Max Review in Telugu: మాక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • కిచ్చా సుదీప్ (Hero)
  • వరలక్ష్మి శరత్ కుమార్ (Heroine)
  • ఇళవరసు, సంయుక్త హోర్నాడ్, సునీల్ తదితరులు.. (Cast)
  • విజయ్ కార్తికేయ (Director)
  • కలైపులి ఎస్.థాను - సుదీప్ (Producer)
  • బి.అజనీష్ లోక్నాథ్ (Music)
  • శేఖర్ చంద్ర (Cinematography)
  • Release Date : డిసెంబర్ 27, 2024

“విక్రాంత్ రోనా” అనంతరం దాదాపు రెండేళ్లు విరామం తీసుకొని కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ (Sudeep) నటిస్తూ నిర్మాణ భాగస్వామిగానూ వ్యవహరించిన చిత్రం “మాక్స్” (Max). కన్నడలో డిసెంబర్ 25న విడుదలైన ఈ చిత్రం అక్కడ చక్కని ఓపెనింగ్స్ దక్కించుకుంది, ఆ సినిమా తెలుగు అనువాదరూపాన్ని డిసెంబర్ 27న విడుదల చేశారు. “ఖైదీ” (Kaithi) ఫార్మాట్లో ఒక రాత్రిలో జరిగే యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల్ని ఏమేరకు ఆకట్టుకుందో చూద్దాం..!!

Max Review

కథ: డ్రగ్స్ మత్తులో మినిస్టర్ కొడుకులు ఓ పోలీస్ కానిస్టేబుల్ తో అసభ్యంగా ప్రవర్తించారని, అరెస్ట్ చేసి స్టేషన్లో పెడతారు పోలీసులు. కట్ చేస్తే.. వాళ్లిద్దరూ పోలీస్ స్టేషన్లో చనిపోతారు. దాంతో.. స్టేషన్ లోని పోలీసులందరూ ఎక్కడ మినిస్టర్ మనుషులు తమని చంపేస్తారో అని భయపడుతుండగా..

ఆరోజే బదిలీ అయ్యి సి.ఐగా బాధ్యతలు తీసుకోవాల్సిన మాక్స్ (సుదీప్) వాళ్లకి అండగా నిలుస్తాడు. అసలు మినిస్టర్ కొడుకులు ఎలా చనిపోయారు? వందల్లో వచ్చిన మినిస్టర్ మనుషులను మాక్స్ & టీమ్ ఎలా ఎదుర్కొన్నారు? చివరికి ఏం జరిగింది? అనేది సినిమా కథాంశం.

నటీనటుల పనితీరు: కన్నడలో అభినయ చక్రవర్తిగా పిలవబడే కిచ్చా సుదీప్ మాస్ యాంగిల్ గురించి కొత్తగా చెప్పేదేమీ లేదు. ఈ తరహా నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్స్ లో రఫ్ఫాదించేస్తాడు. ఈ సినిమాలోనూ మాక్స్ గా సుదీప్ స్క్రీన్ ప్రెజన్స్ & యాక్షన్ బ్లాక్స్ లో మ్యానరిజమ్స్ మాస్ ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకుంటాయి.

కీలకపాత్రలో తమిళ నటుడు ఇళవరసు (Ilavarasu) బ్యాలెన్స్డ్ యాక్టింగ్ తో రక్తికట్టించాడు. సునీల్ (Sunil) రెగ్యులర్ డాన్ రోల్లో పర్వాలేదనిపించుకున్నాడు. వరలక్ష్మి శరత్ కుమార్ (Varalaxmi Sarathkumar) నెగిటివ్ టచ్ ఉన్న పోలీస్ రోల్లో తన స్క్రీన్ ప్రెజన్స్ తో ఆకట్టుకుంది. మిగతా సహాయ నటులు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతికవర్గం పనితీరు: ప్రొడక్షన్ డిజైన్ & ఆర్ట్ వర్క్ సినిమాకి మెయిన్ ఎసెట్స్ గా నిలిచాయి. పోలీస్ స్టేషన్ సెటప్ ను చాలా నేచురల్ గా క్రియేట్ చేసారు. యాక్షన్ బ్లాక్స్ ను కంపోజ్ చేసిన విధానం బాగుంది. రెగ్యులర్ ఎలివేషన్ ఫైట్స్ అయినప్పటికీ.. శేఖర్ చంద్ర (Shekar Chandra) సినిమాటోగ్రఫీ కారణంగా అవి కాస్త కొత్తగా కనిపించాయి. ముఖ్యంగా.. ఫ్యాక్టరీ ఫైట్ లో ఎగ్జాస్ట్ ఫ్యాన్ నుండి సుదీప్ నడుచుకుంటూ వచ్చే షాట్ ను కంపోజ్ చేసిన విధానం మంచి హై ఇచ్చింది.

