీరోగా మారాక కూడా మేకప్ తీసేస్తే సామాన్యుడే. స్టార్ స్టేటస్ అందుకుని, ఎందరికో ఆరాధ్య దైవంగా మారిన తర్వాత కూడా ఆయన అలానే ఉన్నాడు. ఆ సామాన్య అసామాన్యుడే సూపర్ స్టార్ బిరుదాంకితుడు ప్రముఖ కథానాయకుడు రజనీకాంత్.
అభిమానులు ముద్దుగా తలైవా అని పిలుచుకునే రజనీకాంత్ ఈ రోజు 75వ పడిలో అడుగుపెట్టాడు. ఇన్నేళ్ల జీవితంలో ఆయన చేసిన పనులు, చెప్పిన మాటలు, ఆచరించిన విషయాలు చూస్తే.. ఆయన సినిమాల్లో కంటే జీవితంలోనే పెద్ద సూపర్ స్టార్ అని అనిపించకమానదు. ఇలా ఎందుకన్నాం అనేది ఈ కథనం లోతుల్లోకి వెళ్లిన కొద్దీ మీకే అర్థమవుతుంది. ఇక ఈ కథనం ముగిసేసరికి మీరు అదే మాట అంటారు. అప్పటికీ అనలేదు అంటే.. ఆయన మీద మీ ద్వేషం ప్రేమను మించిపోయింది అని అర్థం.
రజనీకాంత్ ఆఫ్ స్క్రీన్ గురించి చాలామందికి తెలుసు. సోషల్ మీడియాలో ఆయన ఆఫ్ స్క్రీన్ ఫొటోలు, వీడియోలు, సంగతులు చూసే ఉంటారు. వాటన్నింటినీ ఒక చోటకు చేర్చి.. వాటికి ఆయన లైఫ్ లెసెన్స్ కొన్ని యాడ్ చేస్తే.. వాటిని మనం ఆచరిస్తే అదిరిపోతుంది అని చెప్పొచ్చు. ఒక్క సినిమా హిట్ అయితేనే రెండో రోజుకు యాడ్స్ చేసేస్తున్న హీరోలున్న సినిమా పరిశ్రమల్లో ఇప్పటివరకు ఒక్కటీ ప్రైవేటు కమర్షియల్ యాడ్ చేయలేదు రజనీకాంత్.
మేలు చేసిన వాడిని మరచిపోవడం ఫ్యాషన్ అయిపోయిన ఈ సమాజంలో.. తన ప్రతిభను గుర్తించి, యాక్టింగ్‌వైపు వెళ్లు అని ప్రోత్సహించిన ఫ్రెండ్ రాజ్ బహదూర్‌ని ఇప్పటికీ రజనీ గుర్తుపెట్టుకున్నారు. గుర్తు పెట్టుకోవడమే కాదు.. తరచూ ఆయన ఇంటికి వెళ్లి కలసి కాసేపు సరదాగా మాట్లాడి వస్తుంటారు. తలైవాకు ఆధ్యాత్మిక చింతన ఎక్కువ. హిమాలయాలకు తరచూ వెళ్తుంటారు. ఈ క్రమంలో రోడ్డు పక్కన బండి ఆపి ఆహారం తీసుకోవడం చాలా సందర్భాల్లో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఎక్కడో, ఏదో అన్నారని సహ నటుల గురించి మనసులో ఏదో పెట్టేసుకొని ఆ తర్వాత ఎదురుపడితే ప్లాస్టిక్ నవ్వులు నవ్వే నటులు ఉన్న సినిమా పరిశ్రమలో.. తనను ఓసారి విమర్శించి ఆ తర్వాత సినిమా అవకాశాలు కోల్పోయిన నటి మనోరమను పిలిచి మరీ ఆ తర్వాత సినిమాల్లో ఛాన్స్ ఇచ్చారు తలైవా. తోటి నటులు, తన కంటే జూనియర్ల ప్రతిభను గుర్తించడంలో ఎప్పుడూ ముందుంటారు. వారి గురించి బహిరంగ వేదికల మీద మనసారా పొగిడేస్తారు. ఇలాంటి వాళ్లు ఇప్పుడెందరు ఉన్నారో మీకే తెలుసు.
75 ఏళ్ల జీవితం కదా.. ఎన్ని డక్కామొక్కీలు తినుంటారు చెప్పండి ఆయన. అందుకే అవకాశం వచ్చినప్పుడల్లా జీవితం గురించి ఎన్నో అంశాలు చెబుతుంటారు. ఓ సందర్భంలో రాజకీయాల్లో వెళ్దాం అనుకుని, ఆ తర్వాత వివిధ కారణాల వల్ల ఆగిపోయారు. అయితే ఓ సందర్భంలో ఆయన పదవుల గురించి మాట్లాడుతూ ‘పదవులు కావాలి అనుకోవడం తప్పేం కాదు. కానీ అది డబ్బులు సంపాదించడం కోసం కాకూడదు’ అని అన్నారు.
రజనీకాంత్ తన ఎర్లీ డేస్‌లో మద్యపానం చేసేవారు. ఈ విషయాన్ని ఓ సందర్భంలో ప్రముఖ నటుడు, తలైవా స్నేహితుడు మోహన్‌బాబు కూడా చెప్పారు. అయితే ఆ తర్వాత తీసుకోవడం లేదు. దీని గురించి ఓ సారి మాట్లాడుతూ ‘మన దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని.. నాలుగు సీసాల మద్యం కొనుక్కుంటే మన ఆరోగ్యమే నాశనమవుతుంది’ అని చెప్పారు.
రజనీకాంత్‌ను దగ్గర నుండి చూసినవాళ్లు చెప్పేమాట ఏంటంటే.. ఆయనను కాస్త కదిపితే ఆయన పాటించే సిద్ధాంతాల గురించి ఆసక్తికరంగా చెబుతారు అని. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ‘ఆశావాదిని ఏ విషం కూడా ఏమీ చేయలేదు. కానీ నిరాశావాదిని ఏ ఔషధం కూడా కాపాడలేదు’ అని చెప్పారు. నిజానికి ఇప్పుడు చెప్పిన అంశాలు, విషయాలు, మాటలు చాలా తక్కువ. ఆయన పాటించే విషయాలు ఇంకా చాలానే ఉన్నాయి.
ఈ పుట్టిన రోజుకు ఈ మంచి మాటలు మాత్రమే. ఆయన ఇలాంటి మాటలు చెప్పే అవకాశం మరో 25 ఏళ్లు.. కుదిరితే ఇంకొన్ని సంవత్సరాలు ఆ దేవుడి ఇవ్వాలని కోరుకుందాం. ఇదంతా చెప్పాక అసలు మాట చెప్పకపోతే ఎలా.. హ్యాపీ బర్త్‌డే తలైవా!