1957 మార్చి 27 .. తెలుగు చిత్ర పరిశ్రమ మరిచిపోలేని రోజు. కెవి రెడ్డి దర్శకత్వ ప్రతిభ, విజయ ప్రొడక్షన్స్ నిర్మాణపు విలువలు, మార్కస్ బార్ట్లే కెమెరా మాయ.. ఎస్వీఆర్, ఎన్టీఆర్, గుమ్మడి , సావిత్రి వంటి నటీనటుల అభినయం కలిసి తయారయిన మాస్టర్ పీస్ మాయాబజార్. ఈ ఎవర్ గ్రీన్ క్లాసికల్ ఫిల్మ్ నేటితో షష్టిపూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలోని మాయల గురించి ఫోకస్ ..
మణిహారంమహాభారతంలోని ప్రధాన పాత్రల మధ్య జరిగే భావోద్వేగ సంఘటనల మణిహారమే మాయాబజార్ కథ. ఈ సినిమా కథ స్క్రిప్ట్ గా చేయడానికి ఒక ఏడాది పట్టింది. నటీ నటులు, టెక్నీషియన్లు 400 మంది కలిసి ఈ చిత్రాన్నిరూపం ఇచ్చారు. మార్చి 27 , 1957 న విడుదల అయిన ఈ చిత్రం 24 సెంటర్లలో 100 రోజులు ఆడింది.
తొలి ద్వి భాష చిత్రంఒకే సారి రెండు భాషలలో నిర్మించిన మొదటి చిత్రం మాయాబజార్. ఏకకాలంలో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కించారు. రెండు భాషల్లోనూ సినిమా సూపర్ హిట్. తర్వాత కన్నడ, బెంగాలీ, హిందీ భాషల్లోకి అనువదించారు. అన్ని చోట్లా హిట్టే.
భారీ బడ్జెట్ముప్పై వేల రూపాయలతో సినిమాలను కంప్లీట్ చేసే రోజుల్లో విజయ ప్రొడక్షన్స్ వారు రెండు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ కళాఖండాన్నినిర్మించారు. దేశం లోనే తొలి సారిగా రెండు లక్షలతో నిర్మితమైన సినిమా చరిత్రలో నిలిచిపోయింది.
కెమెరాతో మాయ పాతాళ భైరవితో పేరు తెచ్చుకున్న సినిమాటోగ్రాఫర్ మార్కస్ బార్ట్లే తన కెమెరా పనితనంతో వెండితెరపై అద్భుతాలను ఆవిష్కరించారు. ఎటువంటి గ్రాఫిక్స్ లేకుండా కొన్ని ట్రిక్స్ తో ప్రేక్షకులను ఆశ్చర్యంలో ముంచెత్తారు. వివాహ భోజనంబు.. లాహిరి లాహిరి పాటల చిత్రీకరణ మార్కస్ బార్ట్లే ట్యాలెంట్ కి నిదర్శనం.
కృష్ణుడు గా ఎన్టీఆర్ కనిపించిన తొలి మూవీ‘ఇద్దరు పెళ్ళాలు’ (1954), ‘సొంతవూరు’ (1956) సినిమాల్లో కృష్ణుడు గా ఎన్టీఆర్ కాసేపు కనిపించారు. కానీ, పూర్తిస్థాయిలో పౌరాణిక కృష్ణుడిగా కొత్త గెటప్ లో అలరించడం మొదలుపెట్టింది మాత్రం ‘మాయాబజార్’తోనే. ఈ చిత్రం విడుదల తర్వాత 40,000 పైగా కృష్ణుడిగా ఉన్న ఎన్టీఆర్ క్యాలెండరు లు ప్రజలకు అందించారు. ఈ చిత్రం తర్వాత ఎన్టీఆర్ దాదాపు 19 పైగా చిత్రాల్లో కృష్ణుడిగా నటించారు.
ముందు పేరు ఘటోత్కచుడుమాయాబజార్ సినీమాకు మొదట అనుకున్న పేరు ఘటోత్కచుడు. ఎందుకంటే ఎస్వీఆర్ అప్పుడు పెద్ద స్టార్. అతను పోషించే పాత్రతో టైటిల్ పెడితే మార్కెట్ బాగుంటుందని భావించారు. కానీ ఎస్వీఆర్ మాయాబజార్ పెట్టమని సూచించారట. ఆలా పేరు మారింది.
అత్యద్భుత చలన చిత్రం2013 లో CNN – IBN వారు నిర్వహించిన పోల్ లో భారత దేశం లోనే చూడదగ్గ అత్యద్భుత చలన చిత్రాల జాబితాలో మొదటిది గా మాయాబజార్ నిలిచింది.
పుస్తకంలో పాఠంమాయాబజార్ గురించి నేటి తరం వారికీ తెలియాలని 2014 నుంచి ఆంధ్ర ప్రదేశ్ 10వ తరగతి ఆంగ్ల పుస్తకం లో నాల్గవ పాఠం లా ఈ సినిమాని చేర్చారు.
వెయ్యికోట్ల చిత్రం1957 లో ఉత్తమ తెలుగు చిత్రం గా ఫిలిం ఫేర్ అవార్డు అందుకున్న ఈ మూవీ ఈ సమయంలో రూపుదిద్దుకుని, రిలీజ్ అయితే వెయ్యికోట్లు తప్పకుండా వసూలు చేస్తుంది.
బ్లాక్ అండ్ వైట్ టు కలర్ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్‌లోకి మార్చిన తొలి భారతీయ సినిమా ప్రసిద్ధ ‘మొఘల్-ఏ-ఆజమ్’. ఆ ఘనత సాధించిన తొలి సౌతిండియన్ సినిమా ‘మాయాబజార్’., హైదరాబాద్‌కు చెందిన గోల్డ్‌స్టోన్ టెక్నాలజీస్ సంస్థ నెగిటివ్‌ను డిజిటైజ్ చేసి, ఆడియోను 5.1 ఛానల్స్‌లో రీ-మాస్టరింగ్ చేసి, సినిమాస్కోప్ లో, డి.టి.ఎస్. శబ్ద పరిజ్ఞానంలో ఈ కొత్త కలర్ వెర్షన్ ను సిద్ధం చేసింది. 2010 జనవరి 30 నాడు రిలీజై మరోసారి విజయం సాధించింది.