అజనీష్ లోక్నాథ్ (B. Ajaneesh Loknath) పాటలు పెద్దగా ఆకట్టుకోలేదు కానీ.. నేపథ్య సంగీతంతో మాత్రం మరోసారి మ్యాజిక్ చేశాడు. అయితే.. క్లైమాక్స్ లో వచ్చే ఎలివేషన్ బీజీయంలో తెలుగు పదాలు బదులుగా కన్నడ పదాలు వినిపించడం అనేది తెలుగు వెర్షన్ విషయంలో ఎంత అజాగ్రత్తగా ఉన్నారు అనేదానికి నిదర్శనం.

దర్శకుడు విజయ్ కార్తికేయ (Vijay Karthikeyan) కథను రాసుకునేప్పుడు లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) “ఖైదీ” నుంచి ఎక్కువగా ఇన్స్పిరేషన్ తీసుకున్నాడు అనే విషయం స్పష్టం అవుతోంది. అయితే.. కథనం కూడా అదే తరహాలో ఉండడం కాస్త ఇబ్బంది కలిగించే విషయం. సుదీప్ లోని మాస్ యాంగిల్ ను సరికొత్తగా ప్రెజెంట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు కానీ.. ప్రేక్షకుల్ని కథనంలో ఇన్వాల్వ్ చేయడంలో మాత్రం విఫలమయ్యాడు.

ముఖ్యంగా కోర్ పాయింట్ అయిన 13 ఏళ్ల అమ్మాయి కథను సరిగా ఎలివేట్ చేయలేకపోయాడు. అందువల్ల అప్పటివరకు హీరో & టీమ్ చేసిన యాక్షన్ అంతా చప్పబడిపోయింది. అలాగే.. సినిమాను ముగించిన విధానం కూడా కంగారుగా ఉండడంతో ప్రేక్షకుల్ని సంతుష్టపరచలేకపోయాడు. దర్శకుడిగా షాట్ మేకింగ్ & సీన్ కంపోజిషన్ తో అలరించిన విజయ్ కార్తికేయ, రచయితగా మాత్రం విఫలమయ్యాడు.

విశ్లేషణ: ఒక సూపర్ హిట్ సినిమా ఇన్స్పిరేషన్ తో కథ రాసుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. అయితే.. ఆ తరహా కథను కొత్తగా రాసుకోవడం వేరు, అలాగే రాయడం వేరు. ఈ రెండిటికీ మధ్య నలిగి ఇబ్బందిపడింది “మాక్స్”. ఎప్పటికప్పుడు “ఖైదీ”ని గుర్తుచేస్తూ ఉంటుంది. ఆ కారణంగా యాక్షన్ బ్లాక్స్ వరకు పర్వాలేదు కానీ, ఓవరాల్ గా మాత్రం అలరించలేకపోయింది. అయితే.. ఈ కంపేరిజన్స్ తో పనిలేని మాస్ ఆడియన్స్ ను మాత్రం యాక్షన్ సీన్స్ కచ్చితంగా మెప్పిస్తాయి.

ఫోకస్ పాయింట్: మాక్సిమమ్ ట్రై చేశారు!

రేటింగ్: 2.5/5

Rating

2.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus