పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ఇటీవల సంక్రాంతికి రిలీజ్ అయ్యి, బాక్స్ ఆఫీస్ దగ్గర చతికలపడ్డ చిత్రం ‘రాజాసాబ్’. ఈ మూవీ ఫలితం దర్శకుడు మారుతికి అనూహ్యమైన షాక్ ఇచ్చింది. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోవడానికి ఎన్నో కారణాలు ఉన్నప్పటికీ, విమర్శల భారం మాత్రం పూర్తిగా మారుతీపైనే పడింది. అయితే సినిమా ప్రపంచంలో ఫెయిల్యూర్ కొత్త కాదు. అదే సమయంలో తిరిగి బలంగా కంబ్యాక్ ఇవ్వడమే అసలైన విజయం. పోగొట్టుకున్నచోటే తిరిగి వెతుక్కునే పనిలో ఇప్పుడు దర్శకుడు మారుతీ ఉన్నారు.
కొంతకాలంగా ఈ విమర్శల నుంచి దూరంగా కేరళలో ప్రశాంతంగా ఉండి, తన దగ్గర ఉన్న ఓ స్ట్రాంగ్ పాయింట్‌ను పూర్తి స్థాయి స్క్రిప్ట్‌గా మార్చుకున్నట్లు టాక్. ఈ కథను ఎవరితో తెరకెక్కించాలి అన్నదానిపై ఇంకా క్లారిటీ లేకపోయినా, ఇద్దరు హీరోల పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. వారు ఎవరో కాదు, ఒకరు ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కాగా, మరొకరు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.
రామ్ విషయానికి వస్తే, కెరీర్ ఆరంభం నుంచి యూత్‌ఫుల్ సినిమాలతో మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. రెడీ , ఇస్మార్ట్ శంకర్ వంటి సినిమాలు భారీ విజయాలు సాధించగా, కొన్ని చిత్రాలు మిక్స్‌డ్ ఫలితాలు ఇచ్చాయి. ప్రస్తుతం ఆయన చేతిలో రెండు స్క్రిప్ట్‌లు ఉన్నప్పటికీ, సరైన కిక్ ఇచ్చే ప్రాజెక్ట్ కోసం ఎదురుచూస్తున్నారని సమాచారం. అలాంటి సమయంలో మారుతీ కథ నచ్చితే వెంటనే ఓకే చెప్పే ఛాన్స్ ఉందని సినీవర్గాల నుంచి టాక్.
మరోవైపు వరుణ్ తేజ్ కెరీర్ మొదటి నుంచి కూడా ప్రయోగాలకు పెద్దపీట వేస్తున్నారు. ఫిదా వంటి బ్లాక్‌బస్టర్‌తో క్లాస్ ఆడియన్స్‌ను ఆకట్టుకున్న ఆయన, గద్దలకొండ గణేష్ లాంటి మాస్ రోల్స్‌తోనూ సక్సెస్ అందుకున్నారు. అయితే ఇటీవల కొన్ని సినిమాలు ఆశించిన ఫలితం ఇవ్వలేదు. ప్రస్తుతం యువి బ్యానర్‌లో ఓ సినిమా చేస్తున్నారు. స్క్రిప్ట్ విన్న తర్వాత మారుతీ ప్రాజెక్ట్‌పై ఆయన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే టాక్ కూడా ఆసక్తికరంగా మారింది. మారుతీ – మైత్రీ కాంబో ఎప్పటి నుంచో అనుకుంటున్నాఈ కాంబో అనుకోని కారణాల వాళ్ళ సెట్ అవ్వట్లేదు. ఇప్పుడు అదే కాంబినేషన్ ఫిక్స్ అయితే, దర్శకుడికీ, హీరోకీ ఇది కీలకమైన సినిమా కావడం ఖాయం. చివరకు మారుతీ కథకు ఎవరు గ్రీన్ సిగ్నల్ ఇస్తారన్నది తేలాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